District reorganization
-
జిల్లాల పునర్విభజనపై కీలక ఆదేశాలు
-
ఏపీ: జిల్లాల పునర్విభజనపై కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన కమిటీకి ప్రత్యేక సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల బౌండరీలు, నియంత్రణ, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి కమిటీ-1, నిర్మాణాత్మక, సిబ్బంది పునర్విభజన అధ్యయనానికి కమిటీ-2, ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనానికి కమిటీ-3, ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి సబ్ కమిటీ- 4 ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రాష్ట్ర స్థాయి కమిటీ, సబ్ కమిటీలకు సహాయం కోసం జిల్లాస్థాయి కమిటీలు, రాష్ట్రస్థాయి కమిటీకి సహాయంగా ఉండేందుకు సచివాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా 10 మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటుకానుంది. ఏపీసీఎఫ్ఎస్ఎస్ సీఈవో అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీకి సహాయంగా ఉండేందుకు సచివాలయం ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వివిధ రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రాథమికంగా ఆరు నెలల పాటు సచివాలయం కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. సబ్ కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు, సచివాలయ బాధ్యతలను ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. (అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్) -
మార్కెట్ మాయ...
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాల పునర్విభజన సమయంలో ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను సైతం విభజించింది. ప్రతి జిల్లాకు ఒక మార్కెటింగ్ శాఖ మేనేజర్‌ను నియమిస్తూ జీఓ జారీ చేసింది. అయితే రెండేళ్లకే తిరిగి ‘యూటర్న్’ తీసుకుంది. తాజాగా జీఓ నం.746ను విడుదల చేసింది. దీని ప్రకారం మార్కెటింగ్ జిల్లా స్థాయి కార్యాలయాలను మళ్లీ విలీనం చేయనుంది. జిల్లాల పునర్విభజన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లా మార్కెటింగ్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వాటికి మేనేజర్లను కూడా నియమించారు. ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విడిపోవడంతో కొత్తగూడెం మార్కెట్ యార్డు ఆవరణలో జిల్లా మార్కెటింగ్ కార్యాలయం ఏర్పాటైంది. అయితే అందులో డీఎంఓతోపాటు మరొక అధికారి మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది కొరతతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో అగ్రికల్చర్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ శాఖాధికారులు ఈ విషయాన్ని అధ్యయనం చేసి, తిరిగి యూటర్న్ తీసుకుని పాత పద్ధతిలోనే హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో జిల్లా మార్కెటింగ్ కార్యాలయాలను మాత్రమే ఉంచాలని నిర్ణయించారు. ఈ మేరకు అగ్రికల్చర్ అండ్ కో–ఆపరేషన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటికే జీఓ కూడా విడుదలైంది. అయితే ప్రస్తుతానికి మాత్రంకొత్తగూడెం జిల్లా కేంద్ర కార్యాలయం నుంచే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో జీఓ మినహా మరెలాంటి ఆదేశాలు రాకపోవడంతో జిల్లా మార్కెటింగ్ మేనేజర్ జె.నరేందర్ నేతృత్వంలోనే నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లా కేంద్రాలలో డీడీ స్థాయి అధికారిని, విభజన జిల్లాల్లో ఏడీ స్థాయి అధికారులను గతంలో వలె నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం ఉమ్మడి జిల్లా అయిన ఖమ్మంలో నూతనంగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్కెటింగ్ కార్యాలయం విలీనమై ఖమ్మం కేంద్రంగానే రెండు జిల్లాల కార్యకలాపాలు కొనసాగనున్నాయి. అయితే కొత్తగూడెం మార్కెట్ యార్డు సెక్రటరీనే విభజన జిల్లాల నిర్వహణను చూస్తారు. దీని ప్రకారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మార్కెట్ యార్డులో ఉండే సెక్రటరీ జిల్లాలోని కార్యకలాపాలను పరిశీలిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డీడీ స్థాయిలో ఉండే ఆర్.సంతోష్ కుమార్ ఉమ్మడి జిల్లా డీఎంఓగా బాధ్యతలు నిర్వహించనున్నారు. జీఓ నిజమే.. కానీ ఇంకా అమలుకాలేదు ఉమ్మడి జిల్లాల వారీగా మార్కెటింగ్ శాఖలను విలీనం చేస్తున్నమాట వాస్తవమే. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జీఓ కూడా విడుదలైంది. అయితే ఎన్నికల నేపథ్యంలో ఇంకా అమలు కావడం లేదని భావిస్తున్నాం. భవిష్యత్తులో రెండు జిల్లాల కార్యకలాపాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రం నుంచే జరుగుతాయి. – జె.నరేందర్, జిల్లా మార్కెటింగ్ శాఖాధికారి -
8 నెలలు..320 కేసులు
రఘునాథపాలెం: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పెట్టిన నూతన పోలీస్ స్టేషన్లలో రఘునాథపాలెం పోలీస్ స్టేషన్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 11–11–2016న పోలీస్ స్టేషన్ పెట్టినప్పటికీ..నాలుగు నెలల పాటు ఖానాపురం హవేలిలోనే కేసులు నమోదయ్యాయి. 8–4–17 నుంచి ఇప్పటి వరకు 8నెలల కాలంలో రఘునాథపాలెం పోలీస్ స్టేషన్లో మొత్తం 320 కేసులు నమోదయ్యాయి. దీని పరిధిలో మండలంలోని 17గ్రామ పంచాయతీలు, రూరల్ మండలం దారేడు, కామంచికల్ పంచాయతీలు, మొత్తం 34 శివారు గ్రామాలు దీని పరిధిలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్విభజన తర్వాత 66 కొత్త పోలీస్ స్టేషన్లు ప్రారంభం కాగా..వీటన్నింటిలో రఘునాథపాలెంలోనే కేసులు ఎక్కువ. వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఎక్కువ. డిసెంబర్లోనే ఇలా పది కేసులు ఉన్నాయి. స్టేషన్ ఆవిర్భావం నుంచి గతేడాది డిసెంబర్ వరకు ఇక్కడ గోపి పనిచేశారు. డిసెంబర్లో ఈయన పదోన్నతిపై గుండాల సీఐగా వెళ్లారు. ప్రస్తుతం ఆర్.కృష్ణ విధులు నిర్వర్తిస్తున్నారు. దర్యాప్తు ముమ్మరం.. కేసులు పెరిగినప్పటికీ..దర్యాప్తును మరింత జాగ్రత్తగా నిర్వహిస్తున్నాం. పరిధి ఎక్కువ కావడం వల్ల కేసులు పెరిగాయి. బాధితులు మధ్య వర్తుల ద్వారా కాకుండా నేరుగా..స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. – ఆర్.కృష్ణ, ఎస్సై, రఘునాథపాలెం -
నాగిరెడ్డిపేటపై కౌంటర్ దాఖలు చేయండి
హైదరాబాద్ : కొత్తగా ఏర్పాటు చేసిన కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట మండలాన్ని కలపడంపై హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా ఏర్పాటునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న జారీ చేసిన జీవో 230ని సవాలు చేస్తూ నాగిరెడ్డిపేట మండలానికి చెందిన జగ్గి జయరాజు, మరో 9 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ ప్రవీణ్‌కుమార్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, నిజామాబాద్‌లో ఉన్నప్పుడు కూడా జిల్లా ప్రధాన కేంద్రానికి నాగిరెడ్డిపల్లె 110 కిలోమీటర్ల దూరంలో ఉండేదని తెలిపారు. నాగిరెడ్డిపల్లెకు మెదక్ కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట మండలాన్ని కలిపారన్నారు. విద్యార్థులు జిల్లా కేంద్రానికి వెళ్లడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. మెదక్‌లో కలపాలంటూ స్థానిక ప్రజలు ఆందోళనలు చేసినా, వినతపత్రాలు సమర్పించినా, గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. కామారెడ్డిలో నాగిరెడ్డిపేట మండలాన్ని కలపడాన్ని నిరసిస్తూ రాజు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పగా, ఆ కారణంతోనే ఆత్మహత్య చేసుకున్నారనేందుకు ఆధారాలు ఏమిటని ప్రశ్నించారు. జిల్లా కేంద్రానికి వెళ్లడానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే, వారు మెదక్ జిల్లాకు వెళ్లి చదువుకుంటామంటే ఎవరు మాత్రం ఎందుకు అభ్యంతరం చెబుతారని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని నిలదీశారు. తరువాత ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, నాగిరెడ్డిపేట మండలం విషయంలో ఎటువంటి మార్పులు చేయలేదన్నారు. గతంలో ఇది కామారెడ్డి రెవిన్యూ డివిజనల్లో ఉండేదని, ఇప్పుడు ఆ డివిజన్నే జిల్లాగా మార్చామని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. -
ప్రజాభిప్రాయమే ఫైనల్
కొత్త జిల్లాలపై ప్రభుత్వానికి శషబిషలేమీ లేవు: సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో ప్రజలకు అసౌకర్యంగా ఉండే ప్రతిపాదనలను మార్చుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి శషబిషలు లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ప్రజా ప్రతినిధులు రాజకీయ కారణాలతో కాకుండా ప్రజల కోణంలో ఆలోచించాలని సూచించా రు. గద్వాల జిల్లా ప్రసక్తి లేనే లేదని, హన్మకొండ జిల్లా విషయంలో ప్రభుత్వం ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టంచేశారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి టాస్క్‌ఫోర్స్‌కు సరైన సూచనలు చేయాలని ప్రజాప్రతినిధులను కోరారు. మండల కేంద్రానికి దగ్గరగా ఉన్న గ్రామాలు వేరే మండలంలో ఉంటే అక్కడి ప్రజల అభిప్రాయాలు తీసుకుని మార్పుచేర్పులు చేయాలని ఆదేశించారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండాలనే ప్రతిపాదన ఏదీ లేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గం కచ్చితంగా ఒకే జిల్లాలో ఉంటుందని చెప్పలేమని అభిప్రాయపడ్డారు. దేశంలో ఇప్పటికే పది రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయన్నారు. మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భౌగోళికంగా పెద్దదైన మహబూబ్‌నగర్ జిల్లా ఇప్పుడు మూడు జిల్లాలుగా మారడం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. పాలమూరు జిల్లాలోని అన్ని జాతీయ రహదారులకు ఇరువైపులా విరివిగా మొక్కలు నాటాలని, తెలంగాణలో అడుగుపెట్టే వారికి పాలమూరు జిల్లా ఆకుపచ్చ తోరణాలతో స్వాగతం పలికినట్లుగా ఉండాలన్నారు. వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని మండలాలు యాదాద్రిలో, కొన్ని మండలాలు సిద్దిపేటలో కలుస్తున్నాయని అన్నారు. మిగిలిన మండలాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున వరంగల్ జిల్లాను రెండు జిల్లాలుగా చేయాలని ప్రతిపాదించినట్లు సీఎం చెప్పారు. రెండు జిల్లాల స్వరూపం ఎలా ఉండాలనే అంశంపై ప్రజాభిప్రాయాలు తీసుకుంటున్నామని, వాటికి అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. గోదావరి జిల్లాల సరసన పాలమూరు మహబూబ్‌నగర్ జిల్లాకు స్వర్ణయుగం రాబోతోందని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని, పాలమూరు ప్రాజెక్టు కూడా శరవేగంతో నిర్మిస్తామని సీఎం చెప్పారు. నీటిపారుదల రంగంలో పాలమూరు జిల్లా గోదావరి జిల్లాల సరసన నిలుస్తుందన్నారు. వలసలు పోయిన వారంతా తిరిగి పాలమూరుకు చేరుకునే రోజులు వస్తున్నాయని పేర్కొన్నారు. పాలమూరు జిల్లా అంతటా నీటి సౌకర్యం వస్తుందని, అందుకే రైతులెవరూ తమ భూములు అమ్ముకోవద్దని పిలుపునిచ్చారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి విడుదల జరగడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. కృష్ణా నదితో ఈ జిల్లాకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని, పాలమూరు రైతులకు నీళ్లివ్వడం గొప్ప కార్యంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో దాదాపు అయిదు కిలోమీటర్ల బైపాస్ రోడ్డు నిర్మించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ చేసిన విజ్ఞప్తి మేరకు రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. వరంగల్‌కు మహర్దశ హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హెల్త్, ట్రైబల్ యూనివర్సిటీలతోపాటు అనేక విద్యాసంస్థలను మంజూ రు చేశామని, టెక్స్టైల్ పార్కు నిర్మించబోతున్నామని వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్లో రూ.300కోట్లు కేటాయించామని, హృదయ్, స్మార్ట్ సిటీలో కూడా ఎంపికైనందున వరంగల్‌ను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఖాజీపేట వద్ద ఫాతిమా బ్రిడ్జికి సమాంతరంగా మరో బ్రిడ్జిని నిర్మించి నాలుగు లేన్ల రోడ్డుగా మార్చనున్నట్లు ప్రకటించారు. వెంటనే అంచనాలు రూపొందించాలని నేషనల్ హైవేస్ ఈఎన్సీ గణపతిరెడ్డిని ఆదేశించారు. కొత్త ప్రతిపాదనలు.. మార్పులివీ.. ⇔ {పజాభిప్రాయానికి అనుగుణంగా రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో చేర్చాలని సీఎం ఆదేశించారు. ⇔ {పతిపాదిత మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరును రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని, కొడకండ్ల మండలాన్ని తొర్రూరు రెవెన్యూ డివిజన్లో చేర్చాలని సూచించారు. ⇔ వరంగల్ జిల్లాలో టేకుమట్ల, పెద్దవంగర,కొమురవెల్లి మండలాల ఏర్పాటు కు అవకాశాలు పరిశీలించాలన్నారు. ⇔ దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన మహబూబ్‌నగర్ జిల్లాలోని గట్టు మండలాన్ని రెండు మండలాలుగా విభజించే ప్రతిపాదనలను పరిశీలించాలన్నారు. ⇔ ఖమ్మం జిల్లా గుండాల మండలం విస్తీర్ణంపరంగా పెద్దగా ఉన్నందున రెండుగా విభజించాలన్నారు. -
విభజన పనుల్లో ఉద్యోగులు
జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ హన్మకొండ అర్బన్ : అన్ని శాఖల ఉద్యోగులు జిల్లా పునర్విభజన పనుల్లో ఉన్నారని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో కొత్త జిల్లాల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ ఫైళ్ల విభజన, స్కాన్ పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. నూతన జిల్లా కేంద్రాల్లో భవనాలు గుర్తింపు, కేటాయింపు దాదాపు పూర్తయ్యిందని చెప్పారు. ఉద్యోగుల కేటాయింపు ఇబ్బందులు లేకుండా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొత్త జిల్లాల్లో ఉద్యోగు ల అవసరంపై త్వరలో ప్రతిపాదనలు ఇస్తామన్నారు. ఫైళ్ల విరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని వివరించారు. జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఏజేసీ తిరుపతిరావు, డీఆర్వో శోభ, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మొయినాబాద్ బంద్ విజయవంతం
విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేత బంద్‌తో మండలంలో స్తంభించిన జనజీవనం మొయినాబాద్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా మొయినాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో విలీనం చేయాలనే డిమాండ్‌తో అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన మండలం బంద్ విజయవంతమైంది. ఉదయం 7 గంటల నుంచే గ్రామాల్లో అఖిలపక్షం నాయకులు, యువకులు, విద్యార్థులు రోడ్లుపైకి వచ్చి వాహనాలను నిలిపివేశారు. దుకాణదారులు, వ్యాపారులు స్వచ్ఛందంగా తమ షాపులు మూసివేసి బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మండలంలోని అన్ని ప్రైవేటు విద్యాసంస్థలు, పాఠశాలలకు బంద్‌కు సంబంధించి ముందే సమాచారం ఇవ్వడంతో సెలవును ప్రకటించాయి. ప్రభుత్వ కార్యాలయాలను అఖిలపక్షం నాయకులు సోమవారం మూసివేయించారు. మండల కేంద్రంలో సుమారు ఏడు గంటలపాటు మహాధర్నా చేపట్టారు. కళాకారులచే ధూం.. ధాం కార్యక్రమం నిర్వహించి మండల పరిస్థితిపై పాటలు, కళారూపాలు ప్రదర్శించారు. ఇదిలా ఉండగా.. బంద్ సందర్భంగా సోమవారం మండలంలో జనజీవనం స్తంభించింది. ఉదయం నుంచే ఆందోళనకారులు గ్రామాల నుంచి వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో నగరానికి వెళ్లే ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనులకోసం వెళ్లేవారు ఇబ్బంది బడ్డారు. బంద్ ప్రభావం సోమవారం మండల కేంద్రంలో సాగే సంత(అంగడి)పై పడింది. అదేవిధంగా మండలంలోని వెంకటాపూర్‌లో ప్రభుత్వ పాఠశాలను బంద్ చేయించడానికి వెళ్లిన అఖిలపక్షం నాయకులు విద్యార్థులందరినీ పాఠశాల బయటకు రప్పించి మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. మండల పరిధిలోని రెడ్డిపల్లిలో హిమాయత్‌నగర్ - తంగడ్‌పల్లి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. శ్రీరాంనగర్, వెంకటాపూర్ గ్రామాలకు చెందిన యువకులు బైక్ ర్యాలీతో మొయినాబాద్‌కు చేరుకున్నారు. పెద్దమంగళారానికి చెందిన మహిళలు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాధర్నా తరలి వచ్చారు. ధర్నా వద్దే వంటావార్పు చేసి భోజనాలు చేశారు. -
చీలిపోనున్న ధర్మసాగర్ మండలం
ధర్మసాగర్ : రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం నూతనంగా చేపట్టిన జిల్లాలు, మండలాల పునర్విభజనలో భాగంగా ధర్మసాగర్ మండలం రెండుగా చీలిపోనుంది. మండలంలోని వేలేరు నూతన మండలంగా ఏర్పాటు కానుంది. గతంలో 24 గ్రామాలతో ఉన్న ధర్మసాగర్, మండలంలోని ఉనికిచర్ల, రాంపూర్ గ్రామాలు గతంలోనే గ్రేటర్ వరంగల్‌లో విలీనమయ్యాయి. ప్రస్తుతం 22 గ్రామాలతో ఉన్న ధర్మసాగర్ మండలంలోని కరీంనగర్ జిల్లా సరిహద్దుగా ఉన్న వేలేరు గ్రామ కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటుకానుంది. ధర్మసాగర్ మండలంలోని ఏడు గ్రామాలు, కరీంనగర్ జిల్లాలోని ఎనిమిది గ్రామాలను కలిపి 15 గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటు చేస్తారు. కాగా, గ్రేటర్లో విలీనమైన రాంపూర్ గ్రామాన్ని కొత్తగా ఏర్పాటుచేయనున్న కాజీపేట మండలంలో కలపనున్నట్లు సమాచారం. ధర్మసాగర్ మండలంలోని మిగులనున్న గ్రామాలు ధర్మసాగర్, దేవునూరు, ధర్మపురం, ఎలుకుర్తి, జానకిపురం, క్యాతంపల్లి, మద్దెలగూడెం, మల్లక్‌పల్లి, ముప్పారం, నారాయణగిరి, పెద్దపెండ్యాల, రాయిగూడెం, సాయిపేట, సోమదేవరపల్లి, తాటికాయల. వేలేరు మండలంలోని గ్రామాలు వేలేరు, పీచర, గుండ్లసాగర్, సోడాషపల్లి, మల్లికుదుర్ల, శా లపల్లి, కమ్మరిపేట, కరీంనగర్ జిల్లా నుంచి కలిసే గ్రా మాలు కొత్తకొండ, మల్లారం, కన్నారం, కట్కూర్, ఎర్రబెల్లి, ముస్తఫాపూర్, చాపగానితండా, ధర్మారం గ్రామాలు. రెండు మండలాలుగా స్టేషన్‌ఘన్‌పూర్ స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న మండలాల ఏర్పాటులో జిల్లాలోనే అతిపెద్ద మండలాల్లో ఒకటైన స్టేషన్ ఘన్పూర్ రెండుగా చీలిపోనుంది. మండల పరిధిలో మొత్తం 28 గ్రా మాలు ఉండగా, మల్కాపూర్, చిల్పూరు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నట్లుగా అధికారులు పుణ్యక్షేత్రం ఉన్న చిల్పూరును మండల కేంద్రంగా ఏర్పాటుచేయనున్నారు. స్టేషన్ ఘన్పూర్మండలంలో 18 గ్రామాలు, చిల్పూరు మండలంలో 10 గ్రామాలు ఉండే అవకాశం ఉంది. వీటితో పాటుగా పక్కన ఉన్న మండలాల నుండి ఒకటి రెండు గ్రామాలు కలిసే అవకాశం ఉంది. చిల్పూరు మండలంలోని గ్రామాలు ఇవే.. చిల్పూరు, రాజవరం, పల్లగుట్ట, కృష్ణాజీగూడెం, ఫతేపూర్, మల్కాపూర్, వెంకటాద్రిపేట, లింగంపల్లి, శ్రీపతిపల్లి, కొండాపూర్. స్టేషన్‌ఘన్‌పూర్‌లో మిగులనున్న గ్రామాలు.. స్టేషన్‌ఘన్‌పూర్, చిన్నపెండ్యాల, నష్కల్, వంగాలపల్లి, ఛాగల్, రాఘవాపూర్, శివునిపల్లి, విశ్వనాథపురం, తానేదార్పల్లి, ఇప్పగూడెం, కోమటిగూడెం, పాంనూర్, నమిలి గొండ, సముద్రాల, మీదికొండ, కొత్తపల్లి, తాటికొండ, దేశాయితండా గ్రామాలు ఉండనున్నాయి. 12 గ్రామాలతో ఐనవోలు మండలం వర్ధన్నపేట : జిల్లా పునర్విభజనలో భాగంగా ఐనవోలు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటుచేయనున్నారు. ఈ మేరకు 12 గ్రామాలతో ఐనవోలును మండలం ఏర్పాటు చేయడానికి రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు ప్రతిపానదనలు సిద్ధం చేస్తున్నారు. నూతనంగా ఆవిర్భవిస్తున్న ఐనవోలు మండలంలోని గ్రామాల వివరాలిలా ఉన్నాయి. ఐనవోలు, ఒంటిమామిడిపెల్లి, సింగారం, పున్నేలు, పెరుమాండ్లగూడెం, కక్కిరాల పెల్లి, నందనం, ఉడుతగూడెం, రెడ్డిపాలెం, పంథినితో పాటు జఫర్గడ్ మండలంలోని వెంకటాపూర్, గర్మిళ్లపెల్లి గ్రామాలతో నూతన మండలం ఏర్పాటుకానుంది. వర్ధన్నపేటలో.. విభజన తర్వాత వర్ధన్నపేట, డీసీతండా, ల్యాబర్తి, కొత్తపెల్లి, దమ్మన్నపేట, బండౌతపురం, ఇల్లంద, కట్రా్యల, ఉప్పరపెల్లి, నల్లబెల్లి, రాంధాన్తండా, చెన్నారం గ్రామాలు వర్ధన్నపేట మండలంలో కొనసాగుతాయి. మండలంలోని రామవరం, దివిపెటిపెల్లిని జఫర్‌గఢ్ మండలంలో విలీనం చేసి, జఫర్‌గఢ్‌లోని వెంకటాపూర్ గర్మిళ్లపల్లి గ్రామాలను ఐనవోలులో అంతర్భాగం చేయడానికి అధికారులు ప్రతిపాదనలు చేశారు. -
కడియంకు కీలక బాధ్యతలు
మంత్రివర్గ ఉప సంఘంలో చోటు జిల్లాల పునర్విభజన ప్రకియపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘంలో కడియం శ్రీహరికి చోటు కల్పించింది. రెవెన్యూ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మరో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల ఎంపిక, జోనల్ వ్యవస్థ, శాఖల పునర్వ్యవస్థీకరణ, ఉద్యోగుల కేటాయింపు వంటి అంశాలపై ఈ కమిటీ నివేదికలు ఇవ్వనుంది. -
ఘట్‌కేసర్‌ను జిల్లా కేంద్రంగా గుర్తించాలి
ఘట్కేసర్ టౌన్: జిల్లా పునర్వ్యవస్థకరణలో భాగంగా రంగారెడ్డి జిల్లా తూర్పు ప్రాంతాన్ని కలుపుకొని ఏర్పడనున్న జిల్లాకు ఘట్‌కేసర్‌ను జిల్లా కేంద్రంగా గుర్తించాలని కోరుతూ.. బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్షుడు బిక్కునాయక్, బీజేపీ మండల అధ్యక్షుడు కంభం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ప్రాంతాలను హైదరాబాద్‌లో కలిపితే నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంగా ప్రకటించడానికి అవసరమైన అన్ని వసతులు ఉన్నాయని, జిల్లాలో రెండున్నర లక్షల ఓటర్లతో మండలం ప్రథమ స్థానంలో ఉంన్నారు. జాతీయ రహదారి, ఓఆర్ఆర్, రహేజా, ఇన్ఫోసిస్ తదితర అంతార్జాతీయ వ్యాపార సంస్థలు, భాగ్యనగర నందనవనం, రైల్వే స్టేషన్, ఎంఎంటీఎస్ సౌకర్యం మండలంలో ఉందన్నారు. ఢిల్లీకి వెళ్లే ప్రధాన రైలు మార్గం, జాతీయ రహదారి రెండు రకాల రవాణ సౌకర్యం ఉందన్నారు. జిల్లా ఏర్పాటుకు అన్ని రకాల సదుపాయాలున్నందున జిల్లా కేంద్రం ఏర్పాటుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు ఎదుగని శ్రీరాములు, అచ్చిని రమేష్, మాజీ అధ్యక్షుడు పత్తెపు పాండురాజు, గిరిజన మోర్చ మండల అధ్యక్షుడు తౌర్యనాయక్, మేడబోయిన బాల్‌రాజు, గాజుల కృష్ణయాదవ్, రామ్రతన్శర్మ, చంద్రశేఖర్, రాణి, రజనీ, వాసవి, ఆంజనేయులు, భిక్షపతి, షానూర్ పాల్గొన్నారు. -
ఇదేం విభజన!
♦ కొత్త జిల్లాలపై టీఆర్ఎస్లో భిన్నస్వరాలు ♦ ఏకగ్రీవ తీర్మానాన్ని పట్టించుకోకపోవడంపై కినుక ♦ విడిపోయిన హైదరాబాద్‌లో మళ్లీ చేర్చడమేమిటని రుసరుస ♦ ఉద్యమానికి సిద్ధమవుతున్న విపక్షాలు జిల్లా యూనిట్‌గా విభజన ప్రక్రియ చేపట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేసినా పరిగణనలోకి తీసుకోకపోవడం, ఏకపక్షంగా జిల్లాను విడగొడుతూ అధికారులు ప్రతిపాదించడం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు మింగుడు పడడంలేదు. హైదరాబాద్ జిల్లా పరిధిలోకి తూర్పు ప్రాంతాలను చేర్చడం సహేతుకం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విలీన ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాల పునర్విభజన అధికారపార్టీలో అసంతృప్తిని రాజేసింది. కొత్త జిల్లాల ఏర్పాటులో తమ ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఆపార్టీ నేతల అసంతృప్తికి కారణమైంది. ఇదే విషయాన్ని రాష్ట్రస్థాయి పునర్విభజన కమిటీ సభ్యుడు, ఎంపీ కేశవరావు ముందు కుండబద్దలు కొట్టారు. వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా కొనసాగింపుపై ఎలాంటి భేదాభిప్రాయం లేకున్నా.. మిగతా నియోజకవర్గాలను హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాల్లో కలుపుతూ ముసాయిదా రూపొందించడాన్ని తప్పుబడుతు న్నారు. ఈ పరిణామాలను ముందుగానే పసిగట్టిన అధికారపార్టీ ఎమ్మెల్యే ఒకరు ఈ అంశంపై.. నేడో, రేపో విలేకర్ల సమావేశం పెట్టి మరీ తన అభిప్రాయాన్ని స్పష్టం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. జిల్లాల పునర్విభజనను రాజకీయ కోణంలో చూడకుండా.. సొంత నియోజకవర్గ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. 1978లో హైదరాబాద్ జిల్లా నుంచి విడిపోయి రంగారెడ్డి జిల్లా ఏర్పడిందని, మరోసారి తమను హైదరాబాద్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదన ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన విలేకర్ల సమావేశంలో తేల్చిచెప్పే అవకాశముంది. -
‘కొత్త’ చిత్రం
♦ నేడు కొలిక్కి రానున్న జిల్లాల పునర్విభజన ♦ సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం ♦ ప్రతిపాదిత జిల్లాలపై సమగ్రంగా చ ర్చించే అవకాశం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాల పునర్విభజనపై మంగళవారం స్పష్టత రానుంది. ఏయే ప్రాంతాలతో కలిపి కొత్త జిల్లాలు ఏర్పడతాయనేది ప్రాథమికంగా తేలనుంది. జిల్లాల విభజనపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుంచి రెండు రోజులపాటు జిల్లా కలెక్టర్లతో విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాల పునర్విభజనలో కీలకంగా భావిస్తున్న ఈ భేటీలో ప్రతిపాదిత జిల్లాలు, నైసర్గిక స్వరూపం తదితర అంశాలు కొలిక్కివచ్చే అవకాశముంది. మరోవైపు జిల్లాల విభజనలో అనుసరించాల్సిన విధి విధినాలపై రెండు రోజుల క్రితం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల ముసాయిదాలకు సంబంధించి ప్రధానంగా ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా అవసరమైతే గ్రామాలు మొదలు మండలాల వరకు ఏ ప్రాంతాన్నయినా సరే.. సమీప మండలం లేదా డివిజన్లో కలిపేందుకు జిల్లా యంత్రాంగానికి వెసులుబాటు కల్పించింది. అయితే, ఒక మండలాన్ని మరో డివిజన్లో.. ఒక గ్రామాన్ని మరో మండలంలో విలీనం చేయాలని ప్రతిపాదిస్తే.. దానికి సహేతుక కారణం చూపాలని నిర్దేశించింది. ప్రతిపాదిత ప్రాంత విస్తీర్ణం, జనాభా, ఓటర్లు తదితర అంశాలతోపాటు మ్యాపులు తయారు చేయాలని ఆదేశించింది. అదే సమయంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మేళవింపుతో జిల్లాలకు రూపకల్పన చేయాలని సూచించింది. ఈ మేరకు దీనికి అనుగుణంగా ఫార్మెట్‌ను రూపొందించిన జిల్లా యంత్రాంగం సబ్‌కలెక్టర్/ ఆర్డీఓలకు పంపింది. అయితే, ఈ కసరత్తు కొలిక్కి రాకమునుపే.. రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాల పునర్విభజనకు ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. కాగా, జిల్లా యంత్రాంగం మాత్రం ఇప్పటివరకు తయారుచేసిన ముసాయిదాల ప్రకారం జిల్లాను మూడు ముక్కలు చేయాలని ప్రతిపాదిస్తోంది. వికారాబాద్, రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం పేరిట మూడు జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుత జిల్లా పరిధిని ప్రాతిపదికగా తీసుకోవడం ద్వారా ఈ జిల్లాలను ప్రతిపాదించింది. ఒకవేళ ప్రభుత్వం గనుక సమీప జిల్లాల్లోని ప్రాంతాలను కూడా పరిగణనలోకి తీసుకొని జిల్లాల పునర్విభజన చేపట్టాలంటే మాత్రం జిల్లా యంత్రాంగం ప్రతిపాదనల్లో మార్పులు చేర్పులు జరగవచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్, గోల్కొండ, వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను ప్రకటించే అంశం తాజాగా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంట్లో గ్రామీణ ప్రాంతాలతో సహా మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా వికారాబాద్ పరిధిలోకి తేవడం, శివార్లను గోల్కొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో కలిపే దిశగా ఆలోచన సాగిస్తున్నట్లు సమాచారం. మండలాలు కొలిక్కివచ్చిన తర్వాతే.. కాగా, జిల్లాల విభజనలో కీలకంగా భావిస్తున్న మండలాల పునర్విభజన పూర్తయిన తర్వాతే కొత్త జిల్లాలపై స్పష్టత వస్తుంది. ఒక జిల్లాకు సగటున 20 మండలాలు ఉండేలా చూడాలని ప్రభుత్వం నిర్దేశించడం, 4 లేదా 5 నియోజకవర్గాల వచ్చేలా ప్రతిపాదించాలని స్పష్టం చేయడంతో జిల్లా యంత్రాంగం గత ప్రతిపాదనలు పూర్తిగా మారిపోయే అవకాశముంది. జిల్లాలో దాదాపు 55 లక్షల జనాభా ఉన్నందున ఆ మేరకు 50 నుంచి 55 మండలాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. దీనికి అనుగుణంగా జిల్లాల విభజన జరుగనుంది. నేడు, రేపు జరిగే సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు కొత్త జిల్లాల ముఖచిత్రాలు రూపుదిద్దుకున్నాయి. వీటిపై ప్రజల అభ్యంతరాలను కోరుతూ వారం రోజుల్లోపు నోటిఫికేషన్ జారీ చేయనుంది.