అధికార పార్టీ అండదండలతో నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు...
రాప్తాడు పీఎస్‌లో కేసు నమోదు
నిందితుడికి అధికార పార్టీ అండ
అనంతపురం : అధికార పార్టీ అండదండలతో నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులను బెదిరించడం, బ్లాక్‌మెయిల్ చేయడం, చివరికి దాడులు చేయడం పరిపాటిగా మారుతోంది. తాజాగా రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలో మాట వినని ట్రాన్స్‌కో లైన్‌మెన్‌ను చెప్పుతో దాడి చేశాడు ఓ నాయకుడు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలిలా ఉన్నాయి. గొందిరెడ్డిపల్లి, పుల్లలరేవు గ్రామాలకు బోయ నాగరాజు అనే వ్యక్తి లైన్‌మెన్‌గా పని చేస్తున్నాడు. గొందిరెడ్డిపల్లికి చెందిన నాగభూషణం, నారాయణస్వామి, లక్ష్మీనారాయణకు ట్రాన్స్‌ఫార్మర్ మంజూరైంది. ఈ నెల 17న లైన్‌మెన్ నాగరాజు దగ్గరుండి ట్రాన్స్‌ఫార్మర్ బిగించారు.
ఈ పనిలో తక్కిన 11 కేవీ కండక్టర్ వైరును ట్రాన్స్‌కో కార్యాలయానికి తరలించారు. అయితే లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మిగులు వైరును తనకివ్వాలని లైన్‌మెన్‌ను కోరాడు. నిబంధనల ప్రకారం మిగులు వైరును కార్యాలయానికి తరలిస్తామని, ఇవ్వడానికి వీలుకాదని లైన్‌మెన్ స్పష్టం చేశాడు. ఇది మనుసులో పెట్టుకున్న లక్ష్మీనారాయణ మరుసటి రోజు 18న ఉదయం 9 గంటల సమయంలో గొందిరెడ్డిపల్లిలో ఎదురైన లైన్‌మన్‌ను దుర్భాషలాడుతూ దాడికి దిగాడు. కిందపడేసి చెప్పుతో దాడి చేశాడు. స్థానికులు కల్పించుకుని విడిపించారు.
రాప్తాడు పీఎస్‌లో కేసు నమోదు :
ఈ ఘటనపై తీవ్ర మనస్థాపానికి గురైన లైన్‌మెన్ నాగరాజు నేరుగా రాప్తాడు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. నిందితుడికి అధికార పార్టీ నాయకులు అండ ఉండటంతో పోలీసులూ చూసీ చూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. కేసు కూడా వెనక్కు తీసుకోవాలని బాధితుడిపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఒకానొక సందర్భంలో బెదిరింపులకు గురి చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా బోయ నాగరాజు తనకు జరిగిన అవమానంపై కుల నాయకుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.