కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న వెంకటాపూర్ రైతులు
సిరిసిల్లటౌన్ : ప్రజాసంఘాల నిరసనలు, ధర్నాలతో సిరిసిల్ల కలెక్టరేట్ ప్రాంగణం దద్దరిల్లింది. జిల్లాలోని గొర్రెల కాపరులు, ఎస్సీ, ఎస్టీలు ధర్నాలు చేపట్టారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కలెక్టర్ ఆఫీసు ప్రాంగణం నిరసనలతో హోరెత్తింది.
పరిహారం ఇప్పించాలి..
మధ్య మానేరులో ఆస్తులు కోల్పోతున్న తమకు పరిహారం సత్వరమే ఇప్పించాలని తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామస్తులు కోరారు. 2012–13లో తమ ఇళ్లకు పరిహారం కోసమని రెవెన్యూ డిపాజిట్ చేశామన్నారు. వాటికి సంబంధించిన పరిహారం ఇప్పటికీ రాలేదన్నారు.
ఇప్పటికే పదిసార్లు తాము చేసిన డిపాజిట్, ఛాలన్‌లతో పాటు రెవెన్యూ అధికారులను సంప్రదించినా స్పందించడం లేదని వేల్పుల మల్లేశం, మాన్వాడ రాజనర్సు, మచ్చ రాజయ్య, ఈసరి చంద్రయ్యలు కలెక్టర్ ఆఫీస్‌లో వినతిపత్రం సమర్పించారు.
వర్క్ ఆర్డర్లు ఇప్పించాలి..
మ్యాక్స్ సొసైటీల ద్వారా ఆర్వీఎం, డబ్ల్యూడీకి సంబంధించిన షూటింగ్, షర్టింగ్ క్లాత్‌ను తయారు చేయించాలని జిల్లా పవర్‌లూం మ్యాక్స్ సంఘాల సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు జేసీ యాస్మిన్‌బాషాకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వ ఆర్డర్లకు సంబంధించిన షూటింగ్, షర్టింగ్, ఓని క్లాత్ టెక్స్‌టైల్‌పార్క్ యజమానులకు ఆర్డర్లు ఇస్తున్నట్లు తెలిసిందన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఎలాంటి ఆర్డర్లు లేకుండా సుమారు పదివేల పవర్‌లూంలు ఉన్నాయని.. వాటికి మ్యాక్స్ సొసైటీల ద్వారా ఆర్డర్లు ఇచ్చి నేతకార్మికులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పవర్‌లూం మ్యాక్స్ సంఘాల సంక్షేమ సంఘం ప్రతిని«ధులు చిమ్మని ప్రకాశ్, వేముల దామోదర్, జి.ప్రభాకర్, రమేశ్, రాజశేఖర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
పట్టా భూములు ఆక్రమిస్తున్నారు..
14 ఏళ్లుగా కాస్తు చేస్తున్న పట్టా భూములను ఫారెస్టు అధికారులు లాక్కుంటున్నారని ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన రైతులు ఆరోపించారు. సదరు భూములపైనే ఆధారపడి జీవిస్తున్న తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి మాట్లాడారు.
సర్వే నం.119, 1121లో 40 కుటుంబాలు రెండేసి ఎకరాల చొప్పున కాస్తు చేస్తున్నామన్నారు. వీటికి సంబంధించిన పట్టాలు గతంలోనే ప్రభుత్వం అందించగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నామన్నారు. ఇటీవలే ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి సదరు భూములకు కంచె వేసి తమను దుర్భాషలాడుతూ దిక్కున్నచోట చెప్పుకోండంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. కలెక్టర్ తమకు న్యాయం చేయాలని కోరారు.
గొర్రెలకు ఇన్సూరెన్స్ చేయించాలి
రాష్ట్రంలోని గొర్రెలన్నింటికీ ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేయించాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు రాజన్నయాదవ్ డిమాండ్ చేశారు. జిల్లాలోని యాదవుల సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలులో దళారులు, లంచగొండి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
జీవాల ఒక్క యూనిట్‌కు 50 గొర్రెలు, రెండు పొట్టేళ్లు ఇవ్వాలని, చనిపోయిన గొర్రెలన్నింటి స్థానంలో కొత్త గొర్రెలను అందివ్వాలని వినతిపత్రం అందించారు. జెగ్గాని మల్లేశం, వాసరవేని మల్లేశం, వీరవేని మల్లేశం, బొబ్బాల మల్లేశం, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment