అధికారం ఆడిందే ఆట
♦ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పేకాట
♦ రాజధానిలో యథేచ్ఛగా నిర్వహణ
♦ అనధికార క్లబ్బుల్ని ఏర్పాటు చేసి ఆడిస్తున్న వైనం
♦ ఫిర్యాదులు అందినా పట్టించుకోని స్థానిక పోలీసులు
సాక్షి, గుంటూరు:
జిల్లాలో పేకాట క్లబ్బులకు పోలీసు ఉన్నతాధికారులు అనుమతివ్వకపోవడంతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల బంధువులు, కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు అనధికారికంగా పేకాట స్థావరాల్ని ఏర్పాటు చేసి ఆడిస్తున్నారు. ప్రతి రోజూ బంకిణీల పేరుతో వేలాది రూపాయలను పేకాట రాయుళ్ల నుంచి వసూలు చేస్తున్నారు. ‘పోలీసులతో ముందే మాట్లాడుకున్నాం.. వారికి నెలవారీ మామూళ్లు ముట్టజెపుతూనే ఉన్నాం.. మీరు ఎటువంటి అనుమానాలు లేకుండా నిర్భయంగా ఇక్కడకు వచ్చి పేకాట ఆడుకోవచ్చు’ అంటూ ఓపెన్ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. దీంతో జూదగాళ్లు ‘డబ్బు పోయినా పర్వాలేదు, పోలీసుల బెడద లేకుండా ఉంటే చాలం’టూ ఆ స్థావరాలకు వెళ్లి హాయిగా ఆడేసుకుంటున్నారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ తంతు కొనసాగుతోంది. గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలోని మంగళగిరి, నూతక్కి, యర్రబాలెం, పేరేచర్ల, రూరల్ జిల్లా పరిధిలోని నాదెండ్ల, యడ్లపాడు, నర్సరావుపేట, దాచేపల్లి వంటి ప్రాంతాల్లో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పేకాట కేంద్రాలు నడుస్తున్నాయి.
రాజధానిలో ప్రాంతంలో..
రాజధాని ప్రాంతమైన మంగళగిరి పట్టణంతోపాటు ఆ మండలంలోని నూతక్కి, యర్రబాలెం వంటి గ్రామీణ ప్రాంతాల్లో సైతం అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పేకాట కేంద్రాలు నడుస్తున్నాయి. మంగళగిరి మండలం రామచంద్రాపురం, తాడేపల్లి మండలాల్లో కేంద్రాలు నడుస్తున్న విషయం గతంలో ‘సాక్షి’ కథనాలు ప్రచురించగా ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో ఆ గ్రామాల్లో తాత్కాలికంగా పేకాట నిలిచిపోయింది. మిగతా ప్రాంతాల్లో పేకాట కేంద్రాలు నడుస్తుండటంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పేకాట రాయుళ్లు తరలి వస్తున్నారు. మేడికొండూరు మండలంలోని పేరేచర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో సైతం జోరుగా సాగుతోంది.
ఇళ్లను క్లబ్బులుగా మార్చుకుని..
నరసరావుపేట రూరల్ మండలంలో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో గతంలో ముఖ్యనేత తనయుని అనుయాయులు పేకాట కేంద్రాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పట్లో స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో దానిపై గుంటూరు స్పెషల్ పార్టీ పోలీసులు దాడి చేసి 15 మందిని అరెస్టు్ట చేసి నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక కారు, రూ. 7.95 లక్షల నగదు స్వాధీనం చేసుకొన్నారు. ప్రస్తుతం కోటప్పకొండ పరిసర ప్రాంతాలు, మండల సరిహద్దుల వద్ద రోజుకో స్థావరం మారుస్తూ పేకాట ఆడిస్తున్నట్లు సమాచారం. పల్నాడు ప్రాంతంలోని దాచేపల్లిలో కొన్ని నెలల క్రితం క్లబ్బు మూతపడటంతో ఇళ్లలోనే పేకాట కేంద్రాలు నడుస్తున్నాయి. రోజుకో ప్రాంతంలో తమకు అనువుగా ఉన్న ఇళ్లలో పేకాట నిర్వహిస్తున్నారు. నాదెండ్ల మండలంలోని ఓ రైస్ మిల్‌లో, యడ్లపాడు మండలంలోని కొన్ని గ్రామాల్లో టీడీపీ నేతలే పేకాట కేంద్రాల్ని నడుపుతుండటంతో పోలీసులు వాటి జోలికి వెళ్లడం లేదు.
కొందరు పోలీస్ అధికారులు నెలవారీ మామూళ్లు పుచ్చుకుంటూ శిబిరాల వైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేకాట నిర్వాహకులు నిత్యం పోలీస్‌స్టేషన్‌లలోనేæ కూర్చుని పంచాయితీలు సైతం చేస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది రైతులు, చిరు ఉద్యోగులు పేకాటలో లక్షలు పోగొట్టుకుని అప్పులపాలై బలవన్మరణాలకు పాల్పడుతున్న సంఘటనలూ లేకపోలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ వ్యవహారంపై రహస్య విచారణ జరిపి పేకాట నిర్వాహకులకు సహకరిస్తున్న పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.