అడుగంటిన కృష్ణమ్మ!
► శ్రీశైలం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరినా సాగర్‌కు కొనసాగుతున్న నీటి విడదల
► వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పు
► ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్న నిపుణులు
► అధికారపార్టీకి పట్టని సీమ కన్నీటి గోడు
కర్నూలు సిటీ: బిరబిర పరుగులిడాల్సిన కృష్ణానది నీరులేక వెలవెలబోతోంది. గత దశాబ్దాన్నర కాలంలో ఏ నాడు కూడాఈ పరిస్థితిని ఎదుర్కోలేదు. ఈ ఏడాది తక్కువ స్థాయిలో వర్షాపాతం నమోదు కావడంతో గతేడాది జూలై నుంచి నవంబరు వరకు 58 టీఎంసీలు మాత్రమే శ్రీశైలం జలాశయానికి చేరాయి. ఈ అరకొర నీటిని నిల్వ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తాగు నీటి అవసరాల పేరుతో తెలంగాణకు, కోస్తా ప్రాంతాలకు తరలించారు.
రాయల సీమకు మాత్రం చుక్క నీటిని వదలలేదు. దీనిపై అప్పట్లోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు రైతు సంఘాలు, ఇతర పార్టీలు ఆందోళనలు చేసినా ఈ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదు. వాస్తవానికి ఈ రోజుకు కూడా కృష్ణాడెల్టాలో తాగు నీటి ఇబ్బందులు రాయల సీమ కంటే తక్కువగానే ఉన్నాయి. తెలుగు దేశం పార్టీకి ఆ ప్రాంత ప్రజలు ఓట్లు వేశారనే ప్రేమతోనో లేక రాయల సీమ వాసులు తమ పార్టీని ఆదరించలేదనే కోపంతోనో ఇప్పటికీ కూడా డెడ్‌స్టోరేజ్‌కి చేరిన శ్రీశైలం జలాశయం నుంచి తాగు నీటి కోసమని దిగువకు నీటిని తీసుకెళ్తున్నారు. గత దశాబ్దాన్నర కాలంలో ఇంత దిగువ వరకు నీటిని వాడుకోలేదని అధికార గణాంకాలే చెబుతున్నాయి.
డెడ్ స్టోరేజీ నీటిని వాడితే వన్యప్రాణులకు పొంచిన ముప్పు..
శ్రీశైలం జలాశయం పూర్థి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, 215 టీఎంసీలు సామర్థ్యం. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో జలాశయంలోకి నీటి చేరికలు తక్కువ స్థాయిలో ఉన్నాయి. సాధారణంగా మే చివరికి జలాశయం డెడ్ స్టోరేజీకి చేరుకునేది. అయితే తక్కువ వర్షపాతంతో మార్చి మొదటి వారానికే డెడ్ స్టోరేజీకి చేరుకుంది. అయినా, నీటిని తాగు నీటి పేరుతో నాగర్జున సాగర్‌కు తీసుకుపోతున్నారు. ఇలా తీసుకెళ్లడంతో ప్రాజెక్టులో నీరు పూర్తిగా అడుగంటిపోయి నల్లమల అడవుల్లోని వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుంది. ఇదే అభిప్రాయంతో కొందరు పర్యావరణవేత్తలు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.
తప్పని పరిస్థితి:
ప్రస్తుతం తప్పని పరిస్థతుల్లో శ్రీశైలం నుంచి నీటిని వదులుతున్నాం. తాగు నీటికి ఇబ్బందులు ఉన్న సమయంలో 705 అడుగుల వరకు నీటిని వాడుకునేందుకు అవకాశం ఉంది. వన్యప్రాణులకు కొంత ఇబ్బంది ఉండవచ్చు. కానీ ప్రస్తుతం తాగు నీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నందు వల్లే కృష్ణా బోర్డు తెలంగాణ, కోస్తాకు వాటాలుగా పంచింది. శ్రీశైలంలో ప్రస్తుతం ఉన్న నీటి మట్టంతో రాయల సీమకు నీరు ఇవ్వడం సాధ్యం కాదు. - చిట్టిబాబు, చీఫ్ ఇంజనీర్ జల వనరుల శాఖ, కర్నూలు ప్రాజెక్ట్స్