జన్మభూమి కమిటీల పెత్తనమేంటి?
► చిన్నచూపు చూస్తున్న అధికారులు
► స్టాండింగ్ కమిటీ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుల ధ్వజం
నెల్లూరు(అర్బన్) : చిన్న, చిన్న సమస్యల పరిష్కారానికి కూడా అధికార పార్టీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డుపడుతున్నారు. పింఛన్ పొందాలన్న జన్మభూమి కమిటీల ఆమోదం తెలపాలి. కమిటీల పెత్తనం ఏంటంటూ అధికార పక్షాని చెందిన జెడ్పీటీసీ సభ్యులతో పాటు వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రభుత్వంపై మండిపడ్డారు. స్థానిక దర్గామిట్టలోని జెడ్పీ కార్యాలయంలో చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొమ్మిరెడ్డి మాట్లాడుతూ అజెండా ప్రకారం గృహనిర్మాణం, విద్య, వైద్యం, స్త్రీశిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం తదితర అంశాలపై చ ర్చించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.
గృహనిర్మాణ శాఖ పీడీ రామచంద్రారెడ్డి ఎన్టీఆర్ హౌసింగ్, అందరికీ ఇళ్లు పథకాలకు వచ్చిన అర్జీలు, తదితర అంశాలను వివరిస్తుండగా దుత్తలూరు జెడ్పీటీసీ చీదెళ్ల మల్లికార్జున అడ్డుకున్నారు. ఇళ్ల మంజూరుపై జెడ్పీటీసీ సభ్యులతో ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. గతంలో నిర్మించిన ఇళ్లకు నేటికీ బిల్లులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయని ప్రశ్నించారు. ఈఈల అవినీతి వల్లనే బిల్లులు అందడం లేదని, కొత్తగా మంజూరయ్యే వాటికైనా బిల్లులు వస్తాయా..రావా చెప్పాలని డిమాండ్ చేశారు. పీడీ మాట్లాడుతూ లోపాలపై సమీక్షించి తగుచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొడవలూరు జెడ్పీటీసీ సభ్యుడు ఐ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ జెడ్పీ పాఠశాలల్లో జరిగే కార్యక్రమాల సమాచారాన్ని జెడ్పీటీసీలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
పాఠశాలల్లో స్వీపర్ల భర్తీ, మరుగుదొడ్ల నిర్మాణం తదితర విషయాలను జెడ్పీటీసీలకు చెప్పకపోవడానికి గల కారణాలను వెల్లడించాలని సర్వశిక్ష అభియాన్ అధికారులను డిమాండ్ చేశారు. తమకు తెలియకుండా పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈయనకు మద్దతుగా పలువురు జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడారు. ఈ దశలో చైర్మన్ బొమ్మిరెడ్డి కలుగజేసుకుని ఇక మీదట ఏ పనులు జరిగినా జెడ్పీటీసీల ఆధ్వర్యంలో జరిగేలా తీర్మానం చేయించారు.
డీఆర్డీఏ పీడీ చంద్రమౌళి మాట్లాడుతూ పింఛన్‌ల కోసం కొత్తగా 30వేల మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. దీంతో పలువురు జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ జన్మభూమి కమిటీ సభ్యులు సూచించిన వారికే పింఛన్ అందుతుందని విమర్శించారు. ప్రజాప్రతినిధులను కాదని అర్హతలేని జన్మభూమి కమిటీల సభ్యులకు పెత్తనం ఇవ్వడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలతో అర్హత ఉన్న పలువురికి పింఛన్ అందడం లేదని ధ్వజమెత్తారు.
వైద్యశాలల్లో తగిన మందులు అందుబాటులో ఉంచాలని కోరారు. అనంతరం అంగన్‌వాడీ సెంటర్లు, వ్యవసాయం, సబ్సిడీపై పచ్చిరొట్ట ఎరువులు , సంక్షేమం, తదితర అంశాలను చర్చించారు. జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ పొట్టేళ్ల శిరీష, డ్వామా పీడీ హరిత, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఎంహెచ్‌ఓవరసుందరం, సర్వశిక్ష అభియాన్ పీఓ కనకనర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.