క్రికెట్ బుకీ వివరాలు వెల్లడిస్తున్నఎస్పీ విజయరావు, వెనుక నిందితుడు గంజికుంట సాంబశివరావు (ఫైల్)
♦ బుకీలకు అండగా నిలుస్తున్న అధికార పార్టీ నేతలు
♦ బాధితుల ఫిర్యాదుతో గతంలో ఐదుగురి అరెస్ట్
♦ మరో బుకీని బుధవారం అరెస్ట్ చూపిన వైనం
♦ అరెస్టయినవారిలో అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువులు, అనుచరులు
♦ ఎస్పీలు దృష్టి సారించడంతో నెలరోజులుగా అజ్ఞాతంలోనే బుకీలు
సాక్షి, గుంటూరు : జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మహమ్మారికి ఎన్నో కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. బెట్టింగ్‌లలో సొమ్ము పోగొట్టుకుని అప్పుల పాలై తెనాలికి చెందిన కుటుంబం మొత్తం మాచర్లకు వెళ్లి పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. సర్వం కోల్పోయి తల్లిదండ్రులకు ముఖం చూపలేక ఇల్లు వదిలి వెళ్లిన ఘటనలూ ఉన్నాయి. ఇంత జరుగుతున్నా క్రికెట్ బు‘కీ’లను మాత్రం పట్టలేకపోతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు దీనిపై సీరియస్‌గా ఉన్న సమయంలో మాత్రం బెట్టింగ్‌లు కాసే వారిని అదుపులోకి తీసుకుని తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి వదిలేయడం మినహా డొంకను కదల్చలేకపోతున్నారు. కుటుంబాలను బలి తీసుకుంటున్న క్రికెట్ మహమ్మారికి సీరియస్‌గా వ్యవహరించాల్సిన పాలకులే కీలక బుకీలకు అండగా నిలుస్తూ పోలీసులు వారి జోలికి రాకుండా రక్షిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
గతంలో గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీగా పనిచేసిన పీహెచ్‌డీ రామకృష్ణ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా కీలక బుకీలను అదుపులోకి తీసుకుని చర్యలకు ఉపక్రమించిన క్రమంలోనే ఆయనపై బదిలీ వేటు వేశారంటే జిల్లాలో బుకీలకు ప్రభుత్వ పెద్దల నుంచి ఏ స్థాయిలో ఆశీస్సులు ఉన్నాయో అర్థమవుతుంది. ఎస్పీలు క్రికెట్ బెట్టింగ్‌లపై సీరియస్‌గా దృష్టి సారించిన సమయంలో అధికార పార్టీ నేతల అండతో అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోవడం, వారితో పోలీసు అధికారులకు చెప్పించుకుని యథావిధిగా బెట్టింగ్‌లకు పాల్పడడం గమనార్హం.
బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి...
జిల్లాలో గత నెలలో క్రికెట్ బెట్టింగ్‌లలో తీవ్రంగా నష్టపోయి బుకీల దౌర్జన్యానికి పొలాలు, స్థలాలు కోల్పోయిన అనేక మంది బాధితులు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయారావుకు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కీలక బుకీ బాలాజీతో పాటు, మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కీలక బుకీలు అధికార పార్టీకి చెందిన రాజధాని ఎమ్మెల్యేకు దగ్గరి బంధువులు, అనుచరులు కావడంతో వారిపై సరైన చర్యలు లేకుండా వదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆ కేసులో మరో బుకీ గంజికుంట సాంబశివరావును బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచిన పోలీసులు క్రికెట్ బుకీలను వదిలేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
పోలీసు అధికారులపైనే ఒత్తిళ్లు...
గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలు క్రికెట్ బుకీలపై దృష్టి సారించారనే విషయం తెలుసుకున్న అనేక మంది కీలక బుకీలు నెలరోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో కీలక బుకీలుగా ఉన్న ఐదుగురు అధికార పార్టీ నేతల స్థావరాల్లో తలదాచుకున్నట్లు సమాచారం. అధికార పార్టీ ముఖ్య నేతలకు భారీ మొత్తంలో ఆఫర్లు ఎర వేసి పోలీసులు తమ జోలికి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. వీరంతా పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే, ముఖ్యనేత తనయ, తనయుడు, రాజధాని ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, ఓ మంత్రి వద్దకు వెళ్లి పోలీసు ఉన్నతాధికారులు తమను అదుపులోకి తీసుకోకుండా ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బుకీలు, బెట్టింగ్‌లు నిర్వహించే వారంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పనిచేస్తుండటంతో పోలీసులు సైతం వీరికి జోలికి వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.