‘ప్లాన్’ మారింది!
– అడ్డదిడ్డంగా రోడ్డు విస్తరణ పనులు
– మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధం
– అధికారపార్టీ అనుయాయుడికి లబ్ధి
– ఓ వాణిజ్య భవనం జోలికి వెళ్లని కర్నూలు కార్పొరేషన్ అధికారులు
మాస్టర్‌ప్లాన్.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తారు. కానీ.. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు మాస్టర్‌ప్లాన్ పనులు అడ్డగోలుగా చేపట్టారు. అలైన్‌మెంట్‌ను అడ్డదిడ్డంగా మార్పులు చేశారు. ఓ రహదారిలో రెండు చోట్ల వాణిజ్య భవనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుని స్వామిభక్తిని ప్రదర్శించారు. ఇదెక్కడి న్యాయమని అడిగితే..‘షార్ట్ టర్మ్’ పనులు శరవేగంగా చేయాల్సి ఉన్నందున అంతవరకే చేశామని సమాధానమిస్తున్నారు.
సాక్షి, కర్నూలు
కార్పొరేషన్‌లో ఆరేళ్లుగా పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నగరంలో అప్పటి కమిషనర్ మూర్తి కొన్ని అభివృద్ధి పనులు చేయించారు. ఆ తర్వాత ఎలాంటి పనులు జరగలేదనే చెప్పాలి. ఇక నిధుల లేమి కారణంగా కర్నూలు కార్పొరేషన్ పరిధిలో అభివద్ధి కుంటుపడింది. కృష్ణా పుష్కరాల పుణ్యమా అని నగరానికి ప్రభుత్వం రూ. 15 కోట్ల నిధులు కేటాయించింది. ఈ నిధులతో నగరంలో రహదారుల విస్తరణ పనులతోపాటు.. సుందరీకరణ తదితర అభివద్ధి పనులను కార్పొరేషన్ అధికారులు శరవేగంగా చేపట్టారు.
పనులు ఇలా..
కర్నూలు నగర జనాభా ఏటేటా పెరుగుతోంది. అయితే అందుకు తగ్గట్టు రహదారుల విస్తరణ లేకపోవడంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కరాల నిధులతో విశ్వేశ్వరయ్య సర్కిల్ నుంచి బిర్లాగేటు వరకు.. ఆర్‌ఎస్ రోడ్డు సర్కిల్ నుంచి రైల్వేస్టేషన్ రోడ్దు వరకు.. మదర్‌థెరిస్సా విగ్రహం నుంచి సుంకేసుల రహదారి వరకు.. సి–క్యాంపు నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టారు.
మార్పులు ఇలా..
ఆర్‌ఎస్ రోడ్డు సర్కిల్ నుంచి రైల్వేస్టేషన్ రోడ్డు వరకు 100 నుంచి 60 అడుగుల వరకు రహదారిని విస్తరించాలని నగర పాలక సంస్థ అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు పనులు కూడా చేపట్టారు. ఇందులో భాగంగా జలమండలి.. కేవీఆర్ కళాశాలకు సంబంధించిన ప్రభుత్వ స్థలాల్ని స్వాధీనం చేసుకుని రహదారిని విస్తరిస్తున్నారు. అదేవిధంగా మరోవైపున రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న భవనాలు, ఓ వాణిజ్య సముదాయం.. ట్రాన్స్‌కో భవనం.. జలవనరుల అధికారి నివాసం, అదనపు ఎస్పీ నివాసం వరకు రహదారిని విస్తరిస్తున్నట్లు మార్కింగ్ చేశారు. అయితే ఇక్కడే అధికారులు తెలివితేటలు ప్రదర్శించారు. జలమండలి ఎదురుగా ఉన్న రహదారిని 100 నుంచి 90 అడుగులకు.. అదేవిధంగా రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న రహదారిని 60 అడుగుల నుంచి 45 అడుగులకు కుదించి అధికారపార్టీ నేతల అనుయాయులకు అనుకూలంగా అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారు. గతంలో వేసిన మార్కింగ్ భిన్నంగా విస్తరణ పనులు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని నగరపాలక సంస్థ అధికారుల దష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లగా.. ఆయా ప్రాంతాల్లో ప్రై వేటు వ్యక్తులకు సంబంధించిన భవనాలు ఉన్నాయి.. కాబట్టి ప్రస్తుతం వాటి జోలికెళ్లలేదని అడిషనల్ సిటీప్లానర్ శాస్త్రి తెలిపారు.