- విపక్షాల ప్లాన్‌ను ముందే గ్రహించిన అధికారపక్షం
- వాయిదాలు, సస్పెన్షన్లతో వారికి ప్రచారం వస్తుందనే సభ వాయిదా
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల ఎత్తులను ముందే గ్రహించిన అధికార పక్షం.. వాటికి వ్యూహాత్మకంగా చెక్ పెట్టిం ది. రుణమాఫీని (మిగిలిన యాభై శాతం) ఒకే విడతలో బ్యాంకులకు చెల్లించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం నుంచే అసెంబ్లీలో అనుసరించాల్సిన ప్రణాళికను సిద్ధం చేసుకున్న విపక్షాలు.. వ్యవసాయ మంత్రి ప్రకటన తరువాత దాన్ని ఆచరణలో పెట్టాలని భావించాయి. కానీ వివరణలు ముగియగానే స్పీకర్ సభను వాయిదా వేశారు.
దీంతో గురువారం ఉదయం సభ ప్రారంభం కావడంతోనే విపక్షాలు ఇదే అంశాన్ని లేవనెత్తి.. గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిం చాయి. దీనిని పసిగట్టిన అధికారపక్షం వారికి అవకాశం ఇవ్వకుండా కొద్దిసేపట్లోనే సభను సోమవారానికి వాయిదా వేసింది. మధ్యలో మూడురోజుల పాటు సమావేశాలు లేనందున ఈ సమస్య సమసిపోతుందని భావించింది. అనూహ్యంగా సభ వాయిదాతో బిత్తరపోయిన విపక్ష సభ్యులు.. అసెంబ్లీ బయట కొద్దిసేపు ధర్నా చేయడం తప్పితే మొత్తం అంశంలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడంలో విఫలమయ్యారు.
ఏదో ఒక సంచలనం సృష్టించడానికి ప్రతిపక్షాలన్నీ ప్రయత్నిస్తాయని టీఆర్‌ఎస్ అంచనా వేసిందని.. అందుకే వారికి ఏమాత్రం అవకాశమివ్వకుండా కొద్దిసేపు గొడవ జరగ్గానే సోమవారానికి సభ వాయిదా పడేలా పావులు కదిపిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు రైతుల ఆత్మహత్యలపై రెండు రోజుల పాటు జరిగిన చర్చ సందర్భంగా విపక్షాలన్నీ సంయమనంతో వ్యవహరించాయి. ప్రభుత్వం చెప్పేదంతా విన్నాయి. కానీ,చివరికి ప్రభుత్వం వలలో విపక్షాలు చిక్కాయనే అభిప్రాయం వస్తోంది. కాంగ్రెస్, టీడీపీ సహా ఇతర విపక్షాల సభ్యులు కూడా ప్రతిపక్షాలు ఫెయిలయ్యాన్న అభిప్రాయాన్ని అంగీకరిస్తున్నారు.
వారికి ప్రచారం ఎందుకని..?
విపక్షాలను నియంత్రించడానికి కొద్దిసేపు సభను వాయిదా వేసినా ప్రయోజనం ఉండదని అధికారపక్షం భావించింది. తిరిగి సభ మొదలుకాగానే అదే గందరగోళం సృష్టించే అవకాశం ఉందని.. ఇది వారికి మీడియాలో ప్రచారం క ల్పించడం మినహా మరొకటి కాదనే భావన వ్యక్తమైంది. రైతుల సమస్యలపై రెండు రోజుల్లో ఏకంగా 12గంటల పాటు చర్చ జరిగాక కూడా ఆ అంశాన్ని పట్టుకుని ప్రతిపక్షాలు భీష్మించి, సభను రాజకీయంగా వాడుకునే యత్నం చేస్తున్నందునే వాయిదా నిర్ణయం తీసుకుని ఉంటారని చెబుతున్నారు. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలుపుతున్న సమయంలో.. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ ఒకే దగ్గర కూర్చుని ముచ్చటించారు. తర్వాత కొద్దిసేపటికే సభను స్పీకర్ వాయిదా వేశారు.
వ్యూహాత్మకంగా చెక్!
Published Fri, Oct 2 2015 12:34 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement