
ఢిల్లీ ఎందుకు వెళ్లినట్లు..?
♦ కార్పొరేటర్ల పయనం వెనుక రాజకీయం
♦ అంతా అధికార పార్టీకి చెందినవారే
♦ ఓ కీలక నేత వైఖరి నచ్చకేనని ప్రచారం
♦ ఏలూరు నగరంలో జోరుగా చర్చలు
ఏలూరు (సెంట్రల్):
నగరపాలక సంస్థ కార్పొరేటర్ల ఢిల్లీ ప్రయాణం చర్చనీయాంశమైంది. వారంతా అధికార పార్టీకి చెందిన వారే కావడం, నగరంలోని ఓ కీలక నేత పనితీరుపై అసంతృప్తి ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆ నేతను తొలగించే ప్రయత్నమే ఈ ప్రయాణమని ప్రచారం జరుగుతోంది. నగరంలో మొత్తం 44 మంది అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో 25 మంది ఈనెల 2న ఢిల్లీ వెళ్లారు. వీరు తిరిగి ఈనెల 8న రానున్నట్లు సమాచారం. ఓ వర్గానికి చెందిన కార్పొరేటర్లంతా ఢిల్లీ వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. కీలక పదవిలో ఉన్న నేతను తొలగించే ప్రయత్నంలో భాగమే ఢిల్లీకి ప్రయాణమని అధికార పార్టీ నాయకుల్లో చర్చ నడుస్తోంది.
ఓ నేత తీరుపై అసంతృప్తి
నగరపాలక సంస్థ కీలక పదవిలో ఉన్న ఓ నేత తీరుపై పలువురు కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ నేత వ్యతిరేక వర్గం ఢిల్లీకెళ్లింది. వచ్చిన తరువాత ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఆవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. సదరు నేత స్థానిక ప్రజాప్రతినిధికి తెలియకుండా సొంత నిర్ణయాలు తీసుకోరనేది కార్పొరేటర్లు, నాయకులకు తెలిసిందే. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధి ఓ సీనియర్ నాయకుడైన కార్పొరేటర్‌ను మందలించి, పార్టీకి ఎంతగానో సహకరించే వ్యక్తిపై ఇటువంటి వైఖరిని మానుకోవాలని సూచించినట్లు సమాచారం.
అభివృద్ధి పనుల్లో వివక్ష
నిత్యం ఎమ్మెల్యే, మేయర్ వెనుక పదుల సంఖ్యలో తిరిగే కార్పొరేటర్లు ప్రస్తుతం ఇద్దరు ముగ్గురికే పరిమితమయ్యారు. ఇందుకు తమ డివిజన్లలో పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఇటీవల పలు డివిజన్లలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు నగరానికి ఇవ్వడంతో పనులు వేగంగా జరిగాయి. ఈ డివిజన్లకు అనుకొని ఉన్న డివిజన్లలో పనులు అంతంతమాత్రంగానే ఉండడంపై ప్రజలు కార్పొరేటర్లను ప్రశ్నిస్తున్నారు. తమ డివిజన్‌లోని సమస్యలను పాలకులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో ఆయా కార్పొరేటర్లు తీవ్ర అసంత్తృప్తితో ఉన్నట్లుగా తెలిసింది.