‘కారు’ చిచ్చు | war in Trs for seats | Sakshi
Sakshi News home page

‘కారు’ చిచ్చు

Published Sun, Mar 4 2018 5:52 PM | Last Updated on Mon, Sep 17 2018 5:32 PM

war in Trs for seats - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దగ్గర పలుకుబడి ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్న చోట టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులు అవసరమైతే పార్టీ మారేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరి తమ స్థానాలను బలంగా చేసుకొని పాత గులాబీ నేతలను పక్కన పెట్టడంలో విజయం సాధించారు.

ఖానాపూర్‌ వంటి నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్న చోట అధికార పార్టీలోకి వచ్చిన నాయకులు ఈసారి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మొన్నటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆదిలాబాద్‌ పర్యటనతో ఆదిలాబాద్, మంచిర్యాల నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ నేతల మనోబలం పెరగగా... పోటీ ఎక్కువగా ఉన్న చోట పట్టుకోసం ప్రయత్నాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. 

ఒరిజనల్‌ గులాబీ నేతలకు స్థానం లేనట్టే..!
ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేంతా ప్రస్తుతం సాంకేతికంగా టీఆర్‌ఎస్‌ చెందిన వారే. బీఎస్‌పీ నుంచి గెలిచిన ఇంద్రకరణ్‌రెడ్డి(నిర్మల్‌), కోనేరు కోనప్ప(సిర్పూరు) ఏకంగా పార్టీనే విలీనం చేసి, అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా మారారు. ముథోల్‌లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన విఠల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. మిగతా ఏడుగురు టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన వారే. నిర్మల్, సిర్పూరు, ముథోల్‌ నియోజకవర్గాల్లో 2014లో ఓడిపోయిన టీఆర్‌ఎస్‌ నాయకులు ఇప్పుడు అక్కడ మళ్లీ పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు.

ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కేబినెట్‌ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సముద్రాల వేణుగోపాలాచారి ముథోల్‌ నుంచి ఓడిపోయినప్పటికీ, మళ్లీ ఆ నియోజకవర్గం వైపు దృష్టి సారించలేదు. రాజ్యసభకు పంపిస్తే వెళ్లే ఆలోచనలో ఉన్న వచ్చే ఎన్నికల్లో ముథోల్‌ నుంచి పోటీకి నిరాసక్తంగా ఉన్నట్లు సమాచారం. ఇక సిర్పూరు నుంచి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఈసారి టిక్కెట్టు ఆశిస్తున్నప్పటికీ... కోనేరు కోనప్ప పట్లనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సానుకూల ధృక్పథంతో ఉన్నారు. కోనప్ప సైతం ప్రజల మధ్య ఉంటూ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు.

నిర్మల్‌లో మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి సైతం టీఆర్‌ఎస్‌లో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు. నిర్మల్‌ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన కూచాడి శ్రీహరిరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన తరువాత కార్పొరేషన్‌ చైర్మన్‌గా అవకాశాలు వస్తాయని భావించినప్పటికీ, మంత్రి ఏలుబడిలో పార్టీకే దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడింది. ఈ ముగ్గురిలో టిక్కెట్టు రాని పక్షంలో వేరే మార్గం చూసుకునే ఆలోచనలో మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఉన్నట్లు సమాచారం. 

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు పోటీగా వ్యూహాలు
టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఏడుగురిలో ఒకరిద్దరి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సదాభిప్రాయంతో లేరనే ఊహాగానాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. మరికొన్ని నియోజకవర్గాల్లో ‘వచ్చేసారికి అవకాశం ఇస్తా’ అనే హామీ పొందినట్లు కొందరు నాయకులు ప్రచారం చేసుకుంటూ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్‌లో మంత్రి జోగు రామన్నకు ఎదురు లేని పరిస్థితి. ఇక్కడ వచ్చేసారి కూడా ఆయనకే అవకాశం అనడంలో అతిశయోక్తి లేదు. ఆసిఫాబాద్‌లో ప్రస్తుతం కోవ లక్ష్మి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే భర్త శ్యాంనాయక్‌ ఈసారి ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు.

ఆయన ఆదిలాబాద్‌ ఎంపీ స్థానం లేదా ఆసిఫాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ల నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ప్రస్తుత ఆసిఫాబాద్‌ సర్పంచ్, కోవ లక్ష్మి చెల్లెలు మర్సోకోల సరస్వతి కూడా టీఆర్‌ఎస్‌ టికెట్టు కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్‌కు మాజీ ఎంపీ రమేష్‌రాథోడ్‌ నుంచి గట్టి పోటీ ఎదురు కాబోతుంది. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన రోజే తాను వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్‌ నుంచి పోటీ చేయనున్నట్లు రమేష్‌రాథోడ్‌ ప్రకటించడం గమనార్హం. బోథ్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు స్థానంపై ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌ కన్నేయడంతో బాపూరావు పరిస్థితి కూడా డోలాయమానంలో పడింది. 

మంచిర్యాల జిల్లాలో రసవత్తరం
మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజవకర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తమ స్థానాలను బలం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు మాజీ మంత్రి జి.వినోద్‌కుమార్‌ నుంచి సీటు గండం పొంచి ఉంది. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చి మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లి తిరిగి గులాబీ గూటికి చేరిన మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్‌ సోదరులు ఈసారి తమ పూర్వ స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తే ఓదెలుకు ఇబ్బందికరమే. అయితే వివేక్‌ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అడపాదడపా కనిపిస్తున్నా... వినోద్‌కుమార్‌ మాత్రం చెన్నూరుకు వచ్చిన దాఖలాలు లేవు.

దీంతో తనకు ఢోకా ఉండదనే ధీమాతో ఓదెలు ఉన్నారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు పోటీగా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌ టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఆయనకు పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ మద్దతు ఉందనే ప్రచారం జరుగుతోంది. మంచిర్యాలలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు స్థానంలో సీటు కోసం సొంత పార్టీలో చాలా మందే పోటీ పడుతున్నారు. రాష్ట్ర టీవీ, చలనచిత్ర మండలి చైర్మన్‌ పుస్కూరు రామ్మోహన్‌రావు ఇటీవలి కాలంలో శుభాకాంక్షలు, అభినందనల ఫ్లెక్సీలతో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరో ఎంపీపీ మొదలుకొని మంచిర్యాల మునిసిపాలిటీ పాలకవర్గంలోని ఇద్దరు నాయకులు కూడా టిక్కెట్టు ఆశిస్తున్నారు.

అయితే ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీరాంపూర్‌ పర్యటన సందర్భంగా వేదిక పైనుంచి ఎమ్మెల్యే కోరికల పేరుతో మంచిర్యాలకు వరాలు ప్రకటించడం దివాకర్‌రావు వర్గానికి బలాన్ని పెంచింది. అయితే గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం కొంత గందరగోళానికి కారణమైంది. అయితే ఆయన గత నెల 24నే పార్టీలోకి వస్తారనే ప్రచారం జరిగినా, సీఎం సమక్షంలో కూడా టీఆర్‌ఎస్‌లో చేరకపోవడంతో ఎమ్మెల్యే వర్గం ఊపిరి పీల్చుకుంటోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement