శనివారం ప్రగతిభవన్‌లో రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
సాక్షి, హైదరాబాద్: గ్రామ, మండల స్థాయి రైతు సమన్వయ సమితులకు తోడుగా జిల్లా స్థాయి రైతు సమితుల ఏర్పాటుకు సంబంధిత జిల్లాల మంత్రులు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు కాబోయే రైతు సమన్వయ సమితి.. కార్పొరేషన్ తరహాలో పని చేస్తుందని, దానికి ఒక ఉన్నతాధికారిని నియమించే ఆలోచన ఉందని వెల్లడించారు. జిల్లా సమితుల ఏర్పాటు అనంతరం.. మండల, జిల్లా సమితుల సభ్యులతో రాష్ట్రంలోని 4 దిక్కులా నాలుగు ప్రదేశాల్లో సదస్సులు నిర్వహించాలని చెప్పారు.
రాష్ట్ర సమన్వయ సమితి ఏర్పాటు తర్వాత, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర సమితుల సభ్యులతో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున సమావేశం నిర్వహించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను, వ్యవసాయదారులకు అమలు చేస్తున్న పథకాలను, వారికి కలిగిస్తున్న ఉచిత విద్యుత్ సౌకర్యం, విత్తనాలు–ఎరువుల పంపిణీ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతులకు పెట్టుబడి పథకం, రైతు సమన్వయ సమితుల ఏర్పాటు తదితర అంశాలపై మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులతో శనివారం సాయంత్రం ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు.
‘మార్క్ ఫెడ్’ను పునర్‌నిర్వచించాలి
‘గ్రామ సమితుల సభ్యులతో మండల సమితుల సభ్యులు నిరంతరం చర్చిస్తుంటారు. రైతులు ఏ పంట ఎన్ని ఎకరాలు ఎక్కడ వేశారో తెలుసుకుంటారు. పంటల మార్కెటింగ్ విషయంలో, సరైన ధర లభించే విషయంలో బాధ్యత తీసుకుంటారు. రైతులు పండించిన ధాన్యాన్ని పద్ధతి ప్రకారం మార్కెట్‌కు తేవాలి. ఈ విషయంలో సమితులు వారికి సూచనలు ఇస్తాయి. ఏ మార్కెట్ కమిటీకి రోజువారీగా ఎంత ధాన్యం కొనుగోలు చేసే సామర్థ్యం ఉందో అంచనా వేసి.. దానికి అనుగుణంగా కొందరు రైతుల చొప్పున మార్కెట్‌కు పంట తెచ్చి అమ్ముకోవాలి. మార్కెట్‌లో అమ్మకం జరగకపోతే రైతు సమితి కొంటుంది. రైతు సమితుల పాత్ర నేపథ్యంలో మార్క్‌ఫెడ్ పనితీరు పునర్‌నిర్వచించాలి’అని సీఎం అధికారులకు సూచించారు. వ్యవసాయ రంగంలో ఉన్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయే విషయంలో రైతు సమన్వయ సమితులు తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. వ్యవసాయ యాంత్రీకరణ ఆవశ్యకత పెరుగుతున్నదని, కొద్దిరోజులు పోతే నాట్లు వేసేవారు, కోతలు కోసేవారు లభించడం కష్టమని, అందువల్ల ప్లాంటేషన్ మిషన్లను, వీడర్స్ మిషన్లను రైతులకు సబ్సిడీపై సమకూర్చాలని సూచించారు. ప్లాంటేషన్ మిషన్లకు 50 శాతం వరకు సబ్సిడీతో సరఫరా చేయాలని ఆదేశించారు.
పార్లమెంట్‌లో పట్టుబట్టండి
బడ్జెట్ సమావేశాల్లో టీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు లేవనెత్తాల్సిన అంశాలపై సీఎం పలు సూచనలు చేశారు. ఇంతవరకు కేంద్రం రాష్ట్రానికి చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే తమకు అందాల్సిన సహాయం విషయంలో పట్టుబట్టాలని సూచించారు. రైతుల సమస్యలను లేవనెత్తాలని చెప్పారు. మద్దతు ధర విషయంలో కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాబట్టుకోవాలని, ప్రతీ పంటకు ఇవ్వబోయే మద్దతు ధరను సభలో ప్రకటించాలని అడగాలంటూ సూచించారు. రిజర్వేషన్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతోపాటు నిధులు సమకూర్చడం, మిషన్ భగీరథ పథకం, వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌లకు నిధులు, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానించడం, సహకార సమాఖ్య స్ఫూర్తికి ప్రాధాన్యం.. తదితర అంశాలను ప్రస్తావించాలని సూచించారు. సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న, ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, డి.శ్రీనివాస్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, వినోద్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, బిబి.పాటిల్, మల్లారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాల్క సుమన్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎంవో అధికారులు నర్సింగ్ రావు, భూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
100 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
రాష్ట్రంలోని 30 జిల్లాల్లో కనీసం వంద ఫుడ్ ప్రాసెసింగ్ యూని ట్లు ఏర్పాటు చేయాలని, దాదాపు శాసనసభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఉండాలని సీఎం సూచించారు. ఇప్పుడున్న వాటికి అదనంగా మరికొన్ని జిన్నింగ్ మిల్స్ ఎర్పాటు చేయాలన్నారు. ‘రాబోయే రోజుల్లో ప్రాజెక్టులు పూర్తయి సాగునీరు పుష్కలంగా లభించనుంది. దీంతో వర్షాకాలం ఎక్కువగా వరి పంట వేస్తారు. అందువల్ల రైస్ మిల్స్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు కేంద్ర ప్రభుత్వ నిధులు ఎలా సమకూర్చుకోవాలో ఆలోచించాలి’అని అధికారులకు సూచించారు. ఆహార కల్తీ నిరోధానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు, పంటలకు మద్దతు ధర సాధించడానికి చేపట్టాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు లతో కేబినెట్ సబ్ కమిటీని సీఎం నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment