Mandra sivanandareddy
-
శివ.. శివా.. కృష్ణమ్మనూ వదలవా..?
సాక్షి, నందికొట్కూరు : శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టు... నందికొట్కూరులో ఈ నయా ‘శివుడి’ ఆజ్ఞ లేనిదే ఏ ఒక్క పనీ జరగదు. ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఎలాంటి దందా అయినా యథేచ్ఛగా సాగిపోతుంది. అనుచరులు దోచుకోవడానికి, తాను కమీషన్లు దండుకోవడానికి ఏకంగా కృష్ణా నదినే అప్పగించేశారు. ఇంకేం.. వారు ఇసుక దందాకు నందికొట్కూరును కేంద్రంగా మార్చుకుని..కృష్ణమ్మ గుండెల్లో గునపాలు దించుతున్నారు. తమ కళ్లెదుటే కృష్ణా నదిని లూటీ చేస్తున్నా అధికారులకు మాత్రం కమీషన్లు తప్ప ఏవీ కనపడటం లేదని ప్రజలు మండిపడుతున్నారు. నంద్యాల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డికి కృష్ణా నదిలో ఇసుక అక్రమ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా మారడంతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నప్పుడు తన అనుచరులతో ఇసుక వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. వారి నుంచి 40 శాతం కమీషన్లు పుచ్చుకుంటూ అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బందులూ రాకుండా అన్నీ తానై వ్యవహరించారు. దీంతో రెచ్చిపోయిన ‘తమ్ముళ్లు’ కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక దందా సాగిస్తున్నారు. నది స్వరూపమే మారిపోయేంతగా తవ్వకాలు జరుపుతున్నారు. నదిలో ఇసుక తవ్వుకోవడం, ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా నందికొట్కూరుకు తీసుకురావడం, ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించడం పరిపాటిగా మారింది. ఏప్రిల్ వచ్చిందంటే చాలు ఇసుక వ్యాపారం మరింత జోరుగా సాగిస్తున్నారు. ఈ సమయంలో నదిలో నీటినిల్వ తగ్గిపోవడంతో వారి పంట పండుతోంది. రూ.లక్షల్లో ఆదాయం.. నందికొట్కూరులోనే ట్రాక్టర్ ఇసుకను రూ.5 వేలకు పైనే అమ్ముతున్నారు. పాములపాడు, ఆత్మకూరు ప్రాంతాల్లో అయితే రూ.8 వేల వరకూ విక్రయిస్తున్నారు. దీంతో పైసా ఖర్చు లేకుండానే లక్షలాది రూపాయలు టీడీపీ నాయకుల జేబుల్లోకి చేరుతున్నాయి. పోలీసులకు కూడా మామూళ్లు ఇస్తూ దందా నిరాటంకంగా సాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బ్రాహ్మణకొట్కూరు పోలీసులకు నెలకు ఒక ట్రాక్టర్‌పై రూ.2,500 చొప్పున చెల్లిస్తున్నట్లు వినికిడి. అలాగే జూపాడుబంగ్లా పోలీసులకు ఓ ప్రముఖ వ్యక్తి ఒక ట్రాక్టరుపై రూ.2500 చొప్పున చెల్లిస్తున్నాడు. పాములపాడు పోలీసులకు ఒక్కొక్క ట్రాక్టరు యాజమాని రూ.3 వేలు చొప్పున దాదాపు వంద ట్రాక్టర్ల నుంచి రాత్రికి రాత్రే వసూలు చేసి ఇచ్చినట్లు విమర్శలున్నాయి. అడుగంటుతున్న భూగర్భజలాలు కృష్ణానదిలో ఇసుకను యథేచ్ఛగా తోడేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సమీప గ్రామాల ప్రజలు తాగునీటి కష్టాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇవన్నీ తెలిసినా పోలీసులు గానీ, రెవెన్యూ అధికారులు గానీ చర్యలు చేపట్టడం లేదు. అధికార పార్టీ నాయకుని ఒత్తిళ్లు, వాటాలపై మోజుతో వారు మిన్నకుండిపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలని కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. సరిహద్దులు