మా రూటే సెపరేటు! | Officials and officials of the ruling party | Sakshi
Sakshi News home page

మా రూటే సెపరేటు!

Published Tue, Jul 4 2017 1:32 AM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM

మా రూటే సెపరేటు!

మా రూటే సెపరేటు!

∙ అధికారులు, అధికార పార్టీ నేతల కుమ్మక్కు
∙ పునరావాస నిధులను బొక్కేస్తున్న వైనం
∙ టెండర్లలో అక్రమాలు..
∙ కాంట్రాక్టర్లను బెదిరింపులు.. బలవంతంగా లేఖలు
∙ ప్రజాధనానికి భారీగా గండి
∙ నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు


పేరుకు మాత్రం ఈ–టెండర్లు..కానీ జిల్లాలో వాటి రూటే సెపరేటు. టెండర్లలో పాల్గొన్న కాంట్రాక్టర్లను  అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు బెదిరించి అబౌ రేట్లకు పనులను దక్కించుకోవడం మామూలైపోయింది. కాంట్రాక్టర్లతో ఈ పనులు మాకొద్దంటూ బలవంతంగా లెటర్లు రాయించడం ఆ తర్వాత అదే పనులను తమ అనుకూలురైన కాంట్రాక్టర్లకు అప్పగించి 12 నుంచి 15 శాతం కమీషన్లు పుచ్చుకుంటున్నారు. ఇందుకు జిల్లా స్థాయి అధికారులే సహకారం అందిస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా వారు 12 శాతానికి తగ్గకుండా కమీషన్లు పుచ్చుకుంటున్నారు. మొత్తంగా అధికార పార్టీ శాసనసభ్యులు, అధికారులు కలిపి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని బొక్కుతున్నారు. జిల్లా భారీ నీటిపారుదల శాఖ (ప్రాజెక్టుల విభాగం)లో జరుగుతున్న టెండర్ల వ్యవహారం చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. తాజాగా వెలిగొండ పునరావాస పనుల టెండర్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కాంట్రాక్టర్లు పోటీ టెండర్లలో పాల్గొనకుండా అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు అడ్డుకుంటున్నప్పటికీ జిల్లా పాలనాధికారి తనకేమి పట్టన్నట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

ఒంగోలు :వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో తోకపల్లె గ్రామ పునరావాస పనులకు సంబంధించి ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో సంబంధిత గ్రామంలో డ్రైయిన్స్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రూ.2 కోట్ల పనులకు 14 మంది కాంట్రాక్టర్లు పోటీ పడి ఆన్‌లైన్‌లో టెండర్లు దాఖలు చేశారు. వీరిలో ఇద్దరిని అధికారులు డిస్‌క్వాలిఫై చేశారు. ఇందులో యర్రగొండపాలెం ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్టర్‌ 20.06 లెస్‌కు టెండర్‌ వేశారు. పని తనకే కావాలంటూ యర్రగొండపాలెం ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఇరిగేషన్‌ (ప్రాజెక్టులు) ఎస్‌ఈపై ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడికి తలొగ్గిన ఎస్‌ఈ రూ.2 కోట్ల పనిని ఆయనకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు.

ఇందులో భాగంగా రెండు నెలల పాటు టెండర్‌ ఖరారు చేయలేదు. ఇదే సమయంలో కాంట్రాక్టర్లు టెండర్లు ఎందుకు తెరవలేదంటూ ఎస్‌ఈపై ఒత్తిడి తెచ్చారు. అనుకోకుండా ఒక్కసారిగా ఆన్‌లైన్‌లో టెక్నికల్‌ బిడ్‌ ఓపెన్‌ అయింది. ప్రైజ్‌ బిడ్‌ ఓపెన్‌ కావాల్సి ఉంది. అప్పటికే ఎవరూ ఎక్కువ లెస్‌ వేశారన్న విషయంపై స్పష్టత వచ్చింది. 20.06 ఎక్కువ లెస్‌కు వేసినందున పని తనకే వచ్చిందని కాంట్రాక్టర్‌ ఎస్‌ఈని కలిసి చెప్పాడు. పని అగ్రిమెంట్‌ చేయాలంటూ ఎస్‌ఈని కోరారు. అసలు తాము టెండర్లే ఓపెన్‌ చేయలేదని అవి ఎలా ఓపెన్‌ అయ్యాయో... తెలియదంటూ ఎస్‌ఈ అడ్డం తిరిగారు. ఇదే సమయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు ఇరిగేషన్‌ ఎస్‌ఈ కాంట్రాక్టర్లతో బలవంతంగా పని తమకు వద్దంటూ లెటర్‌ రాయించుకున్నారు.

