- కొత్త తిరకాసు పెట్టిన ప్రభుత్వం
- 1999 నాటి జీవో ప్రకారం లెక్కించనున్నట్లుగా ఉత్తర్వులు
- మార్చి తర్వాత రిటైరైనవారికి నగదు రూపంలో చెల్లింపు.. బకాయిలపై దాటవేత
- గ్రాట్యుటీ రూ.12 లక్షలకు, మెడికల్ అలవెన్స్ రూ. 350కు, డెత్ రిలీఫ్ రూ. 20 వేలకు పెంపు
- మూడు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ
సాక్షి, హైదరాబాద్: రిటైరైన ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ లెక్కింపులో రాష్ట్ర ప్రభుత్వం కొత్త తిరకాసు పెట్టింది. ప్రస్తుతం చివరి నెల మూలవేతనం, డీఏ కలిపిన మొత్తంపై 16.5 రెట్లు లేదా ప్రభుత్వం నిర్దేశించిన రూ.8 లక్షలు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే దానిని గ్రాట్యుటీగా చెల్లిస్తున్నారు. 2010 ఏప్రిల్ 6న జారీ చేసిన జీవో నం.101, 2011 ఏప్రిల్ 1న జారీ చేసిన జీవోలను అందుకు ప్రాతిపదికగా భావిస్తున్నారు.
అయితే ఆ రెండు జీవోల ఊసెత్తకుండా 1999 జనవరి 30న జారీ చేసిన జీవో నం.14లోని మూడో పేరా ప్రకారం గ్రాట్యుటీని లెక్కించనున్నట్లుగా తాజాగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లెక్కన కేవలం మూల వేతనంపై మాత్రమే గ్రాట్యుటీ వర్తిస్తుందని, డీఏను కలపకుండా ఆర్థిక శాఖ ఈ మెలిక పెట్టిందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీతో పాటు పెన్షనర్ల మెడికల్ అలవెన్స్, డెత్ రిలీఫ్ అలవెన్స్‌లకు సంబంధించిన మూడు జీవోలను ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ మంగళవారం జారీ చేశారు.
పదో పీఆర్సీ సిఫారసుల ప్రకారం గ్రాట్యుటీ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. గత ఏడాది జూన్ 2 తర్వాత రిటైరైన ఉద్యోగులందరికీ ఈ ప్రయోజనం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి 28 మధ్య రిటైరైన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడిగా తదుపరి జారీచేస్తామని.. మార్చి నెల తర్వాత రిటైరైన ఉద్యోగులకు నగదు రూపంలో అందిస్తామని పేర్కొన్నారు.
ఇక పెన్షనర్లకు నెలనెలా వైద్య ఖర్చులకు ఇచ్చే మెడికల్ అలవెన్స్‌ను రూ.200 నుంచి రూ.350కి పెంచుతూ మరో ఉత్తర్వు జారీ చేశారు. కేటగిరీ వన్, కేటగిరీ టూ పెన్షనర్లకు ఫ్యామిలీ పెన్షన్ సీలింగ్‌ను రూ.6,500కు పెంచారు. పెన్షనర్ల వయసు పెరిగే కొద్దీ అదనంగా ఇచ్చే పెన్షన్(అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్) గతంలో ఉన్నట్లుగానే వర్తిస్తుందని స్పష్టం చేశారు. పెన్షనర్లు మరణించిన సందర్భంలో ఇచ్చే డెత్ రిలీఫ్ అలవెన్స్‌ను రూ.10 వేల నుంచి రూ.20వేలకు పెంచుతూ ప్రత్యేకంగా జీవో జారీ చేశారు.
బేసిక్‌పైనే గ్రాట్యుటీ!
Published Wed, Jul 22 2015 4:34 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM
Advertisement