చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్ సీపీ అభ్యంతరం
అమరావతి : అమరావతిలో ఏపీ నూతన అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవానికి ప్రతిపక్షం రాకపోవడం దురదృష్టకరమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాన్ని ఆహ్వానించకుండా, పైపెచ్చు విమర్శలు చేయడం సరికాదని పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. అసెంబ్లీ భవన ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాన్ని ఆహ్వానించలేదని, పైగా ప్రతిపక్షాలు రాలేదని చంద్రబాబబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
ప్రతిపక్ష నేతలకు కనీసం ఫోన్‌లో అయినా మెసేజ్ పెట్టలేదన్నారు. సొంతింటి పండుగలా, టీడీపీ అధికార కార్యక్రమంలా ప్రారంభోత్సవం చేశారని మండిపడ్డారు. కాగా అంతకు ముందు స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో వైఎస్‌ఆర్ సీపీ నేతలు భేటీ అయ్యారు. వైఎస్‌ఆర్ సీఎల్పీ, ప్రతిపక్ష నేత కార్యాలయాల కేటాయింపుపై ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అసెంబ్లీ ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాన్ని ఆహ్వానించలేదన్నారు.