RKVY
-
పొట్టి దూడ.. గట్టి మేలు!
పలమనేరు(చిత్తూరు జిల్లా): పుంగనూరు పొట్టిరకం దూడలకు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. పుట్టినప్పుడు కేవలం అడుగు మాత్రమే ఎత్తు ఉండి, తన జీవితకాలంలో మూడు అడుగులు మాత్రమే పెరుగుతుంది. అయితే ఈ దూడలకు ఉండే తోక నేలకు తాకేట్లు ఉంటే... ఆ రకానికి విపరీతమైన డిమాండ్ ఉన్నట్టే. వీటిలో మొదటిరకం రూ.2 నుంచి రూ.4 లక్షలు పలుకుతుండగా, రెండో రకం రూ. 50వేల నుంచి రూ.4 లక్షల ధర పలుకుతోంది. ఇంత ఖరీదైనా, ప్రస్తుతం ఇవి అందుబాటులో ఉండడం లేదు. ఈ దూడల్లో తోక నేలకు తాకడం, గోపురం కింద గంగడోలు కిందికి ఉండే రకాలు ఇళ్లల్లో ఉంటే ఆరోగ్యంతోపాటు అదృష్టం వరిస్తుందనే నమ్మకం చాలామందిలో ఉంది. సాంకేతికంగా ఈ జాతి దూడలు తక్కువ మేత తింటూ, ఎక్కువ రోగ నిరోధకశక్తి కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలున్న దూడల కొనుగోలుకు ఏపీలోని ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురము, ఉభయ గోదావరి జిల్లాలు సహా దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన బడాబాబులు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఔషధ గుణాలు మెండు అరుదైన రకం పశువులుగా ఈ పుంగనూరు పొట్టి దూడలకు పేరుంది. అధిక వ్యాధి నిరోధక శక్తి, తక్కువ మేతతో ఎక్కువ వెన్నశాతం కలిగిన పాలనిస్తాయి. వీటి పాలు, మూత్రంలలో ఔషధ గుణములు మెండుగా ఉన్నాయి. అయితే వీటి ఉనికి ప్రశార్థకమవుతున్న తరుణంలో మరిన్ని దూడల ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) ద్వారా కృషి చేస్తోంది. దేశంలో ఇలాంటి పశువులు 700 దాకా ఉండగా, దీన్లో 277 చిత్తూరు జిల్లా పలమనేరులోనే ఉన్నాయి. వీటిలో కుర్ర దూడలు 33, పెయ్య దూడలు 17 ఉండగా, మిగిలినవి ఎద్దులు, ఆవులు. పలమనేరు పరిశోధనా సంస్థలో ఉత్పత్తి... 1953లో పలమనేరు కెటిల్ఫామ్ వద్ద ‘సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధన కేంద్రం’ ప్రారంభమైంది. అనంతరం ఇన్‌సైటీవ్ కన్సర్వేషన్ (స్థానికంగా పొట్టి దూడల సంఖ్యను ఉత్పత్తి చేయడం) అనే లక్ష్యంతో 1995లో పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. స్థానిక అధికారులు మేలైన పుంగనూరు రకం ఎద్దుల వీర్యాన్ని స్థానికంగా ఈరకం ఆవులు కలిగివున్న రైతులకు అందిస్తున్నారు. తద్వారా వారి వద్ద పొట్టి దూడల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది. పలమనేరు సహా రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఔత్సాహిక రైతులు ఫామ్స్‌లో ఈ పొట్టిజాతిని ఉత్పత్తి చేస్తూ లక్షల్లో విక్రయిస్తున్నారు. గణనీయ ఉత్పత్తికి కృషి ఆంధ్రప్రదేశ్ పశు అభివృద్ధి సంఘం (ఏపీఎల్డీఏ) ద్వారా పుంగనూరు రకం ఎద్దుల వీర్యాన్ని ఎదకొచ్చిన, పుంగనూరు ఆవులు కలిగిన ఉన్న రైతులకు స్థానిక పశువైద్యుడి పర్యవేక్షణలో అందిస్తూ, ఈ జాతి అభివృద్ధి అయ్యేలా కృషి చేస్తున్నాం. అవసరమైన రైతులు కెటిల్ఫామ్లో సెమన్ పొందవచ్చు.– డా.వేణు, సైంటిస్ట్, పశు పరిశోధన కేంద్రం, పలమనేరు -
ఆర్కేవీవై కింద రాష్ట్రానికి అదనంగా రూ.223 కోట్లు
సాక్షి, అమరావతి: వ్యవసాయ అనుబంధ రంగాల బలోపేతానికి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్కేవీవై) కింద తాజాగా రూ.223 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఆర్కేవీవై కింద ఏటా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులకు ఇవి అదనం. రైతుల ఆదాయం పెంచేందుకు అవసరమైన సాగు ఉత్పాదకతలను పెంపొందించే లక్ష్యంతో 60:40 నిష్పత్తిలో కేంద్రం ఆర్కేవీఐ కింద రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తుంది. ఈ పథకం కింద 2020–2021 ఆర్థిక సంవత్సరానికి రూ.298 కోట్లను మంజూరు చేసింది. అందులో తన వాటా కింద కేంద్రం రూ.164 కోట్లు విడుదల చేయగా.. వాటికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను జతచేసి ఆర్బీకేల్లో అదనపు సౌకర్యాలకోసం ఖర్చుచేసింది. ఈ నేపథ్యంలో రైతులకోసం ఆర్బీకేలకు అనుబంధంగా నియోజకవర్గ స్థాయిలో అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు తీసుకొస్తున్నామని, కస్టమ్ హైరింగ్ సెంటర్లనూ ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం ఆర్కేవీవై కింద అదనంగా మరో రూ.242 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్రప్రభుత్వం అభ్యర్థించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం రూ.223 కోట్లు అదనంగా ఖర్చు చేసేందుకు ఆదేశాలిచ్చింది. అందులో తన వాటాగా రూ.134 కోట్లను విడుదల చేస్తూ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ శనివారం ఉత్తర్వులిచ్చింది. ఈ నిధులతో అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌ల్లో పరికరాలు కొనుగోలు చేయనున్నారు. -
ఆర్‌కేవీవైకి టాటా!
ఒంగోలు టూటౌన్: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నూతన పథకం తీసుకురానుంది. అయితే ఉద్యాన శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేస్తున్న రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం (ఆర్కేవీవైð) ఇక కనుమరుగుకానుంది. మార్చి వరకు మాత్రమే ఈ పథకం అమల్లో ఉంటుంది. అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా పని చేయదు. ఈ నేపథ్యంలో 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి ఆర్కేవీవై స్థానంలో రాఫ్తార్(ఆర్‌ఏఎఫ్‌టీఏఆర్)ను అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. మరింత సమర్థవంతంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నదే కేంద్రం ఉద్దేశమని ఉద్యాన శాఖ ఏడీ యం. హరిప్రసాద్ తెలిపారు. ఈ పథకం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుంది. కాగా ఇప్పటి వరకు అమలవుతున్న ఆర్కేవీవై పథకం నిధులు మార్చి లోపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మిగిలిన నిధులను వెనక్కు పంపించేయాలి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో దాదాపు కోటి రూపాయల వరకు నిధులు కేటాయించారు. ఇప్పటి వరకు ఇలా.. ఈ పథకం కింద ఇప్పటి వరకు 50 శాతం రాయితీపై వివిధ రకాల హైబ్రీడ్ కూరగాయల విత్తనాలు సరఫరా అయ్యాయి. హెక్టారుకు రూ.3 వేలకు మించకుండా 2 హెక్టార్లకు రూ.6 వేల మేర సబ్సిడీ అందింది. 50 శాతం రాయితీ తీగజాతి కూరగాయలను పెంపకం కోసం పర్మినెంట్ పందిళ్లకు రాయితీపై హెక్టారుకు రూ.2.50 లక్షల వరకు నిధులు అందించారు. కూరగాయల తోటలు పండించే రైతులకు ప్లాస్టిక్ క్రేట్లు సరఫరా చేసేవారు. ఒక్కొక్క క్రేట్‌కు రూ.120 చొప్పున రాయితీ ఇచ్చారు. కూరగాయలు అమ్ముకునే వ్యాన్ 2 లక్షల రూపాయల రాయితీతో సరఫరా చేశారు. రైతులకు శిక్షణ కార్యక్రమాలు, 50 శాతం రాయితీపై మినీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, తైవాన్ స్ప్రేయర్లు సరఫరా చేసేవారు. అయితే ఇవన్నీ ఇక నుంచి కనుమరుగు కానున్నాయి. కొత్తపథకం విధి, విధానాలు పథకం అమలు సమయంలో ప్రభుత్వం విడుదల చేస్తుందని ఏడీ తెలిపారు. -
అగ్రి బిజినెస్‌కు ప్రోత్సాహం
న్యూఢిల్లీ:వ్యవసాయాన్ని లాభదాయకం చేసేలా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్కేవీవై)పథకంలో పలు మార్పులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పథకంలో భాగంగా పంట కోత అనంతరం అవసరమయ్యే వసతుల కల్పన, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధి తదితరాలపై దృష్టిపెట్టాలని నిర్ణయించింది. ఆర్కేవీవై– రఫ్తార్(వ్యవసాయం, అనుబంధ రంగాల పునరుత్తేజానికి లాభసాటి విధానాలు)గా పేరు మార్చిన ఈ పథకాన్ని రూ.15,722 కోట్ల బడ్జెట్‌తో మూడేళ్ల పాటు అమలుచేస్తారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. - ఆర్కేవీవై–రఫ్తార్ పథకానికి నిధులను కేంద్రం, రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో సమకూరుస్తాయి. - ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం నిధులు 90:10 నిష్పత్తిలో అందుతాయి. - వార్షిక వ్యయంలో 50 శాతం నిధులను వ్యవసాయ మౌలిక వసతులు, ఆస్తుల కల్పనకు కేటాయిస్తారు. - 30 శాతం నిధులను వాల్యూ అడిషన్ అనుసంధానిత ఉత్పత్తి ప్రాజెక్టులకు, 20 శాతం నిధులను స్థానిక అవసరాలకు అనుగుణంగా ఫ్లెక్సీ నిధులుగా వెచ్చిస్తారు. కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు: జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ)అనుమతి లేకుండా ఉపాధ్యాయ శిక్షణ ఇస్తున్న కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు గుర్తింపునిచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ బిల్లు వల్ల ఎన్సీటీఈ–1993 చట్టానికి సవరణ చేయడం ద్వారా గుర్తింపు లేని ఆయా సంస్థల్లో చదువుతున్న, చదివిన విద్యార్థులను ఉపాధ్యాయ వృత్తికి అర్హులుగా పరిగణిస్తారు. ఒకేసారి ఇచ్చే ఈ మినహాయింపు పాతకాలం నుంచి(రెట్రోస్పెక్టివ్) అమల్లోకి వస్తుంది. -
ఉద్యాన శాఖలో భారీ అవినీతి
► అవినీతి ‘పందిరి’ ► ‘పందిరి పంటల’ నిధులు పక్కదారి ► గుట్టు చప్పుడు కాకుండా కాజేస్తున్న ► అధికార పార్టీ నేతలు.. సహకరిస్తున్న అధికారులు ఉద్యాన శాఖఆధ్వర్యంలో అమలవుతున్న ‘పందిరి పంటలు’ పథకం అవినీతికి కేరాఫ్‌గా మారింది. పంటలేదు.. పందిరి లేదు.. భూమి అసలే లేదు. అయినా బినామీల ఖాతాల్లో ప్రతినెలా రూ.