ఇదేం విభజన!
♦ కొత్త జిల్లాలపై టీఆర్‌ఎస్‌లో భిన్నస్వరాలు
♦ ఏకగ్రీవ తీర్మానాన్ని పట్టించుకోకపోవడంపై కినుక
♦ విడిపోయిన హైదరాబాద్‌లో మళ్లీ చేర్చడమేమిటని రుసరుస
♦ ఉద్యమానికి సిద్ధమవుతున్న విపక్షాలు
జిల్లా యూనిట్‌గా విభజన ప్రక్రియ చేపట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేసినా పరిగణనలోకి తీసుకోకపోవడం, ఏకపక్షంగా జిల్లాను విడగొడుతూ అధికారులు ప్రతిపాదించడం టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు మింగుడు పడడంలేదు.
హైదరాబాద్ జిల్లా పరిధిలోకి తూర్పు ప్రాంతాలను చేర్చడం సహేతుకం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విలీన ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తున్నాయి.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాల పునర్విభజన అధికారపార్టీలో అసంతృప్తిని రాజేసింది. కొత్త జిల్లాల ఏర్పాటులో తమ ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఆపార్టీ నేతల అసంతృప్తికి కారణమైంది. ఇదే విషయాన్ని రాష్ట్రస్థాయి పునర్విభజన కమిటీ సభ్యుడు, ఎంపీ కేశవరావు ముందు కుండబద్దలు కొట్టారు. వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా కొనసాగింపుపై ఎలాంటి భేదాభిప్రాయం లేకున్నా.. మిగతా నియోజకవర్గాలను హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాల్లో కలుపుతూ ముసాయిదా రూపొందించడాన్ని తప్పుబడుతు న్నారు.
ఈ పరిణామాలను ముందుగానే పసిగట్టిన అధికారపార్టీ ఎమ్మెల్యే ఒకరు ఈ అంశంపై.. నేడో, రేపో విలేకర్ల సమావేశం పెట్టి మరీ తన అభిప్రాయాన్ని స్పష్టం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. జిల్లాల పునర్విభజనను రాజకీయ కోణంలో చూడకుండా.. సొంత నియోజకవర్గ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. 1978లో హైదరాబాద్ జిల్లా నుంచి విడిపోయి రంగారెడ్డి జిల్లా ఏర్పడిందని, మరోసారి తమను హైదరాబాద్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదన ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన విలేకర్ల సమావేశంలో తేల్చిచెప్పే అవకాశముంది.