స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓపెన్ బ్యాలెట్ | Open the ballot for election to the Standing Committee | Sakshi
Sakshi News home page

స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓపెన్ బ్యాలెట్

Published Sun, May 22 2016 8:15 AM | Last Updated on Mon, Sep 4 2017 12:37 AM

స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో   ఓపెన్ బ్యాలెట్

స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓపెన్ బ్యాలెట్

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అధికార పార్టీ, అధికారులు అడుగడుగునా....

వైఎస్సార్ సీపీ గెలుస్తుందేమోననే భయంతో
అధికార దుర్వినియోగానికి పాల్పడిన మేయర్
అధికార పార్టీ ఒత్తిడితో సీరియల్ నంబర్లతో
బ్యాలెట్లు తయారు చేయించిన కమిషనర్

 
 
మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నేతలతో పాటు అధికారులు సైతం అడ్డదారులు తొక్కారు. సీక్రెట్‌గా జరగాల్సిన ఎన్నికలను ఓపెన్‌గా జరిపించారు. ఈ అక్రమాలను ప్రశ్నించడంతో కమిషనర్ సైతం వైఎస్సార్‌సీపీ కార్పొటర్లతో దురుసుగా మాట్లాడారు. కమిషనర్ వైఖరిపై వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల బలప్రయోగంతో బయటకు పంపారు. రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన ఈ ఎన్నికలను ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు బహిష్కరించారు.

 
 
సాక్షి ప్రతినిధి - నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అధికార పార్టీ, అధికారులు అడుగడుగునా అధికార దుర్వినియో గానికి పాల్పడ్డారు. పాలకవర్గంలో కీలకమైన స్టాండింగ్ కమిటీకి శని వారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. మొత్తం ఐదు స్థానాలకు గాను మేయర్ అజీజ్, ఆనం వివేకానందరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి వర్గాల నుంచి 13 మంది పోటీ నామినేషన్లు దాఖలు చేశారు. మేయర్ అజీజ్ మీద తీవ్రస్థాయిలో వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో ఊహించని విధంగా వైఎస్సార్ సీపీ నుంచి ఇద్దరు కొర్పొరేటర్లు పోటీకి దిగారు. ఎన్నిక లాంఛనమే అనుకున్న మేయర్, టీడీపీ పెద్దలకు ఈ పరిణామం షాక్ ఇచ్చింది. తన మీద కార్పొరేటర్లలోను, టీడీపీ పెద్దల్లోను నెలకొన్న ఆగ్రహం ఈ ఎన్నికలు కొంప ముంచుతుతాయని మేయర్ భయపడ్డారు. వైఎస్సార్‌సీపీ ఒక్క స్థానం గెలిచినా కార్పొరేషన్‌లో తాను ముఖం చూపుకోలేననే భయంతో మేయర్ అజీజ్ తన అసంతృప్తి వర్గాన్ని శాంతింప చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నించారు. తన శక్తి చాలకపోవడంతో జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని రంగంలోకి దించారు.

జిల్లా టీడీపీ కార్యాలయంలో నాలుగు రోజుల క్రితం రవిచంద్ర, సోమిరెడ్డి పార్టీ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్‌లు దాఖలు చేసిన 8 మందితో నామినేషన్లు  ఉపసంహరింప చేశారు. కార్పొరేటర్లు ఎవరైనా పార్టీని ధిక్కరించి వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. అయినా కార్పొరేటర్లు టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని, తమకు 36 మంది ఉన్నా రెండు స్థానాలు ఓడిపోతామని మేయర్‌కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ రూప్‌కుమార్‌యాదవ్ తమ సభ్యులు ఇద్దరూ గెలుస్తారని ధీమాగా చెప్పారు. వైఎస్సార్‌సీపీ నుంచి ఒక్క ఓటు చీలితే కార్పొరేషన్‌లో అడుగు కూడా పెట్టనని, మా అభ్యర్థి గెలిస్తే మేయర్ రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. దీంతో అధికార పార్టీలో మరింత ఉలికిపాటు మొదలైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఓ హోటల్‌లో పార్టీ కార్పొరేటర్లకు అజీజ్ విందు ఏర్పాటు చేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు ఓట్లు వేయొద్దని ప్రాధేయపడ్డారు.


 అయినా అనుమానమే
కార్పొరేటర్ల మీద సామ, దాన, బేధ, దండోపాయాలు ప్రయోగించినా కొందరు తనకు వ్యతిరేకంగానే ఓటు వేస్తారని మేయర్ అజీజ్ ఆందోళన. ఎవరు ఎవరికి ఓటు వేశారో తెలుసుకునేలా పోలింగ్ నిర్వహించాలని అధికారుల మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారు. కార్పొరేషన్ అధికారులు చట్టంలోని లొసుగులను అధికార పార్టీకి అనుకూలంగా మార్చే వ్యూహం అమలు చేశారు. బ్యాలెట్  మీద దాని కౌంటర్ ఫాయిల్ మీద సీరియల్ నంబర్లు ముద్రించారు. క్రాస్‌ఓటింగ్ చేస్తే తెలిసిపోతుంద ని మేయర్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.  మేయర్ మీద ఆగ్రహం ఉన్నా కార్పొరేటర్లు అయిష్టంగానే  ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఓపెన్ బ్యాలెట్ పై  వైఎస్సార్‌సీసీ కార్పొరేటర్ల ఆందోళనతో ఉద్రిక్తత
శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన స్టాండిగ్ కమిటీ ఎన్నిక కోసం కమిషనర్ ఏర్పాటు చేయించిన బ్యాలెట్ పేపర్లు ఓపెన్ బ్యాలెట్ తీరును వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ రూప్‌కుమార్‌తో పాటు పార్టీ కార్పొరేటర్లంతా తీవ్రంగా వ్యతిరేకించి కమిషనర్‌ను నిలదీశారు. ఎన్నికలను నిలిపి వేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఎన్నికల కేంద్రంలో కింద బైఠాయించి నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను పోలీసుల బలప్రయోగంతో బయటకు పంపించేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఎన్నిక నిర్వహించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బహిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement