ఎంపీడీఓల బదిలీలకు
► కొందరు అధికారపార్టీ నేతల్లో అసంతృప్తి
► యూనియన్ నేతకు ప్రాధాన్యంపై ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలో ఎంపీడీఓల బదిలీలకు బ్రేక్‌పడింది.. సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్నవారితో పాటు పలు ఆరోపణలు, ఫిర్యాదులు.. తదితర కారణాలతో 25 మంది ఎంపీడీఓలను బదిలీచే స్తూ మంగళవారం జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎంపీడీఓల బదిలీలు అధికారపార్టీకి చెందిన కొందరు నేతల్లో అసంతృప్తిని రాజేసింది. తమకు కావాల్సినవారిని ఇతర ప్రాంతాలకు పంపించడం, తమ కన్నా ఓ యూనియన్ మాటే చెల్లుబాటు అయిందన్న కారణాలతో ఎంపీడీఓల బదిలీలను తాత్కాలికంగా నిలిపేయాలని అధికారపార్టీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే ఈ బదిలీల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపడంతో అధికారులు బదిలీ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారం అధికారపార్టీకి చెందిన కొందరు నేతలతో పాటు ఎంపీడీఓల్లో అసంతృప్తిని కలిగించింది. ప్రస్తుతం కీలకస్థానాల్లో ఉన్న అధికారులకే మళ్లీ కీలకస్థానాలు లభించడం వెనక ఏ మంత్రాంగం జరిగిందోన్న అంశం ఎంపీడీఓల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ప్రజాప్రతినిధుల అసంతృప్తిని తగ్గించేందుకు జిల్లాకు చెందిన మంత్రి ఒకరు బదిలీలను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించినట్లు తెలిసింది. దీంతో అధికారులు బదిలీ ఉత్తర్వులు జారీచేయకుండా ప్రభుత్వానికి ర్యాపికేషన్ రూపంలో పంపించడానికి సిద్ధమవుతున్నారు. ఎంపీడీఓల బదిలీలకు సంబంధించి అధికారపార్టీ నేతలు, కొందరు ప్రజాప్రతినిధుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అందరినీ సాధ్యమైనంత వరకు సంతృప్తిపరిచేలా బదిలీల్లో కూర్పుచేసినా చివరికి నిలిపివేయాలని పార్టీ నేతల నుంచే ఒత్తిడి రావడంపై ఒక ప్రజాప్రతినిధి కొందరు ఎంపీడీఓల ముందే ఆవేదన వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎంపీడీఓల బదిలీల వ్యవహారం జిల్లాలో రాజకీయ వేడిని కలిగించింది. ఎంపీడీఓల బదిలీల్లో యూనియన్ నేత ఒకరు కీలకంగా వ్యవహరించడం సైతం అధికార పార్టీలోని కొందరు ప్రజాప్రతినిధుల్లో అసంతృపి రగిలించేందుకు కారణమైందని ప్రచారం జరుగుతోంది.
సదరు యూనియన్ నేతకు బదిలీకి అర్హత లేకపోయినా పరిపాలన కారణాల పేరుతో తన నివాస ప్రాంతానికి సమీపంలోనే పోస్టింగ్ ఇవ్వడం ఇటు అధికార పార్టీలోనూ అటు ఎంపీడీఓల్లోనూ పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం బదిలీల్లో కొందరి పోస్టింగ్ సహేతుకంగా లేదని వాటిని మార్చాల్సిందేనని పట్టుబట్టడం విశేషం. దీంతో ఆఘమేఘాల మీద ఎంపీడీఓల బదిలీలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.