దాటిస్తూ.. వందలాది ట్రాక్టర్లు, టిప్పర్లు ఇసుక లోడ్‌తో నిత్యం సరిహద్దులు దాటుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పూడూరు, రాళ్లంపాడు, శాతనకోట, మల్యాల, బిజినవేముల, నెహ్రునగర్ గ్రామాల పొలిమేరలో ఉన్న కృష్ణానది నుంచి ఇసుకను తీసుకుని సరిహద్దులు దాటిస్తున్నారు. నకిలీ పర్మిట్లు సృష్టించి వందల సంఖ్యలో ట్రాక్టర్లు , టిప్పర్లలో ఇసుకను నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పాములపాడు, కొత్తపల్లి, మిడుతూరు, గడివేముల, పగిడ్యాల, ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలంలోని పలు గ్రామాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుకకు డిమాండ్ పెరిగిపోవడంతో వీరింకా రెచ్చిపోతున్నారు. ఆ నాయకుని పేరు చెప్పి ప్రస్తుతం రాళ్లంపాడు, పూడూరు నుంచి చోటా మోటా నాయకులతో సహా అడ్డదిడ్డంగా ఇసుకను తవ్వేస్తున్నారు. అధికారులు మాత్రం అడపాదడపా దాడులు నిర్వహించి ‘చేతులు’ దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఒక రాత్రికే వంద ట్రిప్పుల దాకా తరలిస్తున్నారంటే వీరి దోపిడీ ఏస్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. -
మాండ్రకు మా సత్తా ఏమిటో చూపిస్తాం..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డికి గుణపాఠం చెప్పేందుకు వాల్మీకి నేతలు ఏకమవుతున్నారు. తమ సామాజిక వర్గాన్ని మోసం చేసిన మాండ్రకు సత్తా ఏమిటో చూపుతామని స్పష్టం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మాండ్రకు తగిన బుద్ధి చెప్పి.. తమ బలమేంటో నిరూపిస్తామని అంటున్నారు. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి తమ సామాజిక వర్గానికి వచ్చే సందర్భంలో మాండ్ర అడ్డు తగలడమే కాకుండా.. ఆ పదవి దక్కకుండా చేశారనేది ఆ వర్గం కోపానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2014లో జిల్లా పరిషత్ ఎన్నికల సందర్భంగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన లాలుస్వామిని జెడ్పీ చైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే, మాండ్ర శివానందరెడ్డి కాస్తా ఆపరేషన్ చేపట్టి.. ఆ వర్గానికి పదవి దక్కకుండా అడ్డుపడ్డారనేది వారి ప్రధాన ఆరోపణ. తమ వర్గానికి అన్యాయం చేసిన మాండ్రకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెబుతామని వారు స్పష్టం చేస్తున్నారు. నంద్యాల పార్లమెంట్ స్థానం పరిధిలో సుమారు రెండు లక్షల మంది వాల్మీకి ఓటర్లు ఉన్నారు. భారీ స్థాయిలో ఉన్న ఈ వర్గం ఓటర్లు కాస్తా తన అభ్యర్థిత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉండటంతో ఏమి చేయాలో ఆయనకు పాలుపోవడం లేదు. తాయిలాలు ఇచ్చి చల్లబరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలుస్తోంది. మొత్తమ్మీద గతంలో తాను చేసిన తప్పు తిరిగి తనకే చుట్టుకుని.. రాజకీయ భవితవ్యానికి ఈ విధంగా అడ్డుగా నిలుస్తుండటంతో ఏం చేయాలో అర్థం కాక చేష్టలుడిగి చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ... స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో మాండ్రకు టీడీపీ సీటిచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగింది. అప్పట్లో