లక్షలు జమఅవుతోంది. ఇలా జమ అయిన మొత్తాన్ని అధికార పార్టీ నాయకులు, అధికారులు కలిసి పంచుకుంటున్నారు. అంతిమంగా అర్హులైన రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న బీడు భూమిధర్మవరం మండలం దర్శినమల గ్రామానికిచెందిన చంద్ర మోహన్ అనే రైతుది. ఇందులో పందిళ్లు వేసి, తీగజాతి పంటలైన బీర, కాకర సాగు చేస్తున్నట్లు ఉద్యానశాఖకు దరఖాస్తు చేశాడు. అధికారులు ఏమాత్రమూ పరిశీలన చేయకుండానే ఉద్యాన శాఖ ఖాతా (నం :0098561007907) నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఏడాది మార్చి తొమ్మిదిన సదరు రైతు ఎస్బీఐ ఖాతా(నం:20316867772)కు రూ. 2,25,778 జమ చేశారు. ఇక్కడున్నది ద్రాక్ష తోట. కానీ ఉద్యానశాఖ అధికారుల లెక్కల ప్రకారం కుళ్లాయప్ప అనే రైతు ఇక్కడ కాకర పంట సాగు చేస్తున్నాడు. ఇందుకు గాను ఆయన ఎస్బీఐ ఖాతా (నంబర్ 20250313712)కు గతేడాది నవంబర్ ఏడున రూ. 3,38,667, నవంబర్ 19వ తేదీన రూ. 1,00,000 జమ చేశారు. వాస్తవానికి ఈ భూమి దర్శినమలకు చెందిన హరి అనే రైతు పేరిట ఉంది. కుళ్లాయప్ప అనే రైతు పేరిట నకిలీ ఖాతాను సృష్టించి, ప్రభుత్వ నిధులను కాజేశారు. ఇలా ఒక్క దర్శినమల గ్రామంలోనే దాదాపు 20 మంది పేరిట రూ.40 లక్షల దాకా స్వాహా చేశారు. ధర్మవరం : రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) కింద ఉద్యాన శాఖ అమలు చేస్తున్న ‘పందిరి పంటలు’ పథకం అధికార పార్టీ నేతలు, అధికారులకు కాసుల పంట పండిస్తోంది. ఈ పథకం కింద పందిళ్లు వేసి, తీగజాతి పంటలు (కాకర, బీర లాంటివి) సాగు చేస్తే ఎకరానికి రూ. 1,10,000 చొప్పున గరిష్టంగా రెండెకరాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. పొలంలో రాతి బండలు పూడ్చి, వాటిపైన ఇనుప తీగలు అల్లాలి. పంటలు సాగు చేసేందుకు బోరు, మోటార్, డ్రిప్ అన్నీ అమర్చి ఉండాలి. ఇందుకోసం మంజూరైన మొత్తాన్ని వెనక్కి చెల్లించాల్సిన అవసరం (100 శాతం సబ్సిడీ) ఉండదు. ఈ క్రమంలో ఈ పథకంపై అధికార పార్టీ నాయకులు కన్నేశారు. వారికి ఏళ్ల తరబడి ఇక్కడే పాతుకుపోయిన అధికారులు సహకరించారు. బినామీ రైతుల పేర్లతో ఖాతాలు తెరిచి..స్వాహా పర్వానికి తెరలేపారు. కీలక భూమిక పోషించిన ఓ ఉన్నతాధికారి ఈ స్వాహా పర్వంలో ఉద్యానశాఖ డివిజన్ స్థాయి అధికారి కీలక భూమిక పోషించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. తాడిమర్రి, బత్తలపల్లి, ముదిగుబ్బ, ధర్మవరం రూరల్ మండలాల్లో కొందరు బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని, ఈ స్వాహా పర్వానికి తెరలేపినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు కొందరు సదరు అధికారిని నిలదీయడంతో వారికి రూ. 5 లక్షల మేర ముట్టజెప్పినట్లు సమాచారం. ఆ తరువాత కూడా సదరు నాయకులు, అధికారి కలిసి భారీ స్థాయిలో బోగస్ రైతులను సృష్టించి.. నిధులు స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ ముఖ్య నాయకుడు సదరు అధికారిని తీవ్ర స్థాయిలో మందలించారు. దీంతో ఇక్కడి నుంచి బదిలీ చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సదరు అధికారి వ్యవహారంపై ఇప్పటికే ఉద్యాన శాఖలోని ఉన్నతాధికారులకు కూడా బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. అన్ని అర్హతలు ఉన్నా తమను మాత్రం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని, స్వాహారాయుళ్లకు మాత్రం వెంటనే పనులు చేసిపెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు.