Basic
-
సోలార్ మాడ్యూళ్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ
న్యూఢిల్లీ: సోలార్ మాడ్యూళ్లపై చెప్పినట్టుగానే ఏప్రిల్ 1 నుంచి బేసిక్ కస్టమ్స్ డ్యూటీని అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. దీంతో దిగుమతుల రూపంలో ఎదురవుతున్న గట్టి పోటీని తట్టుకుని దేశీ పరిశ్రమ నిలదొక్కుకోగలదని పరిశ్రమ సంఘం ఎన్ఐఎంఎంఏ పేర్కొంది. ఎన్ఐఎంఎంఏ, ఇండియా సోలార్ తయారీదారుల సంఘం, అఖిలభారత సోలార్ కంపెనీ సంఘం ప్రతినిధులు గురువారం ఢిల్లీలో మంత్రి సీతారామన్‌ను కలిసి తమ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చైనా, ఇతర దేశాల నుంచి వచ్చే సోలార్ ప్యానెళ్లు, సోలార్ సెల్స్‌పై ఎటువంటి సుంకాల్లేకపోవడంతో దేశీయ యూనిట్లు మూతపడే ప్రమాదంలో ఉన్నట్టు తెలిపారు. దీంతో బేసిక్ కస్టమ్స్ డ్యూటీని అమల్లోకి తీసుకొస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. అదే సమయంలో మాడ్యూల్, సెల్ లైన్ ప్లాంట్, మెషినరీ దిగుమతులను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించాలని సంఘాలు కోరాయి. సమావేశం ఆశావహంగా నడిచిందని, పరిశ్రమ తన పూర్తి సామర్థ్యాల మేరకు ఎదగడానికి విధానపరమైన మద్దతు అవసరమని మంత్రి గుర్తించినట్టు పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు. -
గ్రామీణ డాక్ సేవక్‌ల వేతనం పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: తపాలా శాఖ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గ్రామీణ డాక్ సేవక్‌ల వేతనాలను పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ విషయాన్ని కేంద్ర టెలికాం శాఖామంత్రి మనోజ్ సిన్హా మీడియాకు తెలిపారు. గ్రామీణ డాక్ సేవక్‌ల బేసిక్ సాలరీ గరిష్టంగా 14,500 రూపాయలుగా నిర్ణయించినట్టు చెప్పారు. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 2.6లక్షలమంది గ్రామీణ డాక్ సేవక్‌లు లబ్ది పొందనున్నారు. గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్)లకు సంబంధించి ఇప్పటివరకూ 2,295 రూపాయల వేతనం పొందుతున్న వారు ఇకపై నెలకు 10వేల రూపాయల చొప్పున, రూ. 2,775 పొందుతున్నవారు ఇకపై 12,500 రూపాయలు, రూ.4,115 పొందుతున్న జీడీఎస్‌లకు ఇకపై నెలకు 14,500 రూపాయల బేసిక్ పే చెల్లించనున్నామని మనోజ్ సిన్హా తెలిపారు. దీనికి అదనంగా రిస్క్ అండ్ హార్డ్‌షిప్ అలవెన్సులను తొలిసారి అందించనున్నట్టు చెప్పారు. ఈ సవరించిన వేతనాలు జనవరి1, 2016 నుంచి వర్తిస్తాయని, వీటిని బకాయిలతో సహా చెల్లిస్తామన్నారు. అలాగే మూడు షిప్ట్‌ల్లో కాకుండా ఇకపై వీరు రెండు షిప్ట్‌ల్లో మాత్రమే పనిచేయనున్నారని కేంద్రమంత్రి వెల్లడించారు. అంతేకాదు జీడీఎస్‌లపై ఆధారపడిన వారికుద్దేశించిన పరిహార నియామకాలను కూడా కేబినెట్ ఆమోదించిందన్నారు. ఇప్పటివరకూ ఈ సదుపాయం ఈ ఉద్యోగులకు అందుబాటులో లేదని పేర్కొన్నారు. -
ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు గట్టి షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: విదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు షాకిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇప్పటికే బేసిక్ ఎక్సైజ్ సుంకంతో విదేశీ మొబైల్స్‌కు చెక్ చెప్పిన ప్రభుత్వం మరోసారి కొరడా ఝుళిపించింది. వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, మొబైల్స్‌పై బేసిక్ ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇకనుంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్న మొబైల్ ఫోన్ల ధరలు మోత మోగనున్నాయి. మేక్ ఇన్ ఇండియాకు మరింత ప్రోత్సాహమిచ్చే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్లపై గతంలో విధించిన 10శాతం బేసిక్ ఎక్సైజ్ సుంకాన్ని తాజాగా 15శాతానికి పెంచింది. దీనికి సంబంధించి గురువారం రాత్రి రెవెన్యూ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే కలర్ టీవీలు, మైక్రోవేవ్ అవెన్లపై బేసిక్ కస్టమ్ సుంకాన్ని 20శాతంగా నిర్ణయించింది. ఎలక్ట్రిక్ ఫిల్మెంట్, వాటర్ హీటర్లు, హెయిర్ డ్రెస్సింగ్ సాధనాలు, డిశ్చార్చ్ లాంప్స్ లాంటి కొన్ని ఇతర అంశాలపై కూడా కస్టమ్స్ సుంకాన్ని సవరించింది. దేశీయ పరిశ్రమలకు ప్రోత్సహహంతోపాటు, ఇప్పటికే తయారీలో ఉన్న కంపెనీలకు గట్టి పోటీ ఉండేలా ఈ చర్య చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కాగా గత జూలైలో మొదటిసారి బేసిక్ కస్టమ్ సుంకాన్ని విధించిన ప్రభుత్వం దేశీయ మొబైల్ కంపెనీలకు ఊతమిచ్చేలా విదేశీ మొబైల్స్‌పై దీన్ని10శాతంగా పేర్కొన్న సంగతి విదితమే. -
పదవ పీఆర్సీ ప్రకారం వేతనాలివ్వాలి
నాగర్‌కర్నూల్ : రెండో ఏఎన్ఎంలకు పదవ పీఆర్సీ ప్రకారం వేతనాలివ్వాలని పీఐటీయూ డివిజన్ అధ్యక్షుడు రామయ్య, రెండో ఏఎన్ఎంల జిల్లా అధ్యక్షురాలు సుగుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని కోరుతూ చేస్తున్న నిరవదిక దీక్షలో భాగంగా బుధవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ఆర్హెచ్ఎం ప్రకారం విధులు చేయించడం లేదని, జిల్లా స్థాయి సమావేశాలకు వెళ్లినా టీఏ, డీఏలు ఇవ్వడం లేదన్నారు. వెంటనే కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు కృష్ణలీల, లక్ష్మినర్సమ్మ, జలజా, కళావతి, హైమావతి, శీరదేవి, అరుణ, రేణుక తదితరులు పాలొన్నారు. -
‘కొత్త’ చిత్రం
♦ నేడు కొలిక్కి రానున్న జిల్లాల పునర్విభజన ♦ సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం ♦ ప్రతిపాదిత జిల్లాలపై సమగ్రంగా చ ర్చించే అవకాశం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాల పునర్విభజనపై మంగళవారం స్పష్టత రానుంది. ఏయే ప్రాంతాలతో కలిపి కొత్త జిల్లాలు ఏర్పడతాయనేది ప్రాథమికంగా తేలనుంది. జిల్లాల విభజనపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుంచి రెండు రోజులపాటు జిల్లా కలెక్టర్లతో విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాల పునర్విభజనలో కీలకంగా భావిస్తున్న ఈ భేటీలో ప్రతిపాదిత జిల్లాలు, నైసర్గిక స్వరూపం తదితర అంశాలు కొలిక్కివచ్చే అవకాశముంది. మరోవైపు జిల్లాల విభజనలో అనుసరించాల్సిన విధి విధినాలపై రెండు రోజుల క్రితం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల ముసాయిదాలకు సంబంధించి ప్రధానంగా ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా అవసరమైతే గ్రామాలు మొదలు మండలాల వరకు ఏ ప్రాంతాన్నయినా సరే.. సమీప మండలం లేదా డివిజన్లో కలిపేందుకు జిల్లా యంత్రాంగానికి వెసులుబాటు కల్పించింది. అయితే, ఒక మండలాన్ని మరో డివిజన్లో.. ఒక గ్రామాన్ని మరో మండలంలో విలీనం చేయాలని ప్రతిపాదిస్తే.. దానికి సహేతుక కారణం చూపాలని నిర్దేశించింది. ప్రతిపాదిత ప్రాంత విస్తీర్ణం, జనాభా, ఓటర్లు తదితర అంశాలతోపాటు మ్యాపులు తయారు చేయాలని ఆదేశించింది. అదే సమయంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మేళవింపుతో జిల్లాలకు రూపకల్పన చేయాలని సూచించింది. ఈ మేరకు దీనికి అనుగుణంగా ఫార్మెట్‌ను రూపొందించిన జిల్లా యంత్రాంగం సబ్‌కలెక్టర్/ ఆర్డీఓలకు పంపింది. అయితే, ఈ కసరత్తు కొలిక్కి రాకమునుపే.. రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాల పునర్విభజనకు ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. కాగా, జిల్లా యంత్రాంగం మాత్రం ఇప్పటివరకు తయారుచేసిన ముసాయిదాల ప్రకారం జిల్లాను మూడు ముక్కలు చేయాలని ప్రతిపాదిస్తోంది. వికారాబాద్, రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం పేరిట మూడు జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుత జిల్లా పరిధిని ప్రాతిపదికగా తీసుకోవడం ద్వారా ఈ జిల్లాలను ప్రతిపాదించింది. ఒకవేళ ప్రభుత్వం గనుక సమీప జిల్లాల్లోని ప్రాంతాలను కూడా పరిగణనలోకి తీసుకొని జిల్లాల పునర్విభజన చేపట్టాలంటే మాత్రం జిల్లా యంత్రాంగం ప్రతిపాదనల్లో మార్పులు చేర్పులు జరగవచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్, గోల్కొండ, వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను ప్రకటించే అంశం తాజాగా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంట్లో గ్రామీణ ప్రాంతాలతో సహా మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా వికారాబాద్ పరిధిలోకి తేవడం, శివార్లను గోల్కొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో కలిపే దిశగా ఆలోచన సాగిస్తున్నట్లు సమాచారం. మండలాలు కొలిక్కివచ్చిన తర్వాతే.. కాగా, జిల్లాల విభజనలో కీలకంగా భావిస్తున్న మండలాల పునర్విభజన పూర్తయిన తర్వాతే కొత్త జిల్లాలపై స్పష్టత వస్తుంది. ఒక జిల్లాకు సగటున 20 మండలాలు ఉండేలా చూడాలని ప్రభుత్వం నిర్దేశించడం, 4 లేదా 5 నియోజకవర్గాల వచ్చేలా ప్రతిపాదించాలని స్పష్టం చేయడంతో జిల్లా యంత్రాంగం గత ప్రతిపాదనలు పూర్తిగా మారిపోయే అవకాశముంది. జిల్లాలో దాదాపు 55 లక్షల జనాభా ఉన్నందున ఆ మేరకు 50 నుంచి 55 మండలాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. దీనికి అనుగుణంగా జిల్లాల విభజన జరుగనుంది. నేడు, రేపు జరిగే సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు కొత్త జిల్లాల ముఖచిత్రాలు రూపుదిద్దుకున్నాయి. వీటిపై ప్రజల అభ్యంతరాలను కోరుతూ వారం రోజుల్లోపు నోటిఫికేషన్ జారీ చేయనుంది. -
ఇక బేసిక్‌పైనే గ్రాట్యుటీ!
-
బేసిక్‌పైనే గ్రాట్యుటీ!
- కొత్త తిరకాసు పెట్టిన ప్రభుత్వం - 1999 నాటి జీవో ప్రకారం లెక్కించనున్నట్లుగా ఉత్తర్వులు - మార్చి తర్వాత రిటైరైనవారికి నగదు రూపంలో చెల్లింపు.. బకాయిలపై దాటవేత - గ్రాట్యుటీ రూ.12 లక్షలకు, మెడికల్ అలవెన్స్ రూ. 350కు, డెత్ రిలీఫ్ రూ. 20 వేలకు పెంపు - మూడు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్: రిటైరైన ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ లెక్కింపులో రాష్ట్ర ప్రభుత్వం కొత్త తిరకాసు పెట్టింది. ప్రస్తుతం చివరి నెల మూలవేతనం, డీఏ కలిపిన మొత్తంపై 16.5 రెట్లు లేదా ప్రభుత్వం నిర్దేశించిన రూ.8 లక్షలు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే దానిని గ్రాట్యుటీగా చెల్లిస్తున్నారు. 2010 ఏప్రిల్ 6న జారీ చేసిన జీవో నం.101, 2011 ఏప్రిల్ 1న జారీ చేసిన జీవోలను అందుకు ప్రాతిపదికగా భావిస్తున్నారు. అయితే ఆ రెండు జీవోల ఊసెత్తకుండా 1999 జనవరి 30న జారీ చేసిన జీవో నం.14లోని మూడో పేరా ప్రకారం గ్రాట్యుటీని లెక్కించనున్నట్లుగా తాజాగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లెక్కన కేవలం మూల వేతనంపై మాత్రమే గ్రాట్యుటీ వర్తిస్తుందని, డీఏను కలపకుండా ఆర్థిక శాఖ ఈ మెలిక పెట్టిందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీతో పాటు పెన్షనర్ల మెడికల్ అలవెన్స్, డెత్ రిలీఫ్ అలవెన్స్‌లకు సంబంధించిన మూడు జీవోలను ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ మంగళవారం జారీ చేశారు. పదో పీఆర్సీ సిఫారసుల ప్రకారం గ్రాట్యుటీ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. గత ఏడాది జూన్ 2 తర్వాత రిటైరైన ఉద్యోగులందరికీ ఈ ప్రయోజనం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి 28 మధ్య రిటైరైన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడిగా తదుపరి జారీచేస్తామని.. మార్చి నెల తర్వాత రిటైరైన ఉద్యోగులకు నగదు రూపంలో అందిస్తామని పేర్కొన్నారు. ఇక పెన్షనర్లకు నెలనెలా వైద్య ఖర్చులకు ఇచ్చే మెడికల్ అలవెన్స్‌ను రూ.200 నుంచి రూ.350కి పెంచుతూ మరో ఉత్తర్వు జారీ చేశారు. కేటగిరీ వన్, కేటగిరీ టూ పెన్షనర్లకు ఫ్యామిలీ పెన్షన్ సీలింగ్‌ను రూ.6,500కు పెంచారు. పెన్షనర్ల వయసు పెరిగే కొద్దీ అదనంగా ఇచ్చే పెన్షన్(అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్) గతంలో ఉన్నట్లుగానే వర్తిస్తుందని స్పష్టం చేశారు. పెన్షనర్లు మరణించిన సందర్భంలో ఇచ్చే డెత్ రిలీఫ్ అలవెన్స్‌ను రూ.10 వేల నుంచి రూ.20వేలకు పెంచుతూ ప్రత్యేకంగా జీవో జారీ చేశారు. -
పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్యాయత్నం
వాల్మీకిపురం: వాల్మీకిపురం మండలంలో శుక్రవారం ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండలంలోని సాకిరేవుపల్లె పంచాయతీ వడ్డిపల్లెకు చెందిన డి.శేఖర్ (35) కొన్ని సంవత్సరాలుగా కలికిరి ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటూ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా భార్య భర్త మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. జీవితంపై విరక్తి చెందిన శేఖర్ శుక్రవారం ఉదయం తన పిల్లలు లక్ష్మి (10), ప్రదీప్ (8), ప్రణీత (7)లను వడ్డిపల్లెలోని తన వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లాడు. విషం కలిపిన సీతలపానీయం వారికి తాపి, తానూ తాగేశాడు. స్థానికులు గమనించి హుటాహుటిన వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారి పరిస్థితి కుదుటపడినట్లు వైద్యులు తెలిపారు.