కొద్దిరోజులు ఆగి ఆ తర్వాత మరోమారు టెండర్లు ఓపెన్‌ చేసినట్లు ఎస్‌ఈ ప్రకటించారు. ఈ లోపు 12 మంది కాంట్రాక్టర్లను డిస్‌ క్వాలిఫై చేశారు. కేవలం ఎస్టిమెట్‌ రేట్లకు టెండర్‌ వేసిన ఒక కాంట్రాక్టర్‌తో పాటు 4.4 అబౌ వేసిన మరో కాంట్రాక్టర్‌ను మాత్రమే క్వాలిఫై చేశారు. అబౌ రేటుకు టెండర్‌ వేసిన కాంట్రాక్టర్‌కు పనిని ఓకే చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకే ఈ వ్యవహారం మొత్తం నడిచింది. తొలుత టెండర్‌ ప్రకారం 20.06 లెస్‌లో పని ఖరారై ఉంటే.. ప్రభుత్వానికి 42 లక్షల నిధులు ఆదా అయ్యేవి. అలా కాకుండా అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధి కలిసి మొత్తం నిధులను బొక్కేందుకు ప్రణాళిక రచించారు. పని దక్కించుకున్న ప్రజాప్రతినిధి 15 శాతం కమీషన్‌ పుచ్చుకున్నట్లు సమాచారం. ఇక అధికారులకు సైతం 12 శాతం వరకు కమీషన్‌ను ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.

అక్రమార్కులపై చర్యలేవీ..
పునరావాస పనుల్లో అక్రమాలకు ఈ టెండర్ల వ్యవహారమే ఉదాహరణగా నిలుస్తోంది. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. వీటితో పాటు ఇటీవల టెండర్లు పిలిచిన వెలిగొండ, గుండ్లకమ్మ పునరావాస పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయి. టెండర్ల వ్యవహారంలో అక్రమాలు జరగడమే కాకుండా పనుల నాణ్యత కూడా ప్రశ్నార్థకంగా మారింది. పర్సంటేజీలు పుచ్చుకొని అధికారులు మిన్నకుండిపోతున్నారు. దీంతో కాంట్రాక్టర్లు మొక్కుబడిగా పనులు చేసి అందినకాడికి దండుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ సదరు పనుల్లో వాస్తవాలను పరిశీలించి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కాంట్రాక్టర్లకు బెదిరింపులు
జిల్లాలో అభివృద్ధి పనులకు పోటీ టెండర్లు వేసే కాంట్రాక్టర్లకు బెదిరింపులు తప్పడం లేదు. తాము చెప్పినట్లు వినకపోతే భవిష్యత్తులో పనులు రావని, ఒక వేళ వచ్చిన చేయలేరంటూ అధికారులు నిస్సిగ్గుగా కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. పోటీ టెండర్లు వేసిన కాంట్రాక్టర్ల ద్వారా బలవంతంగా లెటర్లు రాయించడం గమనార్హం. తోకపల్లె పునరావాస పనికి  టెండర్లు దాఖలైన తర్వాత అధికార పార్టీ ప్రజాప్రతినిధి కాంట్రాక్టర్లతో బలవంతంగా లెటర్లు రాయించారు. ‘టెండర్‌ ఖరారు కావడం రెండు నెలలు ఆలస్యమైనందున గతంలో వేసిన రేట్లకు తాము పనులు చేయలేమని, నష్టపోతామని కాబట్టి టెండర్‌ క్యాన్సిల్‌ చేయాలంటూ అధికారులకు కాంట్రాక్టర్లకు లెటర్‌ రాసుకున్నట్లుగా’ బలవంతంగా లెటర్లు రాయించారు.

అధికారులు పూర్తిగా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ బెదిరింపులకు దిగుతున్నారని పలువురు కాంట్రాక్టర్లు సాక్షితో వాపోయారు. కాదూ... కూడదంటే కాంట్రాక్టర్లపై అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తోకపల్లె రూ.2 కోట్ల పనికి 20.06 శాతం లెస్‌ వేసిన కాంట్రాక్టర్‌పై ఇరిగేషన్‌ ఎస్‌ఈ కక్ష కట్టినట్లు తెలుస్తోంది. సదరు కాంట్రాక్టర్‌ అద్దంకి ఏరియాలో 1.13 కోట్ల పనితో పాటు మరో 67 లక్షల పనులకు టెండర్లు దాఖలు చేయగా ఎస్‌ఈ అతనిని డిస్‌క్వాలిఫై చేయడం ఇందుకు ఉదాహరణ. అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఆడమన్నట్లు జిల్లా ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఆడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement