
ఒంగోలు టూటౌన్: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నూతన పథకం తీసుకురానుంది. అయితే ఉద్యాన శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేస్తున్న రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం (ఆర్‌కేవీవైð) ఇక కనుమరుగుకానుంది. మార్చి వరకు మాత్రమే ఈ పథకం అమల్లో ఉంటుంది. అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా పని చేయదు. ఈ నేపథ్యంలో 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి ఆర్‌కేవీవై స్థానంలో రాఫ్తార్(ఆర్‌ఏఎఫ్‌టీఏఆర్)ను అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. మరింత సమర్థవంతంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నదే కేంద్రం ఉద్దేశమని ఉద్యాన శాఖ ఏడీ యం. హరిప్రసాద్ తెలిపారు. ఈ పథకం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుంది. కాగా ఇప్పటి వరకు అమలవుతున్న ఆర్‌కేవీవై పథకం నిధులు మార్చి లోపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మిగిలిన నిధులను వెనక్కు పంపించేయాలి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో దాదాపు కోటి రూపాయల వరకు నిధులు కేటాయించారు.
ఇప్పటి వరకు ఇలా..
ఈ పథకం కింద ఇప్పటి వరకు 50 శాతం రాయితీపై వివిధ రకాల హైబ్రీడ్ కూరగాయల విత్తనాలు సరఫరా అయ్యాయి. హెక్టారుకు రూ.3 వేలకు మించకుండా 2 హెక్టార్లకు రూ.6 వేల మేర సబ్సిడీ అందింది. 50 శాతం రాయితీ తీగజాతి కూరగాయలను పెంపకం కోసం పర్మినెంట్ పందిళ్లకు రాయితీపై హెక్టారుకు రూ.2.50 లక్షల వరకు నిధులు అందించారు. కూరగాయల తోటలు పండించే రైతులకు ప్లాస్టిక్ క్రేట్లు సరఫరా చేసేవారు. ఒక్కొక్క క్రేట్‌కు రూ.120 చొప్పున రాయితీ ఇచ్చారు. కూరగాయలు అమ్ముకునే వ్యాన్ 2 లక్షల రూపాయల రాయితీతో సరఫరా చేశారు. రైతులకు శిక్షణ కార్యక్రమాలు, 50 శాతం రాయితీపై మినీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, తైవాన్ స్ప్రేయర్లు సరఫరా చేసేవారు. అయితే ఇవన్నీ ఇక నుంచి కనుమరుగు కానున్నాయి. కొత్తపథకం విధి, విధానాలు పథకం అమలు సమయంలో ప్రభుత్వం విడుదల చేస్తుందని ఏడీ తెలిపారు.