డబ్బుల్ ధమాకా!
* ప్రభుత్వోద్యోగులకు రెట్టింపు వేతనాలు
* పదో పీఆర్సీ అమలుపై తెలంగాణ, ఏపీ కసరత్తు
* అన్ని స్థాయిల్లో జీతాల పెంపునకు పీఆర్సీ సిఫారసు
* సీనియర్ అసిస్టెంట్, జూనియర్ లెక్చరర్లకు అదనపు పెంపు
* అలవెన్సుల్లో 50 శాతం నుంచి 75 శాతం పెరుగుదల
* 70 ఏళ్ల నుంచే అదనపు పెన్షన్.. రెండేళ్లకు పెరగనున్న
* చైల్డ్ కేర్ లీవ్, గ్రాట్యుటీ పరిమితి రూ. 12 లక్షలు
* 15 వేల మంది ఎంటీఎస్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సూచన
* వేతన సంఘం నివేదికలోని వివరాలు ‘సాక్షి’కి ప్రత్యేకం
చింతకింది గణేష్: ఇరు రాష్ట్రాల్లోని ప్రభుత్వోద్యోగుల వేతనాలను భారీగా పెంచాలని వేతన సవరణ సంఘం(పీఆర్సీ) సిఫారసు చేసింది. పదో పీఆర్సీ నివేదిక ప్రకారం ఉద్యోగుల కనీస వేతనం దాదాపు రెట్టింపు కానుంది. అన్ని స్థాయిల్లోనూ ఇదే పెంపు కొనసాగనుంది. ఈ సిఫారసులను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు యథాతథంగా అమలు చేస్తే లక్షలాది మంది ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవు (చైల్డ్ కేర్ లీవ్)లను ఆరు నెలల నుంచి రెండేళ్లకు పెంచాలని, 15 వేల మంది మినిమమ్ టైం స్కేల్(ఎంటీఎస్) ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలని, ఇందుకోసం చట్ట సవరణ చేయాలని పీఆర్సీ సూచించింది.
గ్రాట్యుటీని రూ. 12 లక్షలకు పెంచడం, 70 ఏళ్లకే అదనపు పెన్షన్ పొందే సౌకర్యం, ఐదు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం వంటి సిఫారసులు చేసింది. ఈ మేరకు నివేదికను పీఆర్సీ కమిషనర్ అగర్వాల్ రాష్ట్ర విభజనకు కొద్ది రోజుల ముందే గవర్నర్ నరసింహన్‌కు అందజేశారు. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఆ నివేదిక ఇరు రాష్ట్రాలకు చేరింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే దాన్ని ఆర్థిక శాఖ పరిశీలనకు పంపించారు. అలాగే ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఇటీవల ఉన్నతస్థాయి కమిటీని కూడా వేశారు.
ఇక పీఆర్సీ సిఫారసులపై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు మంత్రుల కమిటీ వేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ప్రాథమిక లెక్కల ప్రకారం తెలంగాణలో 4,97,882 పోస్టులు ఉండగా.. 3,99,866 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 6,80,516 పోస్టులు ఉండగా.. 5,41,769 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 6,80,516 పోస్టులు ఉండగా.. 5,41,769 మంది పని చేస్తున్నారు. వీరితోపాటు మరో ఐదు లక్ష ల మందికిపైగా పెన్షనర్లకు ఈ పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉంటుంది. పీఆర్సీ నివేదికలోని వివరాలను ‘సాక్షి’ ప్రత్యేకంగా సేకరించింది.
కనీస వేతనం రూ. 13 వేలు
పీఆర్సీ సిఫారసుల ప్రకారం ఉద్యోగుల కనీస వేతనం రూ. 13 వేలుగా ఉండబోతోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రస్తుతం రూ. 6,700గా ఉన్న కనీస వేతనాన్ని రూ. 13 వేలు చేయాలని వేతన సవరణ సంఘం తన నివేదికలో పేర్కొంది. ఇక గరిష్ట వేతనం రూ. 1,08,500గా నిర్ణయించింది. తొమ్మిదో పీఆర్సీలో సవరించిన ఇంటి అద్దె భత్యాన్ని, ఎల్టీసీని అలాగే కొనసాగించాలని, సిటీ కాంపెన్సేటరీ అలవెన్సును(సీసీఏ) రెట్టింపు చేయాలని, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీంను కూడా యథాతథంగానే ఉంచాలని, ఇతర అలవెన్సులను 50 శాతం నుంచి 75 శాతం వరకు పెంచాలని సిఫారసు చేసింది.
