జంప్ జిలాని
► సొంత పార్టీలోనే పొసగని నేతలు
► ఒక గ్రూపు నుంచి మరో గ్రూపులోకి జంప్
► జిల్లాలో అధికార పార్టీలో కొత్త తరహా రాజకీయాలు
► నష్టం తప్పదంటున్న విశ్లేషకులు
► అయోమయంలో కార్యకర్తలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాలలోనూ నందికొట్కూరు తరహా రాజకీయం మొదలయింది. అధికార పార్టీలోని నాయకులే.. గ్రూపులు మారుస్తూ పత్రికలకు ఎక్కడం నంద్యాలలోనూ షురూ అయింది. పార్టీలోని అవతలి గ్రూపు వ్యక్తులను బలహీనం చేసేందుకు వీలుగా మరో గ్రూపు ఆడుతున్న ఈ నాటకంలో అధికారపార్టీ పరువు బజారుకెక్కుతోంది. పార్టీలో తమ గ్రూపు బలమే ఎక్కువని చాటుకునేందుకు సాగుతున్న ఈ జంప్‌జిలానీల వ్యవహారం అంతిమంగా ఆ పార్టీనే నష్టపర్చక తప్పదనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. నిన్న నందికొట్కూరు.. నేడు నంద్యాల.. రేపు కోడుమూరు నియోజకవర్గంలోనూఇదే తరహా రాజకీయం మొదలవుతుందేమోననే ఆందోళన ఆ పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది.
కొత్త నేత వచ్చారా.. గ్రూపులు మార్చేద్దాం
వాస్తవానికి గతంలో రాజకీయాలు అంటే పార్టీ మారిన నేతతో పాటే కార్యకర్తల పయనం ఉండేది. అంతేతప్ప.. ఒకే పార్టీలోనే గ్రూపులు మారడం జరిగేది కాదు. ఒకవేళ జరిగినా.. తాము గ్రూపు మారామంటూ పత్రికలకు ఎక్కడం ఎన్నడూ చూడలేదు. అయితే, ఇందుకు భిన్నంగా జిల్లాలో ఈ తరహా రాజకీయాలు అధికమయ్యాయి. మొదట్లో నందికొట్కూరు నియోజకవర్గంలో మాండ్ర శివానందరెడ్డి అధికార పార్టీలో చేరిన వెంటనే.. కొద్ది మంది తెలుగుదేశానికి చెందిన నేతలే వచ్చి శివానందరెడ్డి గ్రూపులో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ తరహా ప్రకటనలు నందికొట్కూరులో మొన్నటివరకు సర్వసాధారణం. ఇప్పుడు తాజాగా నంద్యాలలోనూ ఈ తరహా గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. కొత్త నేత పార్టీలోకి వస్తే తన బలాన్ని పెంచుకునేందుకు అవతలి పార్టీలోని వారిని కాకుండా సొంత పార్టీలోని మరో గ్రూపునకు చెందిన నేతలను చేర్చుకుంటూ బల నిరూపనకు దిగుతుండటం గమనార్హం.