ఉద్యాన శాఖలో భారీ అవినీతి
► అవినీతి ‘పందిరి’
► ‘పందిరి పంటల’ నిధులు పక్కదారి
► గుట్టు చప్పుడు కాకుండా కాజేస్తున్న
► అధికార పార్టీ నేతలు.. సహకరిస్తున్న అధికారులు
ఉద్యాన శాఖఆధ్వర్యంలో అమలవుతున్న ‘పందిరి పంటలు’ పథకం అవినీతికి కేరాఫ్‌గా మారింది. పంటలేదు.. పందిరి లేదు.. భూమి అసలే లేదు. అయినా బినామీల ఖాతాల్లో ప్రతినెలా రూ.లక్షలు జమఅవుతోంది. ఇలా జమ అయిన మొత్తాన్ని అధికార పార్టీ నాయకులు, అధికారులు కలిసి పంచుకుంటున్నారు. అంతిమంగా అర్హులైన రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న బీడు భూమిధర్మవరం మండలం దర్శినమల గ్రామానికిచెందిన చంద్ర మోహన్ అనే రైతుది. ఇందులో పందిళ్లు వేసి, తీగజాతి పంటలైన బీర, కాకర సాగు చేస్తున్నట్లు ఉద్యానశాఖకు దరఖాస్తు చేశాడు. అధికారులు ఏమాత్రమూ పరిశీలన చేయకుండానే ఉద్యాన శాఖ ఖాతా (నం :0098561007907) నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఏడాది మార్చి తొమ్మిదిన సదరు రైతు ఎస్‌బీఐ ఖాతా(నం:20316867772)కు రూ. 2,25,778 జమ చేశారు.
ఇక్కడున్నది ద్రాక్ష తోట. కానీ ఉద్యానశాఖ అధికారుల లెక్కల ప్రకారం కుళ్లాయప్ప అనే రైతు ఇక్కడ కాకర పంట సాగు చేస్తున్నాడు. ఇందుకు గాను ఆయన ఎస్‌బీఐ ఖాతా (నంబర్ 20250313712)కు గతేడాది నవంబర్ ఏడున రూ. 3,38,667, నవంబర్ 19వ తేదీన రూ. 1,00,000 జమ చేశారు. వాస్తవానికి ఈ భూమి దర్శినమలకు చెందిన హరి అనే రైతు పేరిట ఉంది. కుళ్లాయప్ప అనే రైతు పేరిట నకిలీ ఖాతాను సృష్టించి, ప్రభుత్వ నిధులను కాజేశారు. ఇలా ఒక్క దర్శినమల గ్రామంలోనే దాదాపు 20 మంది పేరిట రూ.40 లక్షల దాకా స్వాహా చేశారు.
ధర్మవరం : రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై) కింద ఉద్యాన శాఖ అమలు చేస్తున్న ‘పందిరి పంటలు’ పథకం అధికార పార్టీ నేతలు, అధికారులకు కాసుల పంట పండిస్తోంది. ఈ పథకం కింద పందిళ్లు వేసి, తీగజాతి పంటలు (కాకర, బీర లాంటివి) సాగు చేస్తే ఎకరానికి రూ. 1,10,000 చొప్పున గరిష్టంగా రెండెకరాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. పొలంలో రాతి బండలు పూడ్చి, వాటిపైన ఇనుప తీగలు అల్లాలి. పంటలు సాగు చేసేందుకు బోరు, మోటార్, డ్రిప్ అన్నీ అమర్చి ఉండాలి. ఇందుకోసం మంజూరైన మొత్తాన్ని వెనక్కి చెల్లించాల్సిన అవసరం (100 శాతం సబ్సిడీ) ఉండదు. ఈ క్రమంలో ఈ పథకంపై అధికార పార్టీ నాయకులు కన్నేశారు. వారికి ఏళ్ల తరబడి ఇక్కడే పాతుకుపోయిన అధికారులు సహకరించారు. బినామీ రైతుల పేర్లతో ఖాతాలు తెరిచి..స్వాహా పర్వానికి తెరలేపారు.
కీలక భూమిక పోషించిన ఓ ఉన్నతాధికారి
ఈ స్వాహా పర్వంలో ఉద్యానశాఖ డివిజన్ స్థాయి అధికారి కీలక భూమిక పోషించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. తాడిమర్రి, బత్తలపల్లి, ముదిగుబ్బ, ధర్మవరం రూరల్ మండలాల్లో కొందరు బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని, ఈ స్వాహా పర్వానికి తెరలేపినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు కొందరు సదరు అధికారిని నిలదీయడంతో వారికి రూ. 5 లక్షల మేర ముట్టజెప్పినట్లు సమాచారం. ఆ తరువాత కూడా సదరు నాయకులు, అధికారి కలిసి భారీ స్థాయిలో బోగస్ రైతులను సృష్టించి.. నిధులు స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ ముఖ్య నాయకుడు సదరు అధికారిని తీవ్ర స్థాయిలో మందలించారు. దీంతో ఇక్కడి నుంచి బదిలీ చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సదరు అధికారి వ్యవహారంపై ఇప్పటికే ఉద్యాన శాఖలోని ఉన్నతాధికారులకు కూడా బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. అన్ని అర్హతలు ఉన్నా తమను మాత్రం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని, స్వాహారాయుళ్లకు మాత్రం వెంటనే పనులు చేసిపెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు.