
కలిసిన నేతలు.. కలవని మనసులు
సొంత పార్టీలో మరో వర్గంలోని నేతలను తన వర్గంలో చేర్చుకుని పార్టీ మారిన తరహాలో కండువాలు ......
కర్నూలులో నువ్వానేనా!
► ఆధిపత్యం కోసం పార్టీ మారిన నేత ఆరాటం
► తన వర్గంలో చేరితే మేయర్‌ను చేస్తానని ఆఫర్
► నగరంలో నందికొట్కూరు తరహా రాజకీయాలు?
► కార్పొరేషన్ ఎన్నికలకు ముందే రాజుకుంటున్న చిచ్చు
► కలిసి పనిచేస్తామంటూనే కత్తులు దూస్తున్న వైనం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సొంత పార్టీలో మరో వర్గంలోని నేతలను తన వర్గంలో చేర్చుకుని పార్టీ మారిన తరహాలో కండువాలు కప్పుకునే నందికొట్కూరు తరహా అధికార పార్టీ రాజకీయం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికీ పాకిందా? అధికార పార్టీలో ఉన్న ఇరువురు నేతల మధ్య క్రమంగా దూరం పెరుగుతోందా? కలిసి పనిచేస్తామంటూనే ఆధిప్యత రాజకీయాలకు తెరలేసిందా? అనే వరుస ప్రశ్నలకు నిజమేనని ఆ పార్టీలోని కొందరు నేతలే ఘంటాపథంగా చెబుతున్నారు. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలు కేంద్రంగా చేసుకుని కొత్తగా అధికార పార్టీలో చేరిన నేత ఒకరు అవతలి వైపున్న నేతలకు గాలం వేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. తన వెంట నడిస్తే కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తానని ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. కలిసి పనిచేస్తామని ప్రకటనలు ఇస్తూనే కత్తులు దూసుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని అధికార పార్టీలో చర్చ మొదలయింది.
ఇక్కడ నాదే పైచేయి
రానున్న కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలు కేంద్రంగా అధికార పార్టీలో రాజకీయం జరుగుతోంది. వాస్తవానికి ఇప్పటికీ కార్పొరేషన్ మేయర్ పీఠం ఏ వర్గానికి కేటాయిస్తారనే విషయంలో స్పష్టత రాలేదు. గతంలో ఉన్న రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం బీసీ మహిళకు అవకాశం ఉంది. అయితే.. మారిన జనాభా, వార్డుల నేపథ్యంలో ఎవరికి పీఠం దక్కుతుందనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా బీసీ జనరల్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరికొద్ది మంది అధికార పార్టీ నేతలు ఓసీ జనరల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీనిపై ఇప్పటికే బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో బీసీలకే కేటాయించే అవకాశం కనిపిస్తోంది.
దీని ఆధారంగా ఎన్నికల ముందు నుంచి అధికార పార్టీలో ఉండి.. తాజాగా పెద్దల సీటు సంపాదించిన నేత వెనుక నడుస్తున్న బీసీ నేతకు తాజాగా పార్టీలో చేరిన నేత గాలం వేసినట్టు సమాచారం. కార్పొరేషన్‌లో పైచేయి తనదేనని.. సీట్ల కేటాయింపులోనూ తన మాటే చెల్లుబాటు అవుతుందనే ప్రచారం ఆయన చేసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. తన వర్గంలో ఉంటే మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు గెలిపించుకుంటానని కూడా భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఆయన కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో తనదే పైచేయి అనే సంకేతాలను పంపే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే, రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎక్కడకు దారితీస్తాయోననే చర్చ అధికార పార్టీలో మొదలయింది.