మార్కెట్ కమిటీ
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మళ్లీ మార్కెట్ కమిటీ నామినేటెడ్ పదవుల పందేరం మొదలైంది. గతంలో ఉమ్మడి జిల్లాలో 25 వ్యవసాయ మార్కెట్లు, 19 ఉప మార్కెట్లు ఉండగా.. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కొత్తగా 13 చేర్చి వ్యవసాయ మార్కెట్ల సంఖ్య 38 చేసింది. 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 38 మార్కెట్లకు, జిల్లాల పునర్విభజన తర్వాత మూడు (హుస్నాబాద్, బెజ్జంకి, కోహెడ్) సిద్దిపేట జిల్లాకు, ఒకటి (కాటారం) జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వెళ్లాయి. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిధిలో 34 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. మొత్తం 38 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను 21 మార్కెట్ కమిటీల పాలకవర్గం పదవీకాలం మే 6, 12, 19, జూన్ 6, 8, 12 తేదీలలో ముగిసిపోగా, ఇందులో ఏడు కమిటీలకు రెండు నెలల నుంచి ఏడాది వరకు పొడిగించారు.
మరో 17 కమిటీల పాలకవర్గం గడువు జూలై నుంచి అక్టోబర్ మాసాల వరకు ముగియనుంది. ఇదే సమయంలో మార్కెట్ కమిటీలకు రొటేషన్ పద్ధతిలోరిజర్వేషన్లు ప్రకటిస్తూ మే 17న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పదవీకాలం ముగిసిన మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాల నియామకం అనివార్యంగా మారింది. ఎమ్మెల్యే తర్వాత నియోజకవర్గం స్థాయిలో డిమాండ్ ఉన్న పోస్టు కావడంతో మారిన రిజర్వేషన్లకు అనుగుణంగా సీనియర్ నాయకులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొద్ది నెలల్లోనే సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ మార్కెట్ కమిటీలకు చైర్మన్లు, పాలకవర్గం ఎంపిక మంత్రులు, ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది.
మారిన రిజర్వేషన్లు.. తెరపైకి సీనియర్ నేతలు..
ప్రభుత్వం రొటేషన్ పద్ధతిలో వ్యవసాయ మార్కె ట్ కమిటీల రిజర్వేషన్లను గత నెల 17న ఖరారు చేసింది. ఈ జీవో విడుదలైన తర్వాత రెండేళ్ల పదవీకాలం ముగిసి.. వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాన్ని నియమించాల్సి ఉంది. ఈనెల 2 నుంచి ఉమ్మడి జిల్లాలో ఒక్కో కమిటీ పాలకవర్గాల పదవీకాలం ముగుస్తూ వస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడక ముందు పొడిగించిన కమిటీలను పక్కనబెట్టి స్పష్టంగా పదవీకాలం ముగిసిన మార్కెట్లకు కమిటీలను ఖరారు చేయాల్సి ఉంది. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తం గా ఈనెల 15 వరకు 159 మార్కెట్ కమిటీలకు కాలపరిమితి ముగియగా, ఇందులో ఉమ్మడి కరీం నగర్ జిల్లాకు చెందిన 14 కమిటీలు ఉన్నాయి.
వీటికి తక్షణమే పాలక వర్గాలను ఖరారు చేయాల్సి ఉండగా, ఈసారి గత రిజర్వేషన్లకు భిన్నంగా మారడంతో కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. దీంతో అధికార పార్టీ నేతలకు తలనొప్పిలా పరిణమించింది. సాధారణంగా నామినేటెడ్ పదవులు అంటేనే తమకు ‘విధేయులు’గా ఉండే వారినే మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు అవకాశం ఉంటుంది. కాగా.. కాల పరిమితి తీరిన మార్కెట్ కమిటీ చైర్మన్లు, పాలకవర్గం స్థానంలో పదవుల కేటాయింపులకు సన్నాహాలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విషయం తెలుసుకున్న తెలంగాణ ఉద్యమకారులు.. టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయా నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు.
ఎక్కడెక్కడ నుంచి, ఎవరెవరు.. ‘మార్కెట్ కమిటీ’ల కోసం పోటాపోటీ..
మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లోని ప్రధాన మార్కెట్లకు తక్షణమే కమిటీలు వేయాల్సి ఉంది. ఆ తర్వాత కరీంనగర్, పెద్దపల్లి, వేములవాడ నియోజకవర్గాల్లోని మార్కెట్లకు కొత్త పాలకవర్గాన్ని ఖరారు చేయాలి. ఇప్పటికే కొత్త పాలకవర్గంపై కసరత్తు చేస్తున్నా ఆశావహులు రోజురోజుకూ పెరుగుతున్నారు.
- హుజూరాబాద్ మార్కెట్ కమిటీ పాలకవర్గం గడువు ఈ నెల 9న ముగిసింది. ఈసారి కూడా ఓసీ జనరల్‌కు కేటాయించడంతో అధ్యక్ష పద వి కోసం ప్రస్తుత చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి మరోసారి మంత్రి ఈటల రాజేందర్ ఆశీçస్సులతో ప్రయత్నాలు చేస్తున్నారు. సింగపూర్ సర్పంచ్ కౌరు రజిత భర్త కౌరు సుగుణాకర్‌రెడ్డి, సైదాపూర్ మండలం నుంచి పెరాల గోపాల్‌రావు ఎంపీ కెప్టెన్ లక్ష్మీ కాంతారావు ద్వారా ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం ఉంది.
- జమ్మికుంట మార్కెట్ చైర్మన్‌గా ఇప్పటి దాక పింగిళ రమేష్ వ్యవహరించారు. ఈసారి బీసీ మహిళకు రిజర్వు చేయడంతో గత చైర్మన్ పింగిళి రమేష్ ఆయన భార్య పింగిళి రమాదేవికి ఇవ్వాలని మంత్రి రాజేందర్‌ను కోరుతున్నట్లు సమాచారం. కాగా.. గతంలో జమ్మికుంట మార్కెట్ కోసం ప్రయత్నం చేసిన పొనగంటి మల్లయ్య ఈసారైనా తన భార్య పొనగంటి శారదకు ఇవ్వాలని మంత్రిని కోరినట్లు సమాచారం.
- కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ జనరల్ కోటాలో గోగూరి నర్సింహారెడ్డికి మొదటగా అవకాశం దక్కింది. రొటేషన్‌లో భాగంగా ఈ సారి కరీంనగర్ ఎస్‌సీ మహిళకు కేటాయించా రు. దీంతో పలువురు ప్రయత్నాలు చేస్తుండగా, ఇటీవల బావుపేట సర్పంచ్ దావా వాణి, తీగలగుట్టపల్లి సర్పంచ్ మల్లయ్య భార్య జంగపల్లి సుజాత, గోపాల్‌పూర్ మాజీ సర్పంచ్ బెజ్జంకి లలిత ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను కోరినట్లు తెలిసింది.
- జగిత్యాల జిల్లా గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం మే 6, 2016లో ఏర్పాటైంది. అప్పుడు ఎస్టీకి రిజర్వు కాగా, మాలోత్ బాసునాయక్ చైర్మన్‌గా చేశారు. మే 5తో పాలకవర్గం గడువు ముగిసింది. రొటేషన్‌లో ఇప్పుడు జనరల్‌కు రిజర్వు కాగా కనుకుంట్ల లింగారెడ్డి (ఉ పసర్పంచ్ గొల్లపల్లి), నేరెళ్ల గంగారెడ్డి (ఎంపిటీసీ, ఇబ్రహీంనగర్), ముస్కు కిష్టారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు (గొల్లపల్లి), పల్లె నల్లకొండం గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు (గొల్లపల్లి) ప్రయత్నాలు చేస్తున్నారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మార్కెట్ కమిటీ రెండేళ్ల క్రితం పాలకవర్గం నియమించారు. ఈనెల 8తో గడువు ముగిసింది. కొత్తగా ఈసారి ఓసీకి రిజర్వేషన్ కేటాయించారు. ఇందుకోసం గడ్డమీది శ్రీకాంత్‌రెడ్డి, గౌరినేని నారాయణ, ప్రస్తుత టీఆర్‌ఎస్ అధ్యక్షుడు లింగన్నగారి దయాకర్ రావు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆశీస్సులున్న లింగన్నగారి దయాకర్‌రావు పేరు దాదాపుగా ఖరారైనట్లు ప్రచారం.
- జగిత్యాల జిల్లా పెగడపల్లి మొట్టమొదటి మార్కెట్ కమిటీ పాలకవర్గం 2016 జూలై 6న ఏర్పాటైంది. జనరల్ రిజర్వు కావడంతో కోరుకంటి రాజేశ్వర్‌రావును చైర్మన్ చేశారు. ఈ నెల 6న పాలకవర్గం గడువు ముగియగా, ఈసారి ఇప్పుడు ఎస్టీకి రిజర్వు అయ్యింది. బక్కా నాయక్ (ఏడుమోటలపల్లి), తిరుపతినాయక్ (ఏడుమోటలపల్లి), అజ్మీర చిరంజీవి (మద్దుపల్లి) ప్రయత్నం చేస్తున్నారు.
- జగిత్యాల జిల్లా వెల్గటూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం గడువు ఈనెల 5న ముగిసింది. గతంలో ఎస్సీకి రిజర్వు చేయడంతో ముల్కల గంగారాంకు చైర్మన్‌గా అవకాశం ఇచ్చారు. ఈసారి వెల్గటూరు జనరల్ కోటా కింద రిజ ర్వు చేశారు. దీంతో ఆశవాహుల పేర్లు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఏలేటి చంద్రారెడ్డి(రాజరాంపల్లి), ఏలేటి క్రిష్ణారెడ్డి (ఎండపల్లి), రావు సుగ్రీవరావు (కొత్తపేట), పొనగోటి రాంమోహన్‌రావు (వెల్గటూర్), నూనె శ్రీనివాస్ (వెల్గటూర్), పత్తిపాక వెంటేష్ (వెల్గటూర్), ఏలేటి సత్యనారాయణ రెడ్డి (రాజరాంపల్లి) తదితరులు రేసులో ఉన్నారు.
- రాజన్న సిరిసిల్ల జల్లా ఇల్లంతకుంట మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని గత 2016 జూన్12న ప్రభుత్వం నియామకం చేసింది. చైర్మన్‌గా గుండ సరోజన రెండేళ్లపాటు పాలన సాగించారు. ఈనెల 12న పదవీకాలం పూర్తయింది. ఈసారి ఓసీ రిజర్వు కావడంతో మల్లుగారి రవీందర్‌రెడ్డి, గుండ ముత్తయ్య, చల్ల నారాయణ, గొడుగు తిరుపతి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వద్దకెళ్లి ఎవరికి వారే వినతులు సమర్పించుకుంటున్నారు.
- కరీంనగర్ జిల్లా మానకొండూరు మార్కెట్ కమిటీ పాలకవర్గం 2016 జూన్ 13న ఖరారు కాగా ఈ నెల 12న ముగిసింది. ప్రస్తుతం మనకొండూర్ మార్కెట్ యార్డ్ బాధ్యతలు డీఎంవో పద్మావతి చూస్తున్నారు. అయితే.. ఈసారి ఈ సీటును జనరల్‌కు కేటాయించగా మాడ తిరుపతిరెడ్డితోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.
- మెటపల్లి, మల్లాపూర్, కోరుట్ల, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీలను 2016 ఏప్రిల్ 21 నియమించారు. వీటి పదవీకాలం ఏప్రిల్ 21న ముగిసింది. మెట్‌పల్లి మార్కెట్ ఎస్సీ మహిళ కాగా జరుపుల భారతి, మలోవత్ కరుణ పోటీ పడుతున్నారు. ఇబ్రహీంపట్నం ఎస్సీ మహిళ కాగా గడసనంద లావణ్య, జంగ సరస్వతి పోటీ పడుతున్నారు. కోరుట్ల బీసీ మహిళ కాగా అన్నం లావణ్య, జనరల్ స్థానం మల్లాపూర్ నుంచి ఆదిరెడ్డి, నర్సారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉన్నారు. కథలాపూర్ మార్కెట్‌కు జూలై 8 వరకు గడువుండగా, జనరల్‌కు రిజర్వు కావడంతో నాగం భూమయ్య, వర్థినేని నాగేశ్వరరావు, గడ్డం భూమారెడ్డి, చీటి విద్యాసాగర్‌రావు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు.
అక్టోబర్ వరకు అన్ని మార్కెట్ కమిటీలు.. మంత్రులు, ఎమ్మెల్యేలే కీలకం..
ఈనెల 27 వరకు ఏడు మార్కెట్ కమిటీల పాలకవర్గం కాలపరిమితి తీరనుండగా, వచ్చే నెల నుంచి అక్టోబర్ వరకు మిగిలిన అన్ని మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాల నియామకం అనివార్యం. ఈ కమిటీల కూర్పులో మంత్రులు, ఎమ్మెల్యేలే కీలకం కాగా, ఆశావహులు సైతం వారినే ఆశ్రయిస్తున్నారు. కథలాపూర్ మార్కెట్ కమిటీ 2016 సంవత్సరం జూలైలో నియమించారు. అదే కమిటీ గడువును పెంచారు. వాటి గడువు 2018 జూలై 8 వరకు ఉంది. ధర్మపురి పాలకవర్గం 2016 అక్టోబర్ 6న ఏర్పాటు అయ్యింది. బీసీ మహిళ రిజర్వు కావడంతో అల్లం దేవమ్మను చైర్మన్ చేశారు. అక్టోబర్ 6, 2017కు ముగియగా, ఆరు నెలల చొప్పున రెండు పర్యాయాలు గడువు పెంచడంతో ఆమె పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ 5 వరకు ఉంది.
జగిత్యాల బీసీ రిజర్వేషన్ కాగా శీలం ప్రియాంక చైర్మన్‌గా వ్యవహరించారు. 2016 సెప్టెంబర్ 19న ఏర్పడింది. ఈ పాలకవర్గం కాల పరిమితి ఈ ఏడాది సెప్టెంబర్ 18న ముగియనుంది. ఇలా ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, జూలపల్లి, కాటారం, కాల్వశ్రీరాంపూర్, మంథని, హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి, గంగాధర, చొప్పదండితోపాటు పలు మార్కెట్ కమిటీల పాలకవర్గం ఈనెల 27 మొదలు అక్టోబర్ వరకు కాలపరిమితి ముగియనుండగా, ఇప్పటి నుంచే ఆశావహులు తొందరపడుతుండటం అధికార పార్టీ నేతలకు తలనొప్పిలా మారింది.
Comments
Please login to add a commentAdd a comment