సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డికి గుణపాఠం చెప్పేందుకు వాల్మీకి నేతలు ఏకమవుతున్నారు. తమ సామాజిక వర్గాన్ని మోసం చేసిన మాండ్రకు సత్తా ఏమిటో చూపుతామని స్పష్టం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మాండ్రకు తగిన బుద్ధి చెప్పి.. తమ బలమేంటో నిరూపిస్తామని అంటున్నారు. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి తమ సామాజిక వర్గానికి వచ్చే సందర్భంలో మాండ్ర అడ్డు తగలడమే కాకుండా.. ఆ పదవి దక్కకుండా చేశారనేది ఆ వర్గం కోపానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2014లో జిల్లా పరిషత్ ఎన్నికల సందర్భంగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన లాలుస్వామిని జెడ్పీ చైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
అయితే, మాండ్ర శివానందరెడ్డి కాస్తా ఆపరేషన్ చేపట్టి.. ఆ వర్గానికి పదవి దక్కకుండా అడ్డుపడ్డారనేది వారి ప్రధాన ఆరోపణ. తమ వర్గానికి అన్యాయం చేసిన మాండ్రకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెబుతామని వారు స్పష్టం చేస్తున్నారు. నంద్యాల పార్లమెంట్ స్థానం పరిధిలో సుమారు రెండు లక్షల మంది వాల్మీకి ఓటర్లు ఉన్నారు. భారీ స్థాయిలో ఉన్న ఈ వర్గం ఓటర్లు కాస్తా తన అభ్యర్థిత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉండటంతో ఏమి చేయాలో ఆయనకు పాలుపోవడం లేదు. తాయిలాలు ఇచ్చి చల్లబరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలుస్తోంది. మొత్తమ్మీద గతంలో తాను చేసిన తప్పు తిరిగి తనకే చుట్టుకుని.. రాజకీయ భవితవ్యానికి ఈ విధంగా అడ్డుగా నిలుస్తుండటంతో ఏం చేయాలో అర్థం కాక చేష్టలుడిగి చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ...
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో మాండ్రకు టీడీపీ సీటిచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగింది. అప్పట్లో కూడా మాండ్రకు సీటిస్తే ఓడించాలని వాల్మీకి వర్గానికి చెందిన నేతలు భావించారు. ఇదే అంశంపై ఆ పార్టీ అధిష్టానానికి సమాచారం పంపారు. అయితే, ఆ తర్వాతి పరిణామాల్లో మాండ్రకు సీటు ఇవ్వలేదు. కేఈ ప్రభాకర్‌ను బరిలో దింపారు. ఆయన కాస్తా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇప్పుడు మాండ్ర శివానందరెడ్డి ఏకంగా నంద్యాల పార్లమెంటు అభ్యర్థిగా టీడీపీ తరఫున బరిలో నిలిచారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయకూడదని వాల్మీకులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తమను మోసం చేసిన మాండ్రకు కచ్చితంగా బుద్ధి చెబుతామని వారు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే సత్తా చాటేవాళ్లమని, అప్పట్లో ఆయనకు సీటు రాకపోవడంతో తప్పించుకున్నారని పేర్కొంటున్నారు. దీంతో మాండ్ర అనుచరుల్లో ఆందోళన మొదలయ్యింది. ప్రధానమైన వాల్మీకి నేతలకు తాయిలాలు ఇచ్చేందుకు ఆయన వర్గం ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ తాము వెనక్కి తగ్గేది లేదని వారు స్పష్టం చేస్తుండడంతో ఆయనకు దిమ్మ తిరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment