ఆనకట్టల ఆధునికీకరణ జరిగేనా..?
జపాన్ నిధులపైనే
ప్రాజెక్టుల భవితవ్యం
నిధులు దోచుకుంటున్న అధికార పార్టీ నేతలు
బుచ్చిరెడ్డిపాళెం : జిల్లాలో ఆనకట్టల ఆధునీకరణపై నీలినీడలు కమ్ముకున్నా యి.ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వం సొమ్మొకరిది..సోకు మరొకరిది అన్న చందంగా వ్యవహరిస్తోంది. అభివృద్ధి పనులకు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ అవి తమ ప్రభుత్వం చేస్తున్న పనులుగా అధికార పార్టీ చూపుతోంది. తాజాగా జపాన్ బృం దం రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా జిల్లాలోనూ పర్యటించింది. జపాన్ నిధులతో ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు చేపట్టి, ఆ క్రెడిట్ తమ ఖాతా ల్లో వేసుకునే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వివరాల్లోకి వెళితే..జపాన్ బృందం ఈ నెల 6న జిల్లాలోని కండలేరు, సంగం ఆనకట్టలను పరిశీలించింది. అయితే వాటి పరిధిలో జరుగుతున్న పనులు, అధికారుల నిర్లక్ష్యాన్ని చూసి జపాన్ బృందం నవ్వుకుంది. వాస్తవానికి జిల్లాలోని కండలేరు, సోమశిల, కనిగిరి రిజర్వాయర్ల అభివృద్ధి పనులు జరగాల్సి ఉంది. గేట్ల మరమ్మతుల మొదలు సామర్థ్యాన్ని పెంచేందుకు పలు పనులు చేపట్టాల్సి ఉంది.
అయితే అధికారులు మాత్రం జపాన్ బృందానికి నామమాత్రంగా సంగం ఆనకట్టను, కండలేరు జలాశయాన్ని చూపి మమ అనిపించారు. ఆయా ఆన కట్టల పరిధిలో ఎన్నో కాలువలు నేటికీ అభివృద్ధికి నోచుకోలేదు.ఆనక ట్టల అభివృద్ధికే రూ. 800 కోట్లు అవసరమవుతాయని జపాన్ బృందం అంచనా వేసిన ట్లు సమాచారం. అయితే అంతటితో సరిపెడితే పనిపూర్తి కాదని చివరి పంటకు నీరందేలా కాలువల అభివృద్ధి పనులు కూడా చేయాల్సి వస్తోందని బృందం భావించినట్లు తెలిసింది.
ప్రభుత్వం నియమించిన కమిటీ జాడేది..?
జిల్లాలోని రిజర్వాయర్లు, కాలువలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఏడాది క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటిం చారు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నామన్నారు. రిజర్వాయర్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కమిటీ పరిశీలన జరిపి ఏడాది దాటుతున్నా ఆ దిశగా పనులు చేసిన దాఖలాలు లేవు. కేవలం కాలువల పనులు అధికార పార్టీ నేతల దోపిడీకే పరిమితమయ్యాయి.
కాలువల అభివృద్ధి ఏదీ?
జిల్లాలో కాలువల అభివృద్ధి పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. ఇరిగేషన్ అధికారుల కాసుల కక్కుర్తితో పనులు తూతూమంత్రంగా జరుగుతున్నాయి. రూ.50 లక్షల నిధులతో చేపట్టిన మలిదేవి డ్రెయిన్ పనులు అస్తవ్యస్తంగా జరిగిన విషయం తెలిసిందే. అధికార పార్టీ నేతలకు ఇరిగేషన్ ఏఈ మొదలు ఎస్‌ఈ వరకు దాసోహమయ్యారు. కాలువ పనుల్లో అవినీతి జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.
జపాన్ నిధులతోనే ప్రాజెక్టు భవితవ్యం
కాలువల పనుల పేరుతో అధికార పార్టీ నేతలకు ప్రభుత్వం కోట్లు దోచి పెడుతున్న విషయం చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆశలు వదులుకున్న రైతులు జపాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే జపాన్ బృందం మాత్రం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపింది. పూర్తిగా వివరాలు తీసుకున్న తరువాతే తదుపరి చర్యలు ఉంటాయని ప్రకటించింది. ఈ మేరకు జపాన్ నిధులతో ప్రాజెక్టుల భవితవ్యం తేలనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
జిల్లాలో ఆనకట్టల ఆధునికీక రణ అటకెక్కింది. జపాన్ నిధులపైనే ప్రాజెక్టుల భవితవ్యం ఆధారపడి ఉంది. ప్రభుత్వం కేటాయించిన నిధులు అధికారపార్టీ నేతల దోపిడీకి గురయ్యాయి. ఫలితంగా సాగునీరు రైతులకు సక్రమంగా అందడంలేదు.