కోడుమూరు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
కర్నూలు సీక్యాంప్: తాజా చేరికలతో టీడీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ టీడీపీలో చేరడంతో ఆ నియోజకవర్గంలో విభేదాలు రచ్చకెక్కాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయులంతా కలిసి శుక్రవారం కర్నూలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాము అండగా నిలిచామని, అయితే ఇంకో వర్గం తనను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే మణిగాంధీ ద్వారా రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
మణిగాంధీని టీడీపీ ఇన్‌చార్జ్ ఇస్తే తనతోపాటు తన వర్గీయులైన సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పార్టీకి రాజీనామా చేస్తారని హెచ్చరించారు. తమ మద్దతుతోనే జిల్లాలో టీడీపీ..ఎమ్మెల్సీ పదవిని కైవసం చేసుకుందన్నారు. త్యాగాలు చేసిన తమను కాదని, ఇంకొకరికి పార్టీ పదవి ఎలా ఇస్తారని మండిపడ్డారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ తాగుబోతు, తిరుగుబోతని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు తీవ్ర విమర్శలు చేశారు. జనాకర్షణ లేని నాయకుడని మండిపడ్డారు. తమ మద్దతు లేకుండా మణిగాంధీకి పార్టీలో ఎలాంటి అవకాశం కల్పించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.