సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం రాష్ట్రమంతటా ఆందోళనలు, ఆగ్రహావేశాలు పెల్లుబిగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆనంద నగరాలు పేరుతో వేడుకలు నిర్వహించడం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఇలాంటి పనికిమాలిన కార్యక్రమానికి తెలుగువారైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకావడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వ పథకాలపై 71 శాతం మంది సంతృప్తిగా ఉన్నారన్న సీఎం వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఎన్నికలకు వెళదామని సవాలు విసిరారు. బుధవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
‘‘టీడీపీ ప్రభుత్వ పథకాలపై 71శాతం సంతృప్తి ఉందట! రుణమాఫీ కాక రైతులు అప్పులపాలైనందుకా, ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చినందుకా, ఇంటికో ఉద్యోగం, దళితులకు ఇళ్లు దక్కినందుకా? అమరావతిని స్కాం క్యాపిటల్‌గా మార్చినందుకా? ఏ విషయంలో జనం సంతృప్తిగా ఉన్నారు?. నాడు వైఎస్సార్ అంటే ఆరోగ్యశ్రీ, రెండు రూపాయలకు కిలో బియ్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత కరెంట్ లాంటి పథకాలు గుర్తొచ్చేవి. మరి చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఏ ముఖ్యమంత్రి పాలననైనా ప్రజలు పొగుడుతారు కానీ చంద్రబాబు మాత్రం తనను తానే పొగుడుకుంటారు. ప్రజలంతా సంతోషంగా ఉంటే వెంటనే ఎన్నికలకు వెళదాం. టీడీపీ సిద్ధమేనా?
నాడు హరికృష్ణతో రాజీనామా చేయించారుగా: ఏపీకి చెందిన అందరు ఎంపీలూ రాజీనామాలు చేసి ఉంటే ఈపాటికి కేంద్రం దిగివచ్చేది. కానీ చిత్తశుద్దిలేని చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామాలు చేయించరు. ఢిల్లీలో డ్రామాలు చేసి, రాజీనామాలు చేయకుండా వచ్చిన టీడీపీ ఎంపీలను ప్రజలంతా తరిమికొట్టాలి. నాడు సమైఖ్యాంద్ర ఉద్యమంలో భాగంగా నందమూరి హరికృష్ణతో రాజీనామా చేయించిన చంద్రబాబు.. ఇవాళ తన బినామీ సుజనా చౌదరితో ఎందుకు చేయించలేదు? హోదా కోసం ఆందోళనలు చేస్తోన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులతో అడ్డగించడం సిగ్గుచేటుకాదా? మీరు 30 సార్లు ఢిల్లీకి వెళ్లింది నియోజకవర్గాల పెంపు కోసం కాదా?’’ అని ప్రశ్నించారు.
ఆయన విశ్వవిఖ్యాత పప్పు సార్వభౌమ: నాలుగేళ్లలో కనీసం నాలుగు అంతస్తుల భవనం కూడా కట్టలేని తెలుగు దేశం ప్రభుత్వం అక్రమార్జనలో మాత్రం ఆకాశాన్ని దాటిపోయిందని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ‘‘మూడు సెంటీమీటర్ల వర్షానికే తాత్కాలిక సెక్రటేరియట్ భవనంలోకి ఆరు సెంటీమీటర్ల నిళ్లొచ్చాయి. 13 మంది మంత్రుల పనితీరు భేష్ అని సీఎం అంటున్నారు. అవునుమరి.. ఒక్క రోడ్డు కూడా వేయలేని సీఎం కొడుకు విశ్వవిఖ్యాత పప్పు సార్వభౌమకు, విచ్చలవిడిగా బార్లు పెట్టి మహిళల జీవితాలను నాశనం చేస్తోన్న ఇతర మంత్రులకు ఈ కితాబు దక్కాల్సిందే! నాలుగేళ్లపాటు ఏకపక్షంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి ఇవాళ అఖిలపక్షం భేటీకి పిలిస్తే ఏఒక్కరూ వెళ్లని పరిస్థితి. ఇక పవన్ కల్యాణ్ హోదా కోసం కనీసం రెండు కిలోమీటర్లైనా నడవటం సంతోషం’’ అని రోజా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment