
వెల్దుర్తిలో అధికార పార్టీ వర్గీయుల హల్‌చల్
అత్యంత సమస్యాత్మక గ్రామమైన చెరుకులపాడుకు చెందిన అధికార పార్టీ వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు.
మారణాయుధాలతో పట్టుబడిని ఐదుగురు వ్యక్తులు
వెల్దుర్తి రూరల్: అత్యంత సమస్యాత్మక గ్రామమైన చెరుకులపాడుకు చెందిన అధికార పార్టీ వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. ప్రతిపక్ష పార్టీ చోటా నాయకుడు లక్ష్యంగా సోమవారం హల్‌చల్ సృష్టించారు. వెల్దుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన పాతకక్షలకు ఆజ్యం పోస్తోంది. వివరాల్లోకి వెళితే.. వెల్దుర్తి పట్టణంలో సోమవారం సాయంత్రం ఐదుగురు పైగా అధికార పార్టీ వర్గీయులు ఓ వాహనంతో చెరుకులపాడుకే చెందిన ప్రతిపక్ష పార్టీ నేత ముఖ్య అనుచరుడు మోహన్‌ను ఢీకొట్టే ప్రయత్నం చేశారు. తాగిన మైకంలో ఉన్న వారు ఈ ఘాతుకానికి పాల్పడగా.. ఆయన తృటిలో తప్పించుకున్నారు. వెంటనే పోలీసుస్టేషన్‌కు చేరుకుని జరిగిన విషయాన్ని వివరించారు. అప్రమత్తమైన పోలీసులు వాహనంతో పాటు అందులోని వ్యక్తులను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఆ తర్వాత వాహనాన్ని తనిఖీ చేయగా మరణాయుధాలు బయటపడినట్లు తెలిసింది. అయితే వ్యవహారం అధికార పార్టీకి చెందినది కావడంతో పోలీసులు చర్యలు తీసుకునేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వెల్దుర్తి ఎస్‌ఐ తులసీనాగప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఆకతాయిలు కొందరు తప్పతాగి హల్‌చల్ చేస్తున్నారే సమాచారం అందడంతో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అయితే వారి వద్ద ఎలాంటి మారణాయుధాలు లభ్యం కాలేదన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయన్నారు.