సభలో సీఎం ‘అలగా’ వ్యాఖ్య!
చంద్రబాబుపై సభా హక్కుల నోటీసుకు వైఎస్సార్ కాంగ్రెస్ నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఎన్ని మాటలయినా పడతానని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నిండు సభలో అదుపు తప్పి పలుమార్లు నోరు జారారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ సందర్భంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడిగిన వివరణలకు జవాబు చెప్పలేక ముఖ్యమంత్రి ఎదురుదాడికి దిగారు. 2.51 గంటల పాటు సుదీర్ఘ ప్రసంగం చేస్తున్నంత సేపూ మామూలుగానే ఉన్న చంద్రబాబు విపక్ష నేత వివరణలు అడిగినప్పుడు చివరి అరగంటలో మాత్రం రెచ్చిపోయారు. ఆగ్రహంతో ఊగిపోయారు.
‘‘అలగా జనం, అబద్ధాలు, తిన్నింటి వాసాలు, న్యూసెన్స్, గుండెల్లో నిద్రపోతా, మీ బండారం బయటపెడతా, మీ అంతు చూస్తా, పుట్టగతులుండవు’’ వంటి పదాలతో ఊగిపోయారు. తమను ఉద్దేశించి అలగా జనం అంటూ అభ్యంతరకర వ్యాఖ్య చేసినందుకు గాను ముఖ్యమంత్రికి సభా హక్కుల నోటీసు ఇవ్వాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. అంతకుముందు సభలో విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగానికి యథావిధిగా అడుగడుగునా ఆటంకం కల్పిస్తూనే వచ్చారు. ఈ గందరగోళం మధ్యనే రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈనెల ఆరున గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానాన్ని సభ ఆమోదించినట్టు ప్రకటించారు. అనంతరం సభ మంగళవారం ఉదయం 9 గంటలకు వాయిదా పడింది.
సీఎం నోట అభ్యంతరకర వ్యాఖ్యలు..
సాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం తర్వాత ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డికి వివరణలు అడిగే హక్కు ఉంటుందన్న విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రసంగంలోని పలు అంశాలపై జగన్‌మోహన్‌రెడ్డి వివరణ అడుగుతుండగానే పలుమార్లు మైక్ కట్ కావడంతో ఆగ్రహించిన వైఎస్సార్ సీపీ సభ్యులు స్పీకర్ పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. ప్రతిపక్షనేత మాట్లాడుతుండగా కట్‌చేసి మరొకరికి మైక్ ఎలా ఇస్తారంటూ నిలదీశారు.
జగన్‌మోహన్‌రెడ్డికి మైక్ ఇస్తానని చెబుతూనే చీఫ్ విప్ కాల్వ సూచన మేరకు స్పీకర్ కోడెల బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజుకు అవకాశం ఇచ్చారు. దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరం పూర్తయితే వీళ్ల (వైఎస్సార్‌సీపీ)కి పుట్టగతులుండవన్న భయంతో లేని పోని ఆరోపణలు చేస్తున్నారనడంతో విపక్షం మరింత బిగ్గరగా నినాదాలు చేసింది. కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమి జరిగిందో చూశారుగా.. మీ బండారం బయటపెడతా.. ఆ జిల్లాలోని పది సీట్లలోనూ పుట్టగతులు లేకుండా చేస్తానంటూ చంద్రబాబు ఆవేశంగా అన్నారు. ‘అలగా జనం’ మాదిరిగా తయారయ్యారు.. న్యూసెన్స్‌గా మారారంటూ విరుచుకుపడ్డారు.
సభా హక్కుల నోటీసుకు వైఎస్సార్ కాంగ్రెస్ నిర్ణయం
శాసనసభలో తమను ఉద్దేశించి ‘అలగా జనం’ అంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ముఖ్యమంత్రిపై సభా హక్కుల నోటీసును ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నందుకు తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రికి అనుచితమని, ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని సోమవారం సాయంత్రం ఆర్ అండ్ బి అతిథిగృహంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సమావేశమైన ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఈ మేరకు నోటీసును మంగళవారం ఉదయం స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఇవ్వనున్నారు.