
అడ్డొస్తే అంతమే..!
►ఏలూరులో హత్యారాజకీయాలు
►ప్రత్యర్థులను హతమార్చడానికి సుపారీలు
►రెచ్చిపోతున్న రౌడీషీటర్లు విష సంస్కృతికి శ్రీకారం
►అధికారపార్టీ అండదండల వల్లే.. కొత్త ఎస్పీకి సవాలే..!
పైరుపచ్చని పశ్చిమ సీమ.. ప్రశాంతతకు ఆలవాలం.. సమైక్య జీవనం.. సమతకు, మమతకు తార్కాణం.. ఇదంతా గతం.. ఇప్పుడు పరిస్థితి మారింది. విద్వేషాలు పెచ్చుమీరుతున్నాయి. హత్యారాజకీయాలు పేట్రేగిపోతున్నాయి. జిల్లా కేంద్రం ఏలూరు పరిసరాల్లో విష సంస్కృతి పురుడుపోసుకుంటోంది. దీనికి అధికారపార్టీ కూడా వత్తాసు పలుకుతోంది. హత్యాకాండలకు అండదండలందిస్తోంది. ఈ ప్రమాదకర పోకడ సర్వత్రా ఆందోళన రేపుతోంది.
ఏలూరు : అడ్డొస్తే అంతమొందించేయ్.. ఇదీ జిల్లా కేంద్రం ఏలూరు, పరిసరాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న మాట. గతంలో ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ఎవరైనా తమ కార్యకలాపాలకు అడ్డొస్తున్నారని భావిస్తే.. వారిని బెదిరించడం, మహా అయితే దాడి చేయడం వరకూ ఉండేది. అయితే రెండేళ్లలో ఏలూరులో శాంతిభద్రతలు క్షీణించాయి. అధికార పార్టీ నేతల అండదండలతో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. ప్రత్యర్థులను మట్టుబెట్టడమే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే అంతమొందించేందుకు కుట్ర పన్నే దుస్థితి నెలకొంది. ఇది ఇక్కడి శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోంది. ఏడాదిన్నర క్రితం న్యాయవాది రాయల్ హత్య కేసుతో మొదలైన హత్యా రాజకీయాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పోలీసులు వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు. పైపెచ్చు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారు. దీనికి ఈ ఉదాహరణలే నిదర్శనం..
ఇసుక దందాకు అడ్డమని..!
తాజాగా దెందులూరు మండలానికి చెందిన అ«ధికార పక్ష నేత ఒకరు.. తన అక్రమ ఇసుక దందాకు అడ్డం వస్తున్నాడనే కారణంతో ఒక వ్యక్తిని అంతమొందించడానికి కిరాయి రౌడీలతో ఒప్పందం కుదుర్చుకోవడం సంచలనంగా మారింది. పోలీసులు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతుండటంతో ఆ పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. దెందులూరు మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన అధికార పార్టీ ఎంపీటీసీ సభ్యుడు మోతుకూరి శోభన్‌బాబు తనకు అన్ని విషయాల్లో అడ్డు వస్తున్న ఫొటోగ్రాఫర్ కొత్తపల్లి రమేష్‌ను చంపడం కోసం ఏలూరుకు చెందిన రౌడీషీటర్ బ్రహ్మానందంతో రూ.లక్షకు ఒప్పందం కుదుర్చుకుని రూ. 25 వేలు అడ్వాన్సు ఇచ్చారు. అయితే బ్రహ్మానందం ఈ విషయాన్ని రమేష్‌కు చెప్పడంతో రమేష్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకూ పోలీసులు నిందితులను అరెస్ట్ చేయలేదు.
సరిహద్దు తగాదాల నేపథ్యంలో..
సరిహద్దు తగాదాల నేపథ్యంలో ఈ నెల 10న చొదిమెళ్ల గ్రామానికి చెందిన బండి రాంబాబు, బాబూరావును అదే గ్రామానికి చెందిన వారు ఏలూరు పాతబస్టాండ్ ప్రాంతంలో కత్తులతో దాడి చేసి చంపబోయారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారిని పోలీసులు అరెస్టు చేయకపోవడంతో అతను మళ్లీ బెదిరిస్తున్నాడని గ్రామస్తులంతా టూటౌన్ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించాల్సి వచ్చింది.
ఆధిపత్యపోరుతో హత్య
ఇటీవల గుడివాకలంక మాజీ సర్పంచ్ భద్రగిరి స్వామిని ఏలూరు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట అగంతకులు కత్తులతో నరికి చంపారు. ఈ హత్య అధిపత్య పోరుతోనే జరిగింది.
ఏకంగా ఎమ్మెల్యే హత్యకే కుట్ర!
దెందులూరు శాసనసభ్యునితోపాటు మరో ఇద్దరిని హత్య చేయడానికి కుట్ర పన్నిన ఘటన ఈ నెలలోనే వెలుగు చూసింది. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న వెంకటాపురం మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. అప్పలనాయుడు భార్య ఏలూరు ఎంపీపీగా పనిచేశారు. ఎన్నికల సమయంలో పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుకోవడంతో ఆమె పదవీ కాలం ఇటీవలే పూర్తయింది. అయితే పదవీకాలాన్ని ఇంకో ఏడాది పెంచాలని రెడ్డి అప్పలనాయుడు కోరారు. దీనికి చింతమనేని నిరాకరించారు. దీంతో రెడ్డి అనురాధ తన పదవికి రాజీనామా చేశారు.
మోరు హైమావతి ఎంపీపీ పదవి దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో పదవి దక్కలేదని, పైపెచ్చు తమను ఆర్థికంగా చింతమనేని ఇబ్బంది పెడుతున్నారని అక్కసు పెంచుకున్న రెడ్డి అప్పలనాయుడు ఎలాగైనా ఆయనను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విషయాన్ని పసిగట్టిన పోలీసులు చింతమనేని ప్రభాకర్‌కు 3 ప్లస్ 3 సెక్యూరిటీని కల్పించారు. దిలా ఉంటే అధికార పార్టీలోని భీమవరపు సురేష్, కొల్లి శంకరరెడ్డి వర్గాలు ఒకరినొకరు చంపుకునేందుకు రెక్కీలు కూడా జరుపుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరిలో కొల్లి శంకరరెడ్డి చింతమనేని హత్యకు కుట్ర పన్నిన కేసులో కూడా ముద్దాయిగా ఉన్నాడు. ఇతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమవరపు సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిన్నచిన్న విషయాలకే హత్యలవైపు మొగ్గుచూపుతున్న ఈ విష సంస్కృతికి కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ రవిప్రకాష్ ఎలా అడ్డుకట్ట వేస్తారో వేచి చూడాల్సిందే!