ఇక పదవీ విమరణ చేసిన ఉద్యోగులకు ఇప్పటివరకు 75 ఏళ్ల వయస్సు వచ్చాకే 25 శాతం వరకు అదనపు పెన్షన్ అందుతోంది. ఈ వయసును 70 ఏళ్లకు కుదించాలని పదో పీఆర్సీ సూచించింది. ఉద్యోగుల గ్రాట్యుటీ పెంపును కూడా ప్రతిపాదించింది. గత పీఆర్సీలో రూ. 8 లక్షలుగా ఉన్న గ్రాట్యుటీని రూ. 12 లక్షలకు పెంచాలని పేర్కొంది.
రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్..
చైల్డ్ కేర్ లీవ్‌ను రెండేళ్లకు పెంచాలని పేర్కొంది. మహిళా ఉద్యోగులు 730 రోజుల శిశు సంరక్షణ సెలవులు పొందడానికి అర్హులుగా తెలిపింది. 18ఏళ్లలోపు బాలబాలికలు ఉన్న వారు ఈ సెలవులు తీసుకోవచ్చు. గత పీఆర్సీ ప్రకారం ఈ సెలవుల పరిమితి 180 రోజులు మాత్రమే. అది ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తిస్తుందనే నిబంధన ఉంది. వేతనాల పెరుగుదలలో భాగంగా ఉద్యోగికి నిర్దేశించిన గరిష్ట వేతనం దాటితే అదనంగా మూడు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మాత్రమే పొందవచ్చని గత పీఆర్సీలో ఉంది. ప్రస్తుతం దాన్ని ఐదు ఇంక్రిమెంట్లకు పెంచుతూ సిఫారసు చేసింది.
వేతన వ్యత్యాసాలు లేకుండా జాగ్రత్తలు
ఒకే స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాల్లో వ్యత్యాసాలను తగ్గించేందుకు పదో పీఆర్సీ జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యంగా మండల స్థాయిలో పనిచేసే ఎంపీడీవో, వ్యవసాయ అధికారులు, మండల విద్యా అధికారులతోపాటు సీనియర్ అసిస్టెంట్లకు అదనంగా వేతనాల పెంపు ను సిఫారసు చేసింది. జూనియర్ లెక్చర ర్లకు కూడా అదనంగా వేతనాన్ని పెంచాలని పేర్కొం ది. ప్రస్తుతం రూ. 18,030-43,630 ఉన్న స్కేలును అదనపు పెంపుతో రూ. 37,100-91,450గా చేయాలని సిఫారసు చేసింది.
ఫిట్మెంట్ బెనిఫిట్ ఎంత?
పీఆర్సీ అమలు కోసం ఇరు రాష్ట్రాల్లోని ఉద్యోగులు కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా పీఆర్సీ సిఫారసులనే ప్రభుత్వం ఆమోదిస్తుంది. అయితే ప్రధానమైన ఫిట్మెంట్ బెనిఫిట్‌ను మా త్రం సమాలోచనలు జరిపి ఖరారు చేస్తుం ది. 29 శాతం ఫిట్‌మెంట్‌ను పదో పీఆర్సీ సిఫారసు చేయగా, ఉద్యోగ సంఘాలు మాత్రం 63 శాతం ఫిట్‌మెంట్‌ను ఆడుగుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ వర్గాలు 35 శాతం వరకు ఫిట్మెంట్ ఇస్తే సరిపోతుం దని ఆలోచిస్తున్నాయి. అయితే గత పీఆర్సీలో ఇచ్చిన 39 శాతం దాటాల్సిందేనని, కనీసంగా 45 శాతం వరకైనా ఫిట్మెంట్ బెనిఫిట్ ను రాబట్టుకోవాలని ఉద్యోగులు పట్టుదలగా ఉన్నారు.
చివరకు 42 శాతం ఫిట్మెంట్ ఖరారవడం ఖాయమని కింది స్థాయి ఉద్యోగులు విశ్వసిస్తున్నారు. మరో ప్రధానాంశమైన మానిటరీ బెనిఫిట్పైనా ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి 2013 జూలై 1 నుంచే పదో పీఆర్సీ అమల్లోకి రావాలి. కానీ నివేదిక రూపకల్పనలో జాప్యం, ఎన్నికలు ముంచుకురావడంతో పీఆర్సీ అమలు ఆలస్యమైంది. ప్రస్తుతం దీనిపై ఇరు ప్రభుత్వాలు దృష్టి సారించడంతో మానిటరీ బెనిఫిట్ ఎప్పటి నుంచి ఇస్తారన్న చర్చ జరుగుతోంది. 2013 జూలై 1 నుంచి 2014 జూలై 1వ తేదీ వరకు నోషనల్‌గా ఇచ్చి, ఆ తర్వాత నుంచి మానిటరీ బెనిఫిట్ ఇస్తారా లేక 2013 జూలై 1 నుంచి ఇప్పటి వరకు నోషనల్‌గా ఇస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.