కలెక్టరేట్‌ను ముట్టడించిన గ్రామస్తులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఓ విద్యార్థి నిండు ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందంటూ గొందిపర్ల గ్రామస్తులు కర్నూలు కలెక్టరేట్‌ను గురువారం ముట్టడించారు. ఉదయం 12.30 గంటలకు గొందిపర్ల గ్రామస్తులతో పాటు క్వార్టర్స్, ఇందిరమ్మ కాలనీ, పూలతోట, సుందరయ్యనగర్ వాసులు గాంధీ విగ్రహం ఎదుట బైటాయించారు. బాధిత విద్యార్థి కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ బయటకు వచ్చి తుంగభద్ర నదిపై బ్రిడ్జి నిర్మించే వరకు తమ ఆందోళనను విరమించేది లేదని భీష్మించారు.
రెండ్రోజుల కిందట బ్రిడ్జి లేకపోవడంతో ఉస్మానియా కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివే మోహన్ అనే విద్యార్థి అకస్మాత్తుగా వచ్చిన వరద నీటిలో కొట్టుకుపోయి మృత్యువాతపడినట్లు వారు కన్నీటిపర్యంతమయ్యారు. సకాలంలో బ్రిడ్జి నిర్మించి ఉన్నట్లైతే ఓ నిండుప్రాణం బలై ఉండేది కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులకు మద్దతుగా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, అలంపూరు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షడ్రక్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మద్దుతు తెలిపారు.
గంటకుపైగా ధర్నా కొనసాగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాపిక్ డీఎస్పీ రామచంద్ర అక్కడికి చేరుకొని గ్రామస్తులతో చర్చించారు. కలెక్టర్ వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదని వారు స్పష్టం చేశారు. దీంతో డీఎస్పీ స్పందిస్తూ.. పది మంది గ్రామస్తులు వస్తే కలెక్టర్‌తో మాట్లాడిస్తానంటూ చెప్పడంతో వారు ధర్నా విరమించారు.