మొయినాబాద్ బంద్ విజయవంతం
విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేత
బంద్‌తో మండలంలో స్తంభించిన జనజీవనం
మొయినాబాద్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా మొయినాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో విలీనం చేయాలనే డిమాండ్‌తో అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన మండలం బంద్ విజయవంతమైంది. ఉదయం 7 గంటల నుంచే గ్రామాల్లో అఖిలపక్షం నాయకులు, యువకులు, విద్యార్థులు రోడ్లుపైకి వచ్చి వాహనాలను నిలిపివేశారు. దుకాణదారులు, వ్యాపారులు స్వచ్ఛందంగా తమ షాపులు మూసివేసి బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మండలంలోని అన్ని ప్రైవేటు విద్యాసంస్థలు, పాఠశాలలకు బంద్‌కు సంబంధించి ముందే సమాచారం ఇవ్వడంతో సెలవును ప్రకటించాయి. ప్రభుత్వ కార్యాలయాలను అఖిలపక్షం నాయకులు సోమవారం మూసివేయించారు. మండల కేంద్రంలో సుమారు ఏడు గంటలపాటు మహాధర్నా చేపట్టారు. కళాకారులచే ధూం.. ధాం కార్యక్రమం నిర్వహించి మండల పరిస్థితిపై పాటలు, కళారూపాలు ప్రదర్శించారు.
ఇదిలా ఉండగా.. బంద్ సందర్భంగా సోమవారం మండలంలో జనజీవనం స్తంభించింది. ఉదయం నుంచే ఆందోళనకారులు గ్రామాల నుంచి వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో నగరానికి వెళ్లే ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనులకోసం వెళ్లేవారు ఇబ్బంది బడ్డారు. బంద్ ప్రభావం సోమవారం మండల కేంద్రంలో సాగే సంత(అంగడి)పై పడింది. అదేవిధంగా మండలంలోని వెంకటాపూర్‌లో ప్రభుత్వ పాఠశాలను బంద్ చేయించడానికి వెళ్లిన అఖిలపక్షం నాయకులు విద్యార్థులందరినీ పాఠశాల బయటకు రప్పించి మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. మండల పరిధిలోని రెడ్డిపల్లిలో హిమాయత్‌నగర్ - తంగడ్‌పల్లి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. శ్రీరాంనగర్, వెంకటాపూర్ గ్రామాలకు చెందిన యువకులు బైక్ ర్యాలీతో మొయినాబాద్‌కు చేరుకున్నారు. పెద్దమంగళారానికి చెందిన మహిళలు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాధర్నా తరలి వచ్చారు. ధర్నా వద్దే వంటావార్పు చేసి భోజనాలు చేశారు.