ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా? | YS Jagan challenge to the Chandrababu | Sakshi
Sakshi News home page

ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా?

Published Tue, Mar 21 2017 1:39 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా? - Sakshi

ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా?

చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ సవాల్‌
ధైర్యముంటే ఆ 21 స్థానాల్లో ఉప ఎన్నికలకు రండి
ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం... రెఫరెండంగా తీసుకుందాం
100 మంది ఎంపీటీసీలను కొనడం గొప్పా?
ఆ పని చేసినందుకు సిగ్గుతో సీఎం పదవికి రాజీనామా చేయాలి
ఇవేమీ ప్రజాభిప్రాయం ప్రతిబింబించే ఎన్నికలు కావు
ఎన్నికల చట్టబద్ధతను ప్రశ్నిస్తాం
బడ్జెట్‌ కేటాయింపులు, ఖర్చుల్లో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది


సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపును గెలుపుగా భావిస్తే... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నిజంగా ధైర్యం ఉంటే వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని  ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సవాలు విసిరారు. చంద్రబాబు ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని, వాటిని తాను ‘రెఫరెండం’ (ప్రజాభిప్రాయం)గా తీసుకుంటానని, ముఖ్యమంత్రి కూడా అలాగే తీసుకోవాలని ఆయన ఛాలెంజ్‌ చేశారు. నిజంగా తన పాలన బాగుందని చంద్రబాబు భావిస్తే, ప్రజలు ఆదరిస్తారని నమ్మకముంటే తన సవాలును స్వీకరించాలన్నారు.

సోమవారం శాసనసభ వాయిదా పడిన తరువాత ఆయన తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతున్నపుడు కర్నూలు, వైఎస్సార్‌ కడప, నెల్లూరు జిల్లాల్లో స్థానిక ఎమ్మెల్సీల ఓటమికి నైతిక బాధ్యత ఎవరు తీసుకుంటారని ఓ విలేకరి ప్రశ్నించగా... అడ్డగోలుగా భారీగా డబ్బులతో కొనుగోలు చేసినందుకు చంద్రబాబు సిగ్గుతో తలొంచుకుని తన పదవికి రాజీనామా చేసి పోవాలని జగన్‌ సమాధానమిచ్చారు. వందమంది ఎంపీటీసీలను కొనుగోలు చేసినందుకు సిగ్గు పడాల్సిందిపోయి శాసనసభలోనే దాన్నొక ఘనతగా చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి వంద మంది ఎంపీటీసీలను కొనుగోలు చేయడం గొప్పేమీ కాదన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా డబ్బులు వెదజల్లి ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ప్రలోభాలకు గురిచేసి దాన్నే గొప్ప గెలుపుగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశం వివరాలు ఆయన మాటల్లోనే...

ఈ మూడు జిల్లాల్లో మెజారీటీ ఓటర్లు మావాళ్లే....
కర్నూలు, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో పార్టీల వారీగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల వివరాలను చూస్తే వైఎస్సార్‌సీపీ బీఫామ్‌పై గెలిచిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఈ వివరాలు చూస్తే బుద్ధి ఉన్న వాళ్లు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునేవాళ్లు  ఎవరూ కూడా ఎన్నికల్లో పోటీకి పెట్టకూడదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవారు అసలు ఇలాంటివి ప్రోత్సహించనేకూడదు. కానీ ఆ స్థానంలో ఉన్న చంద్రబాబు విలువలకు నీళ్లొదిలేశారు. సిగ్గు లేకుండా ఎంపీటీసీలను, మనుషులను బట్టి రూ.15 లక్షల నుంచి రూ 20 లక్షల వరకూ ఇచ్చి దిగజారి కొనుగోళ్లు చేశారు. ప్రలోభాలకు లొంగని వాళ్లను కిడ్నాప్‌ (అపహరించి) చేశారు.

పోలీసులనూ ఉపయోగించుకున్నారు. ఇంత అడ్డగోలుగా వ్యవహరించింది కాక అదేదో ఘనకార్యమైనట్లుగా మళ్లీ నిండు శాసనసభలో ‘కడపలో మేం గెలిచాం’ అని ఘనతగా ప్రకటించుకునే నీచమైన స్థాయికి చంద్రబాబు దిగజారారు. కడప జిల్లాలో వైఎస్సార్‌సీపీ బీఫామ్‌పై 521 మంది, టీడీపీ గుర్తుపై 303 మంది ప్రజా ప్రతినిధులు గెలుపొందారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీకి 399 ఓట్లు వస్తే టీడీపీకి 433 ఓట్లు వచ్చాయి. సిగ్గు లేకుండా చేసిన ఈ కొనుగోళ్లను మనం కూడా ఆమోదిద్దామా? ప్రజాస్వామ్యంలో ఫోర్త్‌ ఎస్టేట్‌గా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడ్డానికి పెన్నూ, పేపర్‌ పట్టుకున్న మీడియా కూడా దీన్ని ఆమోదిస్తుందా?

తనకున్న డబ్బుతో, అధికారంతో ఎంపీటీసీలను కొనుగోలు చేసి కిడ్నాపులు చేసి ఆ సీటును మేం గెల్చుకున్నాం అని గొప్పగా అసెంబ్లీలో చెప్పుకుంటే ఏమనాలి? పత్రికలే ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారు? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఓ వంద మంది ఎంపీటీసీలను, కార్పొరేటర్లను కొనుగోలు చేయడం, వారికి తానే స్వయంగా కండువాలు కప్పడం, అనర్హత వేటు పడకుండా తప్పించడం గొప్ప సంగతా? దాన్ని ఘనతగా చెప్పుకోవడం గొప్ప సంగతా? ఆ జిల్లాలో మొత్తం ఓటర్లు 845 మంది ఇచ్చిన తీర్పు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుందా?

నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ గుర్తుపై 435 మంది టీడీపీ గుర్తుపై 340 మంది గెలిచారు. మొత్తం సభ్యుల సంఖ్య 847 మంది. ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి 462 ఓట్లు వస్తే, వైఎస్సార్‌సీపీకి 377 ఓట్లు వచ్చాయి. కర్నూలులో వైఎస్సార్‌సీపీకి 531 మంది స్థానిక ప్రతినిధులుంటే... టీడీపీకి 454 మంది ఉన్నారు. ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీకి 501, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి 565 ఓట్లు వచ్చాయి. మెజారిటీ  మాకుంటే మావైపు నుంచి ప్రతినిధులను ప్రలోభపెట్టి లాక్కుని ఎమ్మెల్సీ పదవులు గెల్చుకున్నారంటే ప్రజలకు ఎలాంటి సంకేతాలు మనం పంపిస్తున్నామో ఆలోచించాలి. చంద్రబాబుకు తన పాలన బాగుందనే ధైర్యం ఉంటే పార్టీ ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయించి ప్రజల్లోకి పోదాం రండి.

ఈ ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రలోభాలకు గురి చేసి... అనర్హత వేటు పడకుండా స్పీకర్‌ను కూడా తప్పుదోవ పట్టించి కాపాడుతున్నారు. ఈ స్థానాల్లో జరిగే ఉప ఎన్నికలను రెఫరెండమ్‌గా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చంద్రబాబు కూడా సిద్ధం కావాలి. ఇలా ఫిరాయించిన ఎమ్మెల్యేలందరికీ టీడీపీ టికెట్‌పై పోటీ చేయించమనండి, మేం మా పార్టీ టికెట్‌ మీద మా వాళ్లను నిలబెట్టుకుంటాం. పోరాటానికి దిగుదాం... ప్రజల్లోకి వెళదాం.. వారు ఎవరిని ఆశీర్వదిస్తారో చూద్దాం. ఆ దేవుడికీ, ప్రజలకూ నిర్ణయాన్ని వదలి వేద్దాం. నిజంగా చంద్రబాబుకు తన పాలన మీద నమ్మకమూ లేదు, ఆ ధైర్యమూ లేదు.

ఈ రెండు లేనందువల్లే అడ్డగోలుగా తప్పులు చేసింది చాలక అదేదో గొప్ప సంగతి అయినట్లు తన తప్పులన్నింటినీ నిస్సిగ్గుగా సమర్థించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవానికి స్థానిక సంస్థల్లో మాకు బలం లేని జిల్లాల్లో మేం పోటీ చేయలేదు. మాకు గెలుపునకు సరిపడా బలం లేదని, వేరే చోట్ల ఎన్నికలు జరుగుతున్నా నెల్లూరు, కడప, కర్నూలు మినహా మరెక్కడా అభ్యర్థులను నిలబెట్టలేదు. ఎందుకు వేరే చోట్ల పోటీ చేయలేదని ప్రశ్నించినపుడు అది సరైన విధానం కాదని ప్రకటించాం. ప్రతి జిల్లాలోనూ టీడీపీ మనుషులు ఎవరో... వైఎస్సార్‌సీపీ మనుషులెవరో స్పష్టంగా తెలిసిపోయాక అనైతిక కార్యకలాపాలను, ప్రలోభాలను ప్రోత్సహించడం ఇష్టం లేక మేం మా అభ్యర్థులను పోటీ చేయించలేదు.

అవినీతిపై మాట్లాడే హక్కు ఇంకా ఉందా!
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను నల్లధనంతో కొనుగోలు చేయబోయి సూట్‌కేసులతో అడ్డంగా ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయిన చంద్రబాబుకు ఇంకా అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? ఎన్‌సీఏఈఆర్‌ సంస్థ రాష్ట్రం అవినీతిలో అగ్రస్థానంలో ఉందని తేల్చింది. ఇంకా ఆయనకు మాట్లాడే హక్కు ఉందా? చంద్రబాబు మనసులో మాట ఏమిటో కూడా ఇవాళ శాసనసభలో బయట పడింది. అవినీతిలోనూ... అభివృద్ధిలోనూ నేనే నెంబర్‌ 1 అని చంద్రబాబే స్వయంగా చెప్పుకున్నారు.

సీఎంను కడపలో పోటీ చేయమనండి
ముఖ్యమంత్రికి అంత ఉత్సాహంగా ఉంటే కడపలో పోటీ చేయాలని జగన్‌ సవాల్‌ విసిరారు. 2019లో ఇక కడప జిల్లానే టార్గెట్, జగనే మా టార్గెట్‌ అని టీడీపీ నేతలు చెబుతున్నారని విలేకరులు ప్రశ్నించగా ఆయన ఈ మేరకు స్పందించారు. చంద్రబాబును పులివెందులకు వచ్చి పోటీ చేయమని సవాలు విసురుతున్నారా? అని ప్రశ్నించగా... ‘‘ముఖ్యమంత్రిని పులివెందులకు రమ్మని నేను సవాలు చేయడమంటే నా స్థాయి తగ్గించుకున్నట్లే! మేము 70 నుంచి 80 వేల ఆధిక్యతతో గెలిచే సీటుకు (పులివెందులకు) ఆయన్ను రమ్మని చెప్పి ఆయన్ను హ్యాండీక్యాప్డ్‌ చేయడం నాకిష్టం లేదు.

అందుకే కడపలో పోటీ చేయమంటున్నా’’నని చెప్పారు. 40 ఏళ్లలో తొలిసారి వైఎస్‌ కుటుంబాన్ని కడపలో ఓడించామని చంద్రబాబు చెప్పుకుంటున్న విషయం ప్రస్తావించగా... ఇది నిజంగా తన గెలుపని చంద్రబాబు అనుకుంటే... ఆయనకు బుద్ధి లేనట్లేనన్నారు. సుమారు 130 మంది స్థానిక ప్రతినిధులను కొనుగోలు చేయడం గొప్పతనమని చంద్రబాబు భావిస్తే, దానికి మీడియా కూడా మద్దతునిస్తే అంతకంటే దారుణం ఉండదని చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాల తీరుపై తాము న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. ఆయా జిల్లాల్లో తమ పార్టీ తరపున ఎన్నికైన స్థానిక ప్రతినిధుల వివరాలను ఎన్నికల కమిషన్‌ ముందు కూడా ఉంచి ఈ ఎన్నికల చట్టబద్ధతను ప్రశ్నిస్తామని జగన్‌ తెలిపారు.

ఒత్తిడులకు లొంగని ఎమ్మెల్యేలకు, స్థానిక ప్రతినిధులకు నా సెల్యూట్‌
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకుండా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పక్షాన నిలబడిన ఎమ్మెల్యేలకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సెల్యూట్‌ చేస్తున్నానని జగన్‌ చేయెత్తి సెల్యూట్‌ చేశారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ఎంత భారీగా ఒత్తిళ్లు చేసినా ప్రజాస్వామ్య విలువలకే వారంతా కట్టుబడినందుకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ వారు ఎంత బాగా ఓట్లను కొనుగోలు చేశారో అనడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం సిగ్గు చేటని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement