
కారెక్కిన చిట్టెం
జిల్లాలో అధికార పార్టీలోకి రాజకీయ వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.. కొన్నినెలల క్రితం ...
► గులాబీ తీర్థం పుచ్చుకున్న మక్తల్
► ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి
► మంత్రి లక్ష్మారెడ్డి వెంట సీఎం కేసీఆర్ వద్దకు..
► నియోజకవర్గ అభివృద్ధి కోసమే
► టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని ప్రకటన
► కాంగ్రెస్ నుంచి ఒక వికెట్ ఔట్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలో అధికార పార్టీలోకి రాజకీయ వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.. కొన్నినెలల క్రితం నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోగా, కాంగ్రెస్‌లో కీలకనేతగా ఉన్న మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్‌ను కలిసి పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. జిల్లా కాంగ్రెస్‌లో కీలకనేతగా ఉన్న మాజీమంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణకు సోదరుడైన రాంమోహన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం రాజకీయవర్గాల్లో సంచలనం రేకెత్తించింది. కొంతకాలంగా టీఆర్‌ఎస్‌లో చేరడానికి ప్రయత్నిస్తున్నారని జరుగుతున్న ప్రచారానికి ఆయన తెరదించారు.
చిట్టెం రాంమోహన్‌రెడ్డి తండ్రి చిట్టెం నర్సిరెడ్డి మరణానంతరం 2005లో రాజకీయాల్లోకి వచ్చారు. 2005లో జరిగిన శాసనసభ ఉపఎన్నికలో ఆయన మక్తల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. 2009లో అదే నియోజకవర్గం నుంచి ఓటమి చవిచూసిన చిట్టెం 2014లో కాంగ్రెస్ నుంచి తిరిగి మక్తల్ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసమే!
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జిల్లాలో ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరి, అభివృద్ధి కార్యక్రమాల్లో చూపుతున్న వివక్షపై చిట్టెం జిల్లా పరిషత్ సమావేశాలు, ఇతర వేదికలపై బహిరంగంగానే పోరాటం చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశం సాక్షిగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్‌తో వాదోపవాదం జరిగి చిట్టెంపై దాడికి దారితీయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఇందుకు నిరసనగా కాంగ్రెస్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది.
మక్తల్ శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నామని, కనీసం నియోజకవర్గంలో ప్రజల గొంతు తడపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన చిట్టెం ఇటువంటి కారణాలతోనే అధికార పార్టీ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. చిట్టెం రాంమోహన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరికపై కాంగ్రెస్ నుంచి ఇంకా కారు ఎక్కేవారిలో ఎవరున్నారనేది రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అనేక మంది పేర్లు ప్రచారంలో ఉండడం విశేషం.
‘మక్తల్’ అభివృద్ధి కోసమే..
మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నా.. భీమా ప్రాజెక్టు పూర్తయితే వేలాది ఎకరాల బీడుభూములు సాగులోకి వస్తాయి. ప్రాజెక్టును పూర్తిచేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సీఎం కేసీఆర్ హామీఇచ్చారు. త్వరలోనే ఆత్మకూర్, నర్వ, మాగనూరు, ఊట్కూర్, మక్తల్ మండలాల నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా.. - ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి