‘కొత్త’ చిత్రం
♦ నేడు కొలిక్కి రానున్న జిల్లాల పునర్విభజన
♦ సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం
♦ ప్రతిపాదిత జిల్లాలపై సమగ్రంగా చ ర్చించే అవకాశం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాల పునర్విభజనపై మంగళవారం స్పష్టత రానుంది. ఏయే ప్రాంతాలతో కలిపి కొత్త జిల్లాలు ఏర్పడతాయనేది ప్రాథమికంగా తేలనుంది. జిల్లాల విభజనపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుంచి రెండు రోజులపాటు జిల్లా కలెక్టర్లతో విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాల పునర్విభజనలో కీలకంగా భావిస్తున్న ఈ భేటీలో ప్రతిపాదిత జిల్లాలు, నైసర్గిక స్వరూపం తదితర అంశాలు కొలిక్కివచ్చే అవకాశముంది. మరోవైపు జిల్లాల విభజనలో అనుసరించాల్సిన విధి విధినాలపై రెండు రోజుల క్రితం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల ముసాయిదాలకు సంబంధించి ప్రధానంగా ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.
పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా అవసరమైతే గ్రామాలు మొదలు మండలాల వరకు ఏ ప్రాంతాన్నయినా సరే.. సమీప మండలం లేదా డివిజన్‌లో కలిపేందుకు జిల్లా యంత్రాంగానికి వెసులుబాటు కల్పించింది. అయితే, ఒక మండలాన్ని మరో డివిజన్‌లో.. ఒక గ్రామాన్ని మరో మండలంలో విలీనం చేయాలని ప్రతిపాదిస్తే.. దానికి సహేతుక కారణం చూపాలని నిర్దేశించింది. ప్రతిపాదిత ప్రాంత విస్తీర్ణం, జనాభా, ఓటర్లు తదితర అంశాలతోపాటు మ్యాపులు తయారు చేయాలని ఆదేశించింది. అదే సమయంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మేళవింపుతో జిల్లాలకు రూపకల్పన చేయాలని సూచించింది. ఈ మేరకు దీనికి అనుగుణంగా ఫార్మెట్‌ను రూపొందించిన జిల్లా యంత్రాంగం సబ్‌కలెక్టర్/ ఆర్డీఓలకు పంపింది.
అయితే, ఈ కసరత్తు కొలిక్కి రాకమునుపే.. రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాల పునర్విభజనకు ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. కాగా, జిల్లా యంత్రాంగం మాత్రం ఇప్పటివరకు తయారుచేసిన ముసాయిదాల ప్రకారం జిల్లాను మూడు ముక్కలు చేయాలని ప్రతిపాదిస్తోంది. వికారాబాద్, రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం పేరిట మూడు జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుత జిల్లా పరిధిని ప్రాతిపదికగా తీసుకోవడం ద్వారా ఈ జిల్లాలను ప్రతిపాదించింది.
ఒకవేళ ప్రభుత్వం గనుక సమీప జిల్లాల్లోని ప్రాంతాలను కూడా పరిగణనలోకి తీసుకొని జిల్లాల పునర్విభజన చేపట్టాలంటే మాత్రం జిల్లా యంత్రాంగం ప్రతిపాదనల్లో మార్పులు చేర్పులు జరగవచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్, గోల్కొండ, వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను ప్రకటించే అంశం తాజాగా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంట్లో గ్రామీణ ప్రాంతాలతో సహా మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా వికారాబాద్ పరిధిలోకి తేవడం, శివార్లను గోల్కొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో కలిపే దిశగా ఆలోచన సాగిస్తున్నట్లు సమాచారం.
మండలాలు కొలిక్కివచ్చిన తర్వాతే..
కాగా, జిల్లాల విభజనలో కీలకంగా భావిస్తున్న మండలాల పునర్విభజన పూర్తయిన తర్వాతే కొత్త జిల్లాలపై స్పష్టత వస్తుంది. ఒక జిల్లాకు సగటున 20 మండలాలు ఉండేలా చూడాలని ప్రభుత్వం నిర్దేశించడం, 4 లేదా 5 నియోజకవర్గాల వచ్చేలా ప్రతిపాదించాలని స్పష్టం చేయడంతో జిల్లా యంత్రాంగం గత ప్రతిపాదనలు పూర్తిగా మారిపోయే అవకాశముంది. జిల్లాలో దాదాపు 55 లక్షల జనాభా ఉన్నందున ఆ మేరకు 50 నుంచి 55 మండలాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. దీనికి అనుగుణంగా జిల్లాల విభజన జరుగనుంది. నేడు, రేపు జరిగే సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు కొత్త జిల్లాల ముఖచిత్రాలు రూపుదిద్దుకున్నాయి. వీటిపై ప్రజల అభ్యంతరాలను కోరుతూ వారం రోజుల్లోపు నోటిఫికేషన్ జారీ చేయనుంది.