అధికార పార్టీ తొత్తులుగా పోలీసులు
- అక్రమకేసులు పెడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఆందోళన
- చోడవరం సర్కిల్ కార్యాలయం ముట్టడి, ర్యాలీ, రాస్తా రోకో
చోడవరం : అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలకు పోలీసులు సహకారం అందిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ శనివారం భారీ ఆందోళనకు దిగింది. చోడవరం హార్డింజ్ గెస్ట్ హౌస్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి పోలీసు సర్కిల్ ఇనస్పెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
సర్కిల్ స్టేషన్‌ను ముట్టడించడంతోపాటు చోడవరంలోని భీమిలి-నర్సీపట్నం రోడ్డుపై బైఠాయించారు. వెఎస్సార్‌సీపీ నాయకులపై ఇటీవల పలు కేసులు అక్రమంగా నమోదు చేశారని, గవరవరంలో కత్తితో దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా కేసుల్లో సెక్షన్లను మార్చేసి తప్పుదోవ పట్టిస్తున్నారని ధర్మశ్రీ ఆరోపించారు. బుచ్చెయ్యపేట మండలంలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఒక సర్పంచ్‌పై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారని, గవరవరంలో తమ కార్యకర్తపై టీడీపీ నాయకులు కత్తులతో దాడిచే సి తీవ్రంగా గాయపరిచినా ఇప్పటికీ నిందితులను అరెస్టు చేయలేదని, సెక్షన్లు కూడా మార్చారని ధ్వజమెత్తారు.
అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలని ధర్మశ్రీ పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పదేళ్లలో ఎవరిపై ఎటువంటి అక్రమ, వేధింపు కేసులు పెట్టలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో స్థానిక ఎమ్మెల్యే అనేక కేసులు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులపై పెట్టించారని ఆరోపించారు. ఆందోళన మరింత ఉధృతమవుతుండటంతో సీఐ కిరణ్‌కుమార్ వచ్చి ఆందోళన విరమించాలని కోరారు. కార్యకర్తల సమక్షంలో ధర్మశ్రీతో సీఐ చర్చించారు. ఈ సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ నాయకుల పెడుతున్న అక్రమ కేసుల గురించి ధర్మశ్రీ వివరించారు. తమకు న్యాయం చేయాలని, రానున్న రోజుల్లో అక్రమ కేసులు బనాయిస్తే సహించేదిలేదని తేల్చిచెప్పారు.
ఈ ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు దొండా రాంబాబుతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు మద్దతు పలికారు. ఆందోళనలో వైఎస్సార్ సీపీ నాయకులు వెంపలి ఆనందీశ్వరరావు, మూడెడ్ల శంకరరావు, సాయం రమేష్, బొడ్డు శ్రీరామ్మూర్తి, అప్పికొండ లింగబాబు, హారిక రామకృష్ణ, సూరిశెట్టి నాగ గోవింద, ఓరుగంటి నెహ్రూ,వేచలపు ప్రకాష్, చవితిన బాబూరావు, శానాపతి సత్యారావు, మొల్లి సోమునాయుడు, మొల్లి ప్రసాద్, రాజు, పినబోయిన అప్పారావు, పామురాజు, బొడ్డేడ సూర్యనారాయణ, బూతనాధ రామారావు పాల్గొన్నారు.