కొడితే దిక్కెవరు?
► {పభుత్వ అధికారులకు అధికార పార్టీ నాయకుల హెచ్చరిక
► దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి యత్నం
► చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్న అధికారులు
చంద్రగిరి: ఏరా..పోలీసువయితే మాకేంటి.. అధికారం మాది.. నిన్ను ఇక్కడే తంతా.. ఎవడికైనా చెప్పుకో.. ఇదీ ఓ కానిస్టేబుల్‌పై టీడీపీ కార్యకర్త తిట్ల పురాణం. మా కార్యకర్తకే అడ్డుచెబుతావా.. అసలు మండలంలో ఉద్యోగం చేయాలని ఉందా? లేదా? కొడితే నీకు దిక్కెవడురా ఇదీ ఓ అధికారిపై టీడీపీ మండలాధ్యక్షుడి గాండ్రింపు.
ఏరా.. సర్వే చేయాలని ఎన్నిసార్లు అడగాలి. లెక్కలేదా? ఇది సర్వేయర్‌పై మరో టీడీపీ కార్యకర్త తిట్ల దండకం.
అసలేం జరిగిందంటే.. చంద్రగిరి మండలంలో శనివారం మూడో విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ప్రారంభమైంది. కొండ్రెడ్డికండ్రిగ పంచాయతీలో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి విధుల నిమిత్తం కానిస్టేబుల్ జగదీష్ హాజరయ్యాడు. చంద్రన్న కానుక సంచిలో ఏమి ఉంటుందని ఓ మహిళ అడిగింది. అందులో బెల్లం, గోధుమ, నెయ్యి, పప్పు తదితర వస్తువులుంటాయని ఆయన సమాధానం చెప్పారు.
ఇంతలో అనంత గుర్రప్పగారిపల్లికి చెందిన ఓ కార్యకర్త చంద్రన్న కానుకలను ఎగతాళి చేస్తావా అంటూ కానిస్టేబుల్ జగదీష్‌పై దాడికి యత్నించాడు. మరోసారి మాట్లాడితే ఇక్కడే తంతా అంటూ విరుచుకుపడ్డాడు. తర్వాత టీడీపీ మండల అధ్యక్షుడు కానిస్టేబుల్ జగదీష్‌పైకి దూసుకెళ్తూ దాడికి యత్నించాడు. మండలంలో ఉద్యోగం చేయాలని ఉందా లేదా? అంటూ హెచ్చరించాడు.
తిట్ల పురాణం
భీమవరం పంచాయతీలో జరిగిన జన్మభూమి కార్యక్ర మంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మండల సర్వేయర్ హేమకుమార్‌పై తిట్లదండకం అందుకున్నాడు. తన పొలంలో సర్వే చేయాడానికి పిలిస్తే ఎందుకు రాలేదంటూ దుర్భాషలాడాడు.
సీరియస్...వెంటనే రాజీ..
ప్రభుత్వ విధుల్లో ఉన్న సర్వేయర్‌పై దుర్భాషలాడిన మునిరత్నంను వెంటనే అరెస్ట్ చేయాలంటూ తహశీల్దార్ కిరణ్‌కుమార్ ఆదేశించారు. ప్రభుత్వ అధికారులంటే చులకనైందా అంటూ ఆయన మునిరత్నంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కానీ స్థానిక టీడీపీ చోటానాయకుల ఒత్తిడితో తహశీల్దార్ వెనక్కితగ్గారు.
డీఎస్పీ రాజీకి యత్నం
విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి యత్నించడం, అసభ్యంగా దూషించడం చట్ట ప్రకారం నేరం కావడంతో వారిపై చర్యలు తీసుకోవాల్సిన తిరుపతి వెస్ట్ డీఎస్పీ శ్రీనివాసులు రాజీకి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. స్వయంగా ఆయనే భీమవరానికి వచ్చి సర్పంచ్ నివాసంలో టీడీపీ నాయకులతో పంచాయితీ నిర్వహించారు.