కూడా మాండ్రకు సీటిస్తే ఓడించాలని వాల్మీకి వర్గానికి చెందిన నేతలు భావించారు. ఇదే అంశంపై ఆ పార్టీ అధిష్టానానికి సమాచారం పంపారు. అయితే, ఆ తర్వాతి పరిణామాల్లో మాండ్రకు సీటు ఇవ్వలేదు. కేఈ ప్రభాకర్‌ను బరిలో దింపారు. ఆయన కాస్తా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మాండ్ర శివానందరెడ్డి ఏకంగా నంద్యాల పార్లమెంటు అభ్యర్థిగా టీడీపీ తరఫున బరిలో నిలిచారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయకూడదని వాల్మీకులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తమను మోసం చేసిన మాండ్రకు కచ్చితంగా బుద్ధి చెబుతామని వారు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే సత్తా చాటేవాళ్లమని, అప్పట్లో ఆయనకు సీటు రాకపోవడంతో తప్పించుకున్నారని పేర్కొంటున్నారు. దీంతో మాండ్ర అనుచరుల్లో ఆందోళన మొదలయ్యింది. ప్రధానమైన వాల్మీకి నేతలకు తాయిలాలు ఇచ్చేందుకు ఆయన వర్గం ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ తాము వెనక్కి తగ్గేది లేదని వారు స్పష్టం చేస్తుండడంతో ఆయనకు దిమ్మ తిరుగుతోంది. -
జంప్ జిలాని
► సొంత పార్టీలోనే పొసగని నేతలు ► ఒక గ్రూపు నుంచి మరో గ్రూపులోకి జంప్ ► జిల్లాలో అధికార పార్టీలో కొత్త తరహా రాజకీయాలు ► నష్టం తప్పదంటున్న విశ్లేషకులు ► అయోమయంలో కార్యకర్తలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాలలోనూ నందికొట్కూరు తరహా రాజకీయం మొదలయింది. అధికార పార్టీలోని నాయకులే.. గ్రూపులు మారుస్తూ పత్రికలకు ఎక్కడం నంద్యాలలోనూ షురూ అయింది. పార్టీలోని అవతలి గ్రూపు వ్యక్తులను బలహీనం చేసేందుకు వీలుగా మరో గ్రూపు ఆడుతున్న ఈ నాటకంలో అధికారపార్టీ పరువు బజారుకెక్కుతోంది. పార్టీలో తమ గ్రూపు బలమే ఎక్కువని చాటుకునేందుకు సాగుతున్న ఈ జంప్‌జిలానీల వ్యవహారం అంతిమంగా ఆ పార్టీనే నష్టపర్చక తప్పదనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. నిన్న నందికొట్కూరు.. నేడు నంద్యాల.. రేపు కోడుమూరు నియోజకవర్గంలోనూఇదే తరహా రాజకీయం మొదలవుతుందేమోననే ఆందోళన ఆ పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. కొత్త నేత వచ్చారా.. గ్రూపులు మార్చేద్దాం వాస్తవానికి గతంలో రాజకీయాలు అంటే పార్టీ మారిన నేతతో పాటే కార్యకర్తల పయనం ఉండేది. అంతేతప్ప.. ఒకే పార్టీలోనే గ్రూపులు మారడం జరిగేది కాదు. ఒకవేళ జరిగినా.. తాము గ్రూపు మారామంటూ పత్రికలకు ఎక్కడం ఎన్నడూ చూడలేదు. అయితే, ఇందుకు భిన్నంగా జిల్లాలో ఈ తరహా రాజకీయాలు అధికమయ్యాయి. మొదట్లో నందికొట్కూరు నియోజకవర్గంలో మాండ్ర శివానందరెడ్డి అధికార పార్టీలో చేరిన వెంటనే.. కొద్ది మంది తెలుగుదేశానికి చెందిన నేతలే వచ్చి శివానందరెడ్డి గ్రూపులో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ తరహా ప్రకటనలు నందికొట్కూరులో మొన్నటివరకు సర్వసాధారణం. ఇప్పుడు తాజాగా నంద్యాలలోనూ ఈ తరహా గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. కొత్త నేత పార్టీలోకి వస్తే తన బలాన్ని పెంచుకునేందుకు అవతలి పార్టీలోని వారిని కాకుండా సొంత పార్టీలోని మరో గ్రూపునకు చెందిన నేతలను చేర్చుకుంటూ బల నిరూపనకు దిగుతుండటం గమనార్హం.