
సాక్షి, హైదరాబాద్: రైతు పెట్టుబడి పథకానికి నగదు సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. అదనపు కరెన్సీపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడం, పథకం అమలు తేదీ సమీపిస్తుండటంతో ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన మొదలైంది. ఈ పథకం కోసం ఒకే నెలలో ఒకేసారి రూ. 5 వేల కోట్లకు పైగా నగదు అవసరం పడటంతో ఏం చేయాలన్న అంశంపై చర్చలు ఊపుందుకున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఆర్థికమంత్రిని కలసినా అక్కడి నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. ప్రధానమంత్రి జోక్యం చేసుకుంటే కానీ రిజర్వు బ్యాంకు అంత మొత్తం నగదు సరఫరా కాదని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి చేస్తూనే ఇతరత్రా ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సర్కారు భావిస్తుంది.
ఒకేసారి 70 లక్షల మంది రైతులకు
రైతు పెట్టుబడి పథకంలో భాగంగా వచ్చే ఖరీఫ్‌లో మే 15వ తేదీ నాటికి రైతులకు ఎకరానికి రూ. 4 వేల చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం 1.42 కోట్ల ఎకరాల వ్యవసాయ పట్టా భూమి ఉండగా దాదాపు 70 లక్షల మంది రైతులకు గాను రూ. 5,680 కోట్లు చెక్కుల రూపంలో ఇవ్వాల్సి ఉంది. అయితే ఒకే నెలలో ఇంత పెద్దమొత్తంలో నగదును ఎలా అందుబాటులో ఉంచాలన్నదే ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. సీఎం ఢిల్లీకి వెళ్లకముందే మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లి నగదు కొరత లేకుండా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్‌బీఐ అధికారులను కలసి విజ్ఞప్తి చేశారు. అక్కడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఆర్‌బీఐ అధికారులు మాత్రం ప్రధాని మోదీ జోక్యం చేసుకుంటేనే నగదు సమస్య తీరుతుందని సూచించారు. సీఎం కేసీఆర్ కూడా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని కలసి విన్నవించినా స్పష్టత రాలేదు. ఒకవేళ ప్రధానిని కలిసినా రూ. 2 వేల కోట్ల వరకే హామీ లభించే అవకాశం ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దీంతో నగదు సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఏం చేయాలన్న అంశాలనూ పరిశీలించేందుకు సీఎం అధికారులను పురమాయించినట్లు తెలిసింది.
వేర్వేరు తేదీల్లో చెక్కులు ఇస్తే...
మే 1నుంచి 15 వరకు పలుచోట్ల గ్రామసభలు పెట్టి రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు. దాదాపు 10 వేల గ్రామాల్లో రోజుకో వెయ్యి గ్రామాల చొప్పున చెక్కులు పంపిణీ చేసే అవకాశముంది. కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకొని ఒకే తేదీతో చెక్కులను అందజేయడం కాకుండా ఒక్కో తేదీలో ఇవ్వడం వల్ల నగదు కొరత ఉండదని, రోజువారీగా నగదు లావాదేవీలు జరుగుతుంటాయి కాబట్టి వెసులుబాటు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే దీనిపై బ్యాంకు వర్గాలతో చర్చిస్తున్నారు. నగదుకు సంబంధించి ఇతరత్రా ప్రత్యామ్నాయ మార్గాలనూ అధికారులు అధ్యయనం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment