సభలో ద్వంద్వ ప్రమాణాలు | ruling parties duel standards in AP assembly | Sakshi
Sakshi News home page

సభలో ద్వంద్వ ప్రమాణాలు

Published Mon, Mar 21 2016 2:07 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

సభలో ద్వంద్వ ప్రమాణాలు - Sakshi

సభలో ద్వంద్వ ప్రమాణాలు

ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్న అధికారపక్షం
 
(కె. సుధాకర్ రెడ్డి)
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏకైక ప్రతిపక్షం పట్ల అధికార తెలుగుదేశం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా అనుసరిస్తున్న వైఖరిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. శాసనసభలో తమను ప్రశ్నించే వారే ఉండకూడదన్న ధోరణితో వెళుతున్నట్టు ఆయా సందర్భాలు స్పష్టం చేస్తున్నాయని చెబుతున్నారు. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యురాలు ఆర్.కె.రోజాను శాసనసభ నుంచి ఏడాది పాటు సస్పెండు చేసిన వ్యవహారం, తదనంతరం ఉత్పన్నమైన పరిణామాలపై పౌర సమాజంలో తీవ్ర చర్చ సాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన 14వ శాసనసభ ఇప్పటివరకు ఏడుసార్లు సమావేశం కాగా, ప్రతి సమావేశంలోనూ ప్రతిపక్షం పట్ల విషం చిమ్ముతూ నిందాపూర్వక ధోరణి, ఎదురుదాడి కొనసాగించడం తప్ప ఏనాడూ ప్రజాస్వామిక స్పూర్తిని ప్రదర్శించలేదని జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్తగా సభకు వచ్చారు మీకు నిబంధనలు, సంప్రదాయాలు తెలియవు నేర్చుకోండి... అంటూ ప్రతిపక్షాన్ని గేలి చేస్తూనే మరోవైపు అధికార పార్టీయే వాటికి తిలోదకాలివ్వడాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులు తమను తిట్టారంటూనే తీవ్రస్థాయిలో అభ్యంతరకర పదజాలం ఉపయోగిస్తూ ఎదురుదాడి చేయడం, ప్రతిపక్షనేతపై మూకుమ్మడిగా వ్యక్తిగతదాడి చేయడం అధికారపార్టీ ద్వంద్వప్రమాణాలకు నిదర్శనమంటున్నారు.

న్యాయ మూర్తులను, న్యాయ వ్యవస్థలను గౌరవించాలంటూ శాసనసభ వేదికగా గంటకుపైగా చ ర్చ చేసిన అధికార పక్షం నేతలే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పాటించకపోవడం గమనార్హం. ప్రతిపక్షం గొంతెత్తకూడదన్న లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక ధోరణికి రోజా సస్పెన్షన్ వ్యవహారాన్ని ఉదహరిస్తున్నారు. ఈ వ్యవహారంలో  ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ నీతికి ఉదాహరణగా అనేక సందేహాలు, సమాధానాలు లేని ప్రశ్నలెన్నో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అప్రజాస్వామిక ధోరణికి ఉదాహరణలెన్నో...

  • శాసనసభ 340 (2) నిబంధన కింద సస్పెండు చేసే అధికారం లేదని, దానిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని రోజా ప్రకటించిన తర్వాత డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. అప్పటికే సస్పెన్షన్ వేటుకు గురైన రోజా విషయాన్ని ఆ కమిటీ పరిశీలించి దానిని హక్కుల కమిటీకి నివేదించింది.
  • రోజాను అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో (డిసెంబర్ 18న) ఏడాది పాటు సస్పెండు చేయగా, రెండు నెలల తర్వాత  ఫిబ్రవరి 21న సభా హక్కుల కమిటీ (ప్రివిలేజెస్ కమిటీ)ని నియమించారు. సస్పెండు చేసిన రెండు నెలల తర్వాత ఏర్పడిన ఆ కమిటీ అదే అంశంపై రోజాకు నోటీసులు జారీ చేసి వివరణ కోరింది.
  • సస్పెన్షన్ తీర్మానం పెట్టినప్పుడు సభలో వివరణ ఇచ్చుకోవడానికి ఒక్క క్షణం అవకాశం ఇవ్వలేదు గానీ, కమిటీ ముందు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
  • ఇకపోతే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రస్తుత శాసనసభ ఇప్పటివరకు (ప్రస్తుతం జరుగుతున్నవి 7వ సమావేశాలు) మొత్తం ఏడు సార్లు సమావేశం కాగా అనేక సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడిని, ఆయనతో పాటు సభలో లేని, తిరిగొచ్చి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉన్నప్పటికీ ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేసిన ఎమ్మెల్యేను సభా హక్కుల కమిటీలో నియమించారు. (సభలో లేని వ్యక్తిపై దూషణలు కాదు కదా అసందర్భంగా ఆరోపణలు చేయడానికి కూడా నిబంధనలు అంగీకరించవు)

 
ద్వంద్వప్రమాణాలకు రుజువులివిగో..
శాసనసభ్యురాలు ఆర్ కె రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తూ చేసిన తీర్మానం చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు.
అలా చెప్పిన వారే ఆ తీర్పును పై కోర్టులో సవాలు చేస్తారు.

శాసన వ్యవస్థలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలే వని ఒకవైపు చెబుతారు.
మరోవైపు హైకోర్టు మధ్యంతర తీర్పుపై స్టే కోరుతూ అప్పీలు చేస్తారు.

రోజాను ఏడాది పాటు సస్పెండు చేయమన్నది శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించినట్టు చెబుతారు.
కానీ ఆరోజు ప్రతిపక్షం తీవ్రంగా వ్యతిరేకించిన అంశాన్ని ప్రస్తావించరు.

రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తూ తీర్మానం చేసిన తర్వాత దానిపై ప్రతిపక్షం అభ్యంతరం చెబితే తీర్మానం చేయడం పూర్తయింది కాబట్టి దానిపై చర్చకు అనుమతించబోమన్నారు. అది అయిపోయింది. ఆ అంశంపై మాట్లాడొద్దని అడ్డుకున్నారు.
ఆ వ్యవహారంపై మళ్లీ చర్చించడానికి వీలులేదన్న వారే... ఆ తీర్మానం  చెల్లదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు దానిపై మళ్లీ చర్చించాలని చెబుతారు.

శాసనసభ కార్యదర్శి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను స్వీకరిస్తారు.
కానీ రోజాను కనీసం అసెంబ్లీ పరిధిలోకి కూడా రానీయకుండా మార్షల్స్ పెట్టి అడ్డుకుంటారు.

రోజాపై విధించిన సస్పెన్షన్ తీర్మానం చెల్లదని శాసనసభ కార్యదర్శిని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు ప్రతిని ఆయన స్వీకరిస్తారు.
కానీ దానిపై శాసనసభ కార్యదర్శి మాత్రం అప్పీలుకు వెళ్లరు.

న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శికి శాసనసభా వ్యవహారాలు, నిర్ణయాలతో ఎలాంటి సంబంధం ఉండదు.
కానీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయనతో ధర్మాసనం ముందు అప్పీలు చేయిస్తారు.

శాసనసభ నిబంధన 340 (2) కింద రోజాను ఏకంగా ఏడాది పాటు సస్పెండు చేసే అధికారం లేదని ప్రతిపక్షం అన్నప్పుడు మాకు రూల్స్ తెలుసు అంటారు.
కానీ హైకోర్టులో వాదనలు వినిపించే ముందు పొరపాటున 340 (2) నిబంధన కింద అని వచ్చిందనీ, నిజానికి రాజ్యాంగంలోని 194 నిబంధన కింద సస్పెండు చేశామని చెప్పారు. శాసనసభలో నియమ నిబంధనలను ప్రతిపక్ష నేత విడమరిచి సోదాహరణకు చెబుతున్నప్పుడు... ఏకంగా రూల్స్‌ను సస్పెండు చేస్తున్నారు. (స్పీకర్‌పై ప్రతిపక్షం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ప్రతిపక్ష నేత రూల్ 71 (2), రూల్ 72 (3) కింద పద్ధతి ప్రకారం చేపట్టాలన్నప్పుడు ఆ రూల్స్‌ను ఎత్తివేస్తూ అధికార పార్టీ తీర్మానం చేసింది)

ఆయా అంశాలపై ప్రతిపక్షం నిరసనలను టెలికాస్ట్ చేయకుండా నియంత్రిస్తారు.
కానీ ప్రతిపక్ష సభ్యుల నిరసనల సందర్భంగా శాసనసభ ప్రతిష్టకు భంగకలిగించే విధంగా ప్రవర్తించారంటూ వారిపై వేటు వేస్తారు.

సభలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడటానికి మైక్ ఇవ్వరు.
కానీ సభలో వాడకూడని (అన్-పార్లమెంటరీ) భాష మాట్లాడారని నిందిస్తారు.

ప్రతిపక్ష సభ్యులు హుందాగా వ్యవహరించాలని అంటారు..
కానీ వారిని రాయడానికి వీల్లేనంత తీవ్రమైన పరుషపదజాలంతో తిట్టిపోస్తారు.

నన్ను నువ్వు అని ఏకవచనంతో సంబోధిస్తున్నారంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి రగడచేస్తారు..
అదే సమయంలో తమ మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రతిపక్షనాయకుడిపై వ్యక్తిగత దాడి చే యిస్తారు. నిరాధార ఆరోపణలు గుప్పిస్తారు.

సభాపతి మైక్ ఇవ్వనంత వరకు ఏ సభ్యుడు మాట్లాడినా అవి రికార్డుల్లోకి వెళ్లవు.
రికార్డుల్లోకి వెళ్లని మాటలకు సంబంధించిన (అది కూడా ప్రతిపక్ష సభ్యులకు సంబంధించి మాత్రమే) ఆడియో సీడీలు బయటకు లీక్ చేసి మీరు ఇలా అడ్డగోలుగా మాట్లాడారంటూ వాటిపై రాద్ధాంతం చేస్తారు.

స్పీకర్ అనుమతితోనే ఆ సీడీలను విడుదల చేశామని ఒకరోజు చెబుతారు.
ఆ ఆడియో సీడీల బయటకు పొక్కడంపై తాను ఎవరికీ అనుమతి ఇవ్వలేదంటూ స్పీకర్ ఆ మాటలను ఖండించినా, దానిపైన అధికార పక్షం మళ్లీ మాట్లాడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement