సీఎం చంద్రశేఖర్ రావు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఓట్లు ఆకర్షించే పథకాలకు ఖర్చు చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. గ్యారంటీగా చేస్తం. ఓట్లు ఆకర్షించకపోతే రాజకీయ పార్టీ ఎందుకండి? కచ్చితంగా ఆకర్షించాలె.. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం.. హిపోక్రసీ ఎందుకు? అన్ని రాజకీయ పార్టీలు చేసేది అదే పని. మంచి చేసి ఎవరు ఎక్కువ శాతం ప్రజలను ఆకర్షిస్తరో వారే గెలుస్తరు. ప్రజలను ఆకర్షించకపోతే వికర్షిస్తరా?’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి సుదీర్ఘంగా మాట్లాడారు.
అంతకుముందు బీజేపీ పక్ష నేత జి.కిషన్ రెడ్డి.. ప్రభుత్వం చేసిన విమర్శలపై తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. ‘‘గత యూపీఏ కంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువిచ్చిందని కిషన్‌రెడ్డి అన్నారు. ఇందులో మీ గొప్పతనమేమి లేదు. అసలు మీరు ఇచ్చేదే ఏమీ ఉండదు. ఇక్కడ ఎవరూ బిచ్చగాళ్ల మాదిరి తీసుకోవడం ఉండదు. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాల రాజ్యాంగపరమైన హక్కు. 2004లో లోక్‌సభకు వెళ్లినప్పుడు కేంద్ర బడ్జెట్ రూ.4 లక్షల కోట్లు. నిన్న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ.24 లక్షల కోట్లు. అది ఎలా పెరుగుతుందో రాష్ట్రాల వాటా అలాగే పెరుగుతుంది. పన్నుల్లో రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఇమిడి ఉంది. ఈ దేశాన్ని సాకే ఏడు రాష్ట్రాలో తెలంగాణ ఒకటి. మన దగ్గరి నుంచి పోయే డబ్బు రూ.50 వేల కోట్లకు పైనే.
తిరిగి వచ్చేది మాత్రం రూ.24 వేల కోట్లే’’అని అన్నారు. ఎన్నికలకు మరో ఏడాది ఉందని, గత నాలుగేళ్లలో ఏం చేశామో, ఈ ఏడాది ఏం చేయబోతున్నామో ప్రజల ముందు ఉంచామని పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల ఆర్థిక ప్రణాళిక, టీఆర్‌ఎస్, ప్రభుత్వ ఆలోచన విధానం, మంచి చేసినమో చెడు చేసినమో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ‘‘కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రానికి ఓ ఆర్థిక ప్రాతిపదిక లేదు. అనిశ్చితి పరిస్థితిలో రాత్రింబవళ్లు కష్టపడి వాస్తవానికి అతి దగ్గరగా తొలి బడ్జెట్ రూపొందించాం. అద్భుతమైన పురోగతి లభించింది. తెలంగాణ అంటే ఇతర పార్టీలకు రాజకీయ క్రీడ. ఉద్యమ సమయంలో కావొచ్చు. రాష్ట్రం వచ్చినప్పుడు కావొచ్చు. కానీ టీఆర్‌ఎస్‌కు ఇది ఒక టాస్క్. రాష్ట్ర సాధన సమయంలో ఏ ఉద్యమ స్ఫూర్తితో పని చేశామో రాష్ట్రం వచ్చిన తర్వాత అదే స్ఫూర్తితో పని చేస్తున్నాం. ప్రజలు హర్షిస్తున్నారు. ఉప ఎన్నికల్లో వచ్చిన గెలుపే దీనికి గీటురాయిు’’అని సీఎం వివరించారు.
రాష్ట్రం అన్నింటా అగ్రగామి!
ఏ విషయంలో, ఏ రాష్ట్రంతో పోల్చకున్నా తెలంగాణ అగ్రభాగంలో ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వచ్చిన ఫలితాలను ఈ సందర్భంగా వివరించారు. 2017–18లో జాతీయ తలసరి ఆదాయం రూ.1,12,764 ఉంటే తెలంగాణలో రూ.1,75,534 ఉందన్నారు. తెలంగాణ రాక ముందు 2013–14లో దేశ జీడీపీ వృద్ధిరేటు 13 శాతం ఉంటే తెలంగాణ జీఎస్‌డీపీ 12.4 శాతం మాత్రమే ఉండేదన్నారు. 2017–18లో దేశ జీడీపీ 9.8 శాతం ఉంటే రాష్ట్ర జీఎస్‌డీపీ 14.1 శాతం ఉందన్నారు. 2014లో పారిశ్రామికరంగంలో –0.8 శాతం వృద్ధి ఉందని, 2017–18లో 5.6 శాతానికి వృద్ధి సాధించామని పేర్కొన్నారు. తలసరి విద్యుత్ వినియోగం 2014లో 1,283 యూనిట్లు ఉండగా.. ఇప్పుడు 1,507 యూనిట్లకు పెరిగిందన్నారు. జాతీయ సగటు 1,122 యూనిట్లు మాత్రమే అన్నారు. వ్యవసాయ వృద్ధి రేటు 2013–14లో 4 శాతం ఉండగా.. 2017–18లో 7 శాతానికి పెరిగిందన్నారు.
కేంద్ర సర్కారు అంకెల గారడీ
దేశానికి సంబంధించి ద్రవ్య వ్యవస్థ, నిర్వహణ అంతా కేంద్రం చేతిలో ఉంటుందని సీఎం అన్నారు. ‘‘కేంద్రం ఎట్ల ఉంటదో మనం అట్లనే ఉండాల్సి వస్తది. కేంద్రంతో భిన్నంగా ఉండడానికి రాష్ట్రాలకు అవకాశం లేదు. కేంద్రంలోని ఈ ప్రభుత్వం అంకెల గారడీ చేసింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి 42 శాతం వాటా ఇస్తామని చెబుతూనే కేంద్ర ప్రాయోజిత పథకాల కేటాయింపుల్లో కోత పెట్టింది’’అని విమర్శించారు. ‘‘కరీంనగర్‌ను లండన్, వరంగల్‌ను సింగపూర్ చేస్తామని ఎవరు చెప్పారండి? కిషన్‌రెడ్డి గారికి కల వచ్చిందా? మేం చెప్పని మేం అనని విషయాలు చెప్పుతామంటే కుదరదు. కరీంనగర్ లండన్ కచ్చితంగా అవుతది. రూ.500 కోట్లతో లోయర్ మానేరుపై చెక్‌డ్యాం నిర్మిస్తున్నాం. మానేరులో ఏడాది మొత్తం నీళ్లు ఉంటాయి. లండన్‌లోని థేమ్స్ నదిలా ఇక్కడ పరిస్థితి ఉంటుందని మాత్రమే చెప్పా’’అని అన్నారు.
ఉద్యోగులపై బీజేపీ మొసలి కన్నీళ్లు
గత ప్రభుత్వాలు చిన్నస్థాయి ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేసి వెట్టి చేయించుకున్నాయని సీఎం విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులపై బీజేపీ మొసలి కన్నీళ్లు కారుస్తోందన్నారు. సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం అమలుపై నిర్ణయం కేంద్రం చేతిలోనే ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలకు ఏ అధికారం లేదని స్వయంగా కేంద్రమంత్రి పార్లమెంట్‌లో ప్రకటించారని గుర్తు చేశారు. సీపీఎస్ ఒప్పందంతో కొత్త ఉద్యోగులు సర్వీసులో చేరారని, పాత పెన్షన్ విధానానికి మారితే వారి పదేళ్ల సర్వీసు ఏం కావాలని ప్రశ్నించారు. దీనిపై ఏం చేయాలో ఆలోచిస్తున్నామని, తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పారు. దేశంలో అత్యుత్తమ వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులు తెలంగాణలోనే ఉన్నారన్నారు.
‘‘హోంగార్డుల జీతాలను రూ.3 వేల నుంచి రూ.20 వేలకు పెంచాం. అంగన్‌వాడీ టీచర్లకు రూ.10.500 చెల్లిస్తున్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, లెక్చరర్లు సహా మొత్తం 2,38,068 మంది ఉద్యోగుల వేతనాలను పెంచి ఏటా రూ.1,100 కోట్ల అదనపు భారాన్ని భరిస్తున్నాం. త్వరలో ఆశా వర్కర్ల జీతాలు పెంచుతాం. పీఆర్సీ బకాయిలను పింఛన్ డబ్బుల్లో జమ చేసుకోవడానికి తొలుత ఉద్యోగ సంఘాలు ఒప్పుకున్నాయి. తర్వాత బకాయిలు కావాలని అడిగితే విడతల వారీగా చెల్లించేందుకు ఒప్పుకున్నాం’’అని వివరించారు. నియోజకవర్గానికి 15 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లు కావాలని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య అడుగుతున్నారంటూ బెంగాల్‌లో గత లెఫ్ట్ పాలనను ఉటంకించారు.
35 ఏళ్ల సీపీఎం పాలనలో కోల్‌కతా మొత్తం ధ్వంసమైతే ఇప్పుడు మమతా బెనర్జీ హాయాంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. మైనారిటీల సంక్షేమానికి ఈ ఏడాది రూ.800 కోట్లు మాత్రమే విడుదల చేశారని అక్బరుద్దీన్ అనడంలో వాస్తవం లేదని, ఇప్పటివరకు రూ.వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేశామని, ఈ నెలాఖరులోగా మరో రూ.150 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. బడ్జెట్‌పై మూస పద్ధతుల్లో విమర్శలు చేస్తున్నారని, వాస్తవ పునాదులపై విశ్లేషణాత్మక ధోరణిలో నిర్మాణాత్మకంగా మాట్లాడేవారు కరువయ్యారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment