
జన్మభూమిలో తమ్ముళ్ల బరితెగింపు
► జన్మభూమిలో పచ్చదండు దాష్టీకం
► నిలదీసిన వారిపై దాడులు, ముష్టి ఘాతాలు
► ప్రశ్నించినవారి గెంటివేత
అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా గ్రామ సభ వద్ద వ్యక్తి ఆత్మహత్యా యత్నం
ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదంటూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు, నిలదీతలు
జన్మభూమి సభలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల నియంతృత్వపోకడలు రాజరిక పాలనను మరోసారి గుర్తు చేస్తున్నాయి. అధికార పార్టీనాయకుల బరితెగింపుతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. సమస్యలు పరిష్కరించేందుకు చేపట్టిన సభలు కాస్తా ఆధిపత్యాన్ని చాటుకునే వేదికలుగా మారాయి. సమస్య చెబితే హెచ్చరికలు... ప్రశ్నిస్తే దౌర్జన్యాలు.. ఇదేమని నిలదీస్తే పిడిగుద్దులు... ఇంకా మొండికేస్తే గెంటివేతలు... ఇదీ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల తీరు తెన్నూ...
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జన్మభూమి గ్రామ సభల్లో టీడీపీ నాయకుల దౌర్జన్యం పెచ్చుమీరుతోంది. సమస్యలపై ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతున్నారు. జన్మభూమి గ్రామ సభ సందర్భంగా పెద్ద శబ్దంతో బాకాల్లో పాటలు వేయడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ నాయకులు, స్థానికులను టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి చావబాదారు. మరోసారి ప్రశ్నించకుండా ముష్టి ఘాతాలు కురిపించారు. విజయనగరం ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ కౌన్సిలర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో హైస్కూల్ విద్యార్ధులు పరీక్ష రాస్తుండగా బాకాలు పెట్టి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్న వైనాన్ని ప్రశ్నించినందుకు భౌతిక దాడులకు పాల్పడ్డారు.
పార్వతీపురంలోని ఏడో వార్డులోని కేపీఎం హై స్కూల్‌లో విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. వరండాలో రాస్తున్న విద్యార్థులకు ఈ శబ్దాలు అసౌకర్యంగా మారాయి. దీనిపై వైఎస్సార్‌సీపీ నాయకులు దేవుపల్లి నాగరాజు, మజ్జి వెంకటేష్‌లతో పాటు స్థానికులు కూడా టీడీపీ నాయకులను ప్రశ్నించారు. అదే అవకాశంగా భావించిన టీడీపీ కార్యకర్తలు ఉన్న పళంగా వీరిపై దాడులు చేశారు. దొరికిన వారిని దొరికినట్టు చితక్కొట్టారు. టీడీపీ నాయకుల నిర్లక్ష్యాన్ని, పట్టించుకోని వైనాన్ని ప్రశ్నించిన వారంతా ఒక్క సారిగా అవాక్కయ్యారు. తేరుకోకముందే వారిపై టీడీపీ నాయకులు పిడిగుద్దులు కురిపించారు. దీంతో స్థానికులు, వైఎస్సార్‌సీపీ నాయకులు తలోదిక్కుకు పారిపోయారు.
కొత్తవలస మండలం తాడివానిపాలెం గ్రామానికి చెందిన బోని సత్యం తన వద్ద ఎస్సీలకు ఇళ్ల పట్టాలిచ్చేందుకు భూమిని తీసుకుని ఇప్పటి వరకూ ప్రత్యామ్నాయంగా వేరేచోట భూమి ఇవ్వలేదనీ, ఎన్నిమార్లు అధికారులను ప్రశ్నించినా సమాధానం ఇవ్వడం లేదనీ మంచినీటి పథకం ఓవర్ హెడ్ ట్యాంకుపైకి ఎక్కి ఆత్మహత్యా యత్నం చేసాడు. ఎంత మంది చెప్పినా వినలేదు. చాలా సేపు అక్కడే ఉండిపోవడంతో అధికారులు, స్థానికులు బతిమిలాడి మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో అతను కిందికి దిగాడు.
మెరకముడిదాం మండలం ఊటపల్లి, మక్కువ మండలం తూరు మామిడి, జామి మండలం భీమసింగి తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయనీ, కేంద్రాల్లో ఎక్కడా ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో పందికొక్కులు, దొంగల పాలవుతున్నాయనీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఇబ్బందులు కలుగుతున్నాయనీ నిలదీశారు. అలాగే రేషన్ కార్డులు, పింఛన్లను కేవలం అధికార పార్టీ వర్గాల వారికే ఇస్తున్నారని గ్రామసభల్లో నిలదీశారు.
విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు ఇందిరానగర్‌లో నిర్వహించిన గ్రామసభలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు ఆశపువేణు, జి.వి.రంగారావు, దానబాబుల ఆధ్వర్యంలో పలువురు నాయకులు అపరిష్కృత సమస్యలు పరిష్కరించమన్నందుకు తెలుగు తమ్ముళ్లు దుర్భాషలకు దిగారు. రేషన్ కార్డులు కొంత మందికే ఇచ్చి రాజకీయం చేస్తున్నారని అధికారులను నిలదీశారు.
పూసపాటిరేగ మండలం వెంపడాంలో పిన్నింటి వెంకటరమణ తదితరులు పింఛన్ల మంజూరులో పక్షపాత వైఖరిని ఎండగడుతూ నిలదీశారు.
గజపతినగరం మండంల కెంగువలో అనధికారిక కుళాయిలపై మజ్జి రామకృష్ణ తదితరులు ప్రశ్నించగా ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వాదులాట జరిగింది. ఏఎస్‌ఐ త్రినాధ సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. మెరకముడిదాం మండలం జి.మర్రివలసలో గత సమస్యల్లో ఎన్ని పరిష్కరించారో చెప్పి అప్పుడు గ్రామ సభ నిర్వహించాలని సర్పంచ్ గొర్లె రామారావు నిలదీయగా సంబంధిత ఫైలు తేలేదని అధికారులు చెప్పడం కొసమెరుపు.