పంచేశారు
► రూ.14.67 కోట్ల నీరు– చెట్టు నిధులు బూడిదలో పోసినట్లే
► నేతల పందేరానికే రూ.10 లక్షల లోపునకు కుదించారు
► నాయకులకు లబ్ధే తప్ప ప్రయోజనం శూన్యం
► పునర్నిర్మించాల్సిన చోట మరమ్మతులతో సరి
► ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే పోలంరెడ్డి
తొలి విడతలో కోవూరు నియోజకవర్గానికి రూ.14.67 కోట్లు కేటాయించారు. ఈ పనులను రూ.10 లక్షలకు మించితే టెండరు పిలవాల్సి వస్తుందని దానికి మించకుండా ఆ లోపు నిధులతోనే పనులు చేపట్టేలా 187 పనులుగా ముక్కలు చేశారు. నీటి సంఘాల అధ్యక్షులకు లబ్ధి చేకూరేలా ముక్కలు చేసిన పనులను అధికార పార్టీ నాయకులకు అప్పగించేశారు. పునర్నిర్మించాల్సిన వంతెనలకు సైతం పైపై పూతలు పూసి సరిపుచ్చేస్తున్నారు.
కొడవలూరు(కోవూరు): కోవూరు నియోజకవర్గంలో తూర్పు, దక్షిణ, జాఫర్ సాహెబ్ కాలువలు ప్రధాన పంట కాలువలుగా ఉన్నాయి. తూర్పు, దక్షిణ కాలువలు కోవూరు, కొడవలూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం మండలాల్లోని ఆయకట్టుకు, జాఫర్ సాహెబ్ కాలువ ఇందుకూరుపేట మండలంలోని ఆయకట్టుకు సాగు నీరందిస్తాయి. వీటికింద లక్ష ఎకరాలకుపైఆ ఆయకట్టు ఉంది. ఈ కాలువలు, వాటి బ్రాంచి కాలువలపై 307 చిన్న, పెద్ద కల్వర్టులు ఉన్నాయి. బ్రిటిష్ కాలంలో నిర్మించిన కల్వర్టు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. వీటిలో సింహభాగం కల్వర్టులను పూర్తి స్థాయిలో పునర్నిర్మించాల్సి ఉంది. పీఆర్‌లో రూ.5 లక్షలు దాటితే టెండరు పిలవాల్సి ఉండగా, ఇరిగేషన్‌లో రూ.10 లక్షల వరకు నామినేషన్‌పై పనులు కట్టబెట్టే అవకాశం ఉంది.
దీనిని కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి టీడీపీ నేతలకు వరంగా మార్చారు. కల్వర్టు నిర్మాణానికి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని, రూ.10 లక్షలలోపు నిధులతో కల్వర్టులకు మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. పలు చోట్ల షట్టర్ల పునర్నిర్మాణం, దెబ్బతిన్న కాలువలకు రివిట్‌మెంట్‌లు అవసరమైనా రూ.10 లక్షలు దాటిన పనులకు టెండర్లు పిలవాల్సి వస్తుందని, వాటిని పక్కన పెట్టారు. తొలి విడతలో మంజూరైన నీరు–చెట్టు నిధుల 14.67 కోట్లను నీటి సంఘాల అధ్యక్షులకు 187 పనుల కింద విభజించి కట్టబెట్టేశారు. తమ్ముళ్లకు లబ్ధి్ద చేకూర్చేందుకు చర్యలు తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అధికారులకు కనువిప్పు కలిగేనా?
కల్వర్టులకు మరమ్మతుల వల్ల ఒనగూరే ప్రయోజనమేమీ ఉండదని ఇంజినీరింగ్ అధికారులకు తెలిసినా ఎమ్మెల్యే ఒత్తిడితో విభజించి అంచనాలు వేసేశారు. పనుల నాణ్యత విషయంలోనూ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో అధికార ఒత్తిడిలకు తలొగ్గి అవకతవకలకు పాల్పడిన హౌసింగ్ ఏఈలు ఇద్దరు సస్పెండ్ అయ్యారు. అయినా అధికారులకు కనువిప్పు కలుగలేదు. ఈ పనులకు 187 శిలాఫలకాలు వేయాల్సి వస్తుందని, నాలుగైదు పనులకు కలిపి ఒకటి వంతున వేశారు.
ఎమ్మెల్యే ప్రోత్సాహం
ఈ ఏడాది మే 12న నీటి సంఘాల అధ్యక్షులతో ఎమ్మెల్యే పోలంరెడ్డి సమావేశమై పనుల్లో అవకతవకలకు పాల్పడకుండా చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్యే ఇలా పైపై ప్రకటనలు చేస్తూ రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పనులను ముక్కలు చేసి తమ్ముళ్లకు కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.