bookie
-
గెలిచింది 5 కోట్లు.. పోగొట్టుకుంది 58 కోట్లు..
ముంబై: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఆన్లైన్లో జూదమాడి 5 కోట్లు సంపాదించాడు. తక్కువ సమయంలో కూర్చున్న చోట కూర్చుని ఉండగానే కోట్లు కొల్లగొట్టడంతో ఇదేదో బాగుందనిపించి అదేపనిగా గ్యాంబ్లింగ్ ఆడాడు. ఇంకేముంది చూస్తుండగానే 58 కోట్లు పోగొట్టుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగ్‌పూర్‌కు సమీపంలోని గొండా సిటీకి చెందిన అనంత్ అలియాస్ శొంటు నవరతన్ జైన్ బాధితుడైన వ్యాపారస్తుడికి గ్యాంబ్లింగ్ లో ఆనతి కాలంలోనే కోట్లు గడించవచ్చని ఆశ చూపించాడు. మొదట్లో వెనకడుగు వేసిన వ్యాపారి తరవాత ఎందుకో నవరతన్ జైన్ ప్రలోభానికి లొంగిపోయాడు. వెంటనే జైన్ కు హవాలా ద్వారా రూ.8 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. జైన్ వ్యాపారికి వాట్సాప్‌లో ఒక లింకు పెట్టగా దాని ద్వారా తన అకౌంట్లో రూ. 8 లక్షలు డిపాజిట్ అయినట్టు చూపించింది. దీంతో వ్యాపారికి ఆశతో పాటు నమ్మకం కూడా కలిగింది. ఆలస్యం చేయకుండా వెంటనే గ్యాంబ్లింగ్ ఆడటం ప్రారంభించాడు. మొదట్లో హస్తవాసి కలిసొచ్చి 5 కోట్లు లాభం సంపాదించాడు. అక్కడ వరకు అంతా బాగానే సాగింది. సరిగ్గా అప్పుడే మొదలైంది అసలు జూదం. ఒక్కొక్కటిగా సంపాదించిన ప్రతి రూపాయి వెనక్కి పోవడం మొదలైంది. పోయిన రూపాయిని తిరిగి రాబట్టుకోవాలన్న అతడి తాపత్రయం ఏకంగా 58 కోట్లు నష్టపోయేలా చేసింది. ఎంత ఆడినా జూదం కలిసిరాకపోవడంతో విసుగు చెందిన వ్యాపారి నవరతన్ జైన్ ను కలిసి తన డబ్బు తనకు తిరిగివ్వాలని కోరాడు. అతడు నిరాకరించడంతో చేసేదేమీ లేక తమకు కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపారు. వెంటనే గొండా సిటీలోని నిందితుడి ఇంటికి వెళ్ళేసరికే జైన్ పారిపోయాడని.. ఇల్లంతా సోదా చేయగా 14 కోట్లు నగదు నాలుగు కేజీల బంగారు బిస్కెట్లు దొరికినట్లు తెలిపారు పోలీసులు. వారంతా దుబాయ్ పారిపోయి ఉండవచ్చని చెబుతున్నారు పోలీసులు. గ్యాంబ్లింగ్ కారణంగా ఎందరో జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. అయినా కూడా ఏదో ఒక మూల అదృష్టదేవత కనికరించక పోతుందా అన్న చిన్న నమ్మకంతో అనేకులు ఈ మహమ్మారి బారిన పతున్నారు. అదృష్టం సంగతి అటుంచితే ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయిన సందర్భాలే ఎక్కువ. ఇది కూడా చదవండి: మణిపూర్ అరాచకపర్వంలో మరో ఘోరం.. -
అనిల్‌ను పట్టుకునేందుకు అమృత సాయం!
క్రైమ్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతను డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసిన కేసులో.. ముంబై పోలీసులు ఎట్టకేలకు కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే.. ఇందులో చాలా ఆసక్తికర విషయాల్నే పోలీసులు పొందుపరిచారు. ప్రధాన నిందితుడైన క్రికెట్ బుకీ అనిల్ జైసింఘానీని పోలీసులు.. అమృత సాయంతోనే ట్రేస్ చేసి పట్టుకున్నట్లు తెలిసింది. ఇందుకుగానూ .. అనిల్ కూతురు అనిక్షను నేరుగా కలవడంతో పాటుగా.. అమృత-అనిల్ మధ్య ఛాటింగ్‌ను సైతం పోలీసులు ఆ ఛార్జ్‌షీట్‌తో జత చేశారు. అమృతా ఫడ్నవిస్‌ను బెదిరించి.. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో అనిల్ జైసింఘానీ, అతని కుమార్తె అనిక్షపై పోలీసులు ఈ ఫిబ్రవరిలో కేసు నమోదు చేశారు. ఈలోపు అతని నేర చరిత్ర మొత్తం బయటపడింది. దాదాపుగా 15 కేసుల్లో నిందితుడిగా ఉన్న అనిల్.. ఎనిమిదేళ్ల నుంచి పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడట. దీంతో స్పెషల్ ఆపరేషన్ ద్వారా అతన్ని పట్టుకోవాలని ముంబై పోలీసులు డిసైడ్ అయ్యారు. అందుకు ఫడ్నవిస్ సతీమణి సాయం తీసుకున్నారు. ఫిబ్రవరి 24న ఛాటింగ్ అమృత: ‘‘మిమ్మల్ని అక్రమంగా కేసులో ఇరికిస్తే దాని గురించి.. నేను నా భర్త దేవేంద్ర ఫడ్నవిస్‌తో మాట్లాడతా. ఆయన మీకు న్యాయం చేస్తారు. కానీ, అక్రమంగా డబ్బు సంపాదించొచ్చన్న అనిక్ష డిమాండ్లను నేను అంగీకరించలేను. మీరు ముందు నుంచీ నన్ను బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నారు. నేను ఏ తప్పూ చేయలేదు. ఇప్పుడు మీరు నా వీడియోలను బయటపెట్టి నన్ను ఇరికించొచ్చు. కానీ, నిజాలు ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. మీరు నిజంగా న్యాయం కోరుకుంటే దేవ్జీతో నేను మాట్లాడుతాను అవతలి నుంచి: కొన్ని డాక్యుమెంట్లు, ఆడియో మెసేజ్‌లు రిప్లైగా వచ్చాయి. ఆ తర్వాత అనిల్‌తో ఫోన్లో అమృత: ‘‘దేవేజీతో(భర్త దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఉద్దేశించి) నా బంధం సరిగా లేదు. 2019 నుంచి మా మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు కారణంగా ఆయన నాకు విడాకులిస్తారేమో!. కానీ, ఆయన గురించి నాకు తెలుసు. మీరు బాధితులని తెలిస్తే.. ఆయన 100శాతం న్యాయం జరిగేలా చూస్తారు. మరోసారి కాల్‌లోనే: ‘‘ఫోన్లో కాదు.. నేరుగా మీ అమ్మాయి అనిక్షను కలిసి మాట్లాడతా’’ అలా అనిక్ష, ఆమె తండ్రి లొకేషన్‌ను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తొలుత మార్చి 16న అనిక్షను అరెస్టు చేయగా.. ఆ తర్వాత మార్చి 19న అనిల్ జైసింఘానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇదంతా ఆమె తనంతట తానుగా చేయలేదు. ఇది కూడా పోలీసులే చెప్పమన్నారట. వాళ్ల డైరెక్షన్లోనే ఆమె ఇదంతా నడిపించారట. ఆ విషయాన్ని కూడా పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. దీనిపై ఓ దర్యాప్తు అధికారి మాట్లాడుతూ.. ‘‘మా సూచనలతోనే అమృతాజీ నిందితులతో టచ్‌లో ఉన్నారు. నిందితులను పట్టుకునేవరకు వారితో సంభాషణలు పొడగించాలని మేమే ఆమెకు చెప్పాం’’ అని తెలిపారు. కేసు వివరాలివే.. అనిక్ష తనను తాను ఫ్యాషన్డిజైనర్గా అమృతా ఫడ్నవిస్‌తో పరిచయం పెంచుకుంది. ఆ వంకతో తరచూ వాళ్ల ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో ఆమె తండ్రి ఓ బుకీ అని తెలియడంతో.. అమృతా ఆ యువతిని దూరం పెట్టింది. అదిగో అప్పటి నుంచి అమృతను డబ్బు కోసం బెదిరించడం మొదలుపెట్టింది అనిక్ష. తన తండ్రిని కేసుల నుంచి బయటపడేందుకు సాయం చేయాలని, లేదంటే పరువు తీస్తానని బెదిరించింది. అమృతకు డబ్బు ఉన్న బ్యాగును ఇస్తున్నట్లుగా ఓ నకిలీ ఆడియో, వీడియో క్లిప్పులు సృష్టించి గుర్తుతెలియని ఫోన్ నంబర్ల ద్వారా బ్లాక్మెయిల్ చేసింది. దీంతో అమృత పోలీసులను ఆశ్రయించారు. ఆపై పోలీసులు అమృత సాయంతోనే వాళ్లను పట్టుకున్నారు. -
ఐపీఎల్లో బుకీ... సమాచారమిచ్చిన క్రికెటర్
దుబాయ్: ‘బయో బబుల్’లో ఐపీఎల్ జరుగుతున్నా బుకీలు మాత్రం ఫిక్సింగ్ ప్రయత్నాలు ఆపడం లేదు. ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్న ఒక క్రికెటర్‌ను ఫిక్సింగ్ కోసం బుకీ సంప్రదించినట్లు తెలిసింది. అయితే సదరు ఆటగాడు వెంటనే ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ)కు సమాచారం అందించాడు. కఠిన ఆంక్షల కారణంగా ఆటగాళ్లను నేరుగా కలిసే అవకాశం లేకపోవడంతో ఆన్లైన్ ద్వారా ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్ దీనిని నిర్ధారించారు. ‘ఒక ప్లేయర్‌తో బుకీ మాట్లాడాడు. అతడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకు కొంత సమయం పడుతుంది. అవినీతి నిరోధక నిబంధనల ప్రకారం ఆటగాడు పేరు బయటకు చెప్పరాదు’ అని ఆయన వెల్లడించారు. (ఫామ్‌లో లేని అతడినే ఆడిస్తామంటే కుదరదు) -
టాప్ ప్లేయర్‌కు బుకీలతో లింక్స్!
న్యూఢిల్లీ : ఐపీఎల్- 2013 సీజన్లో చోటుచేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం భారత క్రికెట్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధించింది కూడా. అదే విధంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల పాటు వేటు పడింది. అయితే స్పాట్ ఫిక్సింగ్ విచారణలో భాగమైన సీనియర్ పోలీస్ ఆఫీసర్ బీబీ మిశ్రా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రపంచ కప్- 2011 విజేతగా నిలిచిన భారత జట్టులో భాగమైన ఓ సీనియర్ ఆటగాడికి పలువురు బుకీలతో సంబంధాలు ఉన్నాయంటూ ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ 2013 స్పాట్ ఫిక్సింగ్ విచారణలో భాగంగా ఓ బుకీతో మాట్లాడిన సమయంలో తనకు ఈ విషయం తెలిసిందన్నారు. అయితే ఆ ఆటగాడి పేరు బయటపెట్టేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. నాకంత సమయం లేదు అందుకే... ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌లో భాగంగా తొమ్మిది మంది ఆటగాళ్లను విచారించానన్న మిశ్రా... ఇందులో భాగంగా పలువురు బుకీలతో మాట్లాడానన్నారు. ‘2008- 09 నుంచే సదరు సీనియర్ ఆటగాడు బుకీలతో కాంటాక్ట్‌లో ఉన్నాడు. భారత్‌లో జరిగిన వివిధ అంతర్జాతీయ మ్యాచులకు సంబంధించి అతడు బుకీలతో మాట్లాడాడు. ఇందుకు సాక్ష్యంగా ఆ ఆటగాడు తనతో జరిపిన వాయిస్ రికార్డును నాకు ఇస్తానని ఆ బుకీ చెప్పాడు. కానీ చివరి నిమిషంలో అతడు వెనక్కి తగ్గాడు. అయితే కేవలం తొమ్మిది మంది ఆటగాళ్లు, శ్రీనివాసన్, గురునాథ్ మయప్పన్(చెన్నై సూపర్ కింగ్స్), రాజ్‌కుంద్రా (రాజస్తాన్ రాయల్స్), సుందర్ రామన్(ఐపీఎల్ మాజీ సీఓఓ)లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడమే నా ముఖ్య విధి. అందుకే ఆ సీనియర్ ఆటగాడి గురించి తెలుసుకునేందుకు తగినంత సమయం కేటాయించలేకపోయానంటూ’ మిశ్రా వ్యాఖ్యానించారు. -
ప్రముఖ బుకీ అరెస్టు
ముంబై : ముంబై కేంద్రంగా పలు రాష్ట్రాల్లో కోట్ల రూపాయల ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్‌ను నిర్వహిస్తున్న ప్రముఖ బుకీని మంగళవారం నాడు థానే పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ముంబైలోని దొంబివాలా ప్రాంతంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న థానే దోపిడీ వ్యతిరేక విభాగానికి చెందిన పోలీసులు ఆ ప్రాంతంలో దాడి చేసి బుకీని అరెస్టు చేశారు. అతడి నుంచి ల్యాప్‌టాప్‌లను, పదుల సంఖ్యలో మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. నిందితుడు దేశంలోనే టాప్‌మోస్ట్ బుకీ సోను జలాన్ అలియాస్ సోను మలాద్గా పోలీసులు ప్రకటించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జలాన్ ఈ ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్‌లు నిర్వహించడానికి సోషల్ మీడియా ద్వారా కొన్ని లింకులను పంపించేవాడు. ఇతర ఏజెన్సీలకు, పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఈ ప్రయత్నం. బెట్టింగ్‌లో పాల్గొనాలనుకునే వారు ఆ లింకుల ద్వారా బెట్టింగ్ పెడతారు. ఇలా పెట్టినవారికి జలాన్‌కు సంబంధించిన వ్యక్తుల ద్వారా కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది. జలాన్ దొంబివాలా పరిసరాలలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాలను కూడా బెట్టింగ్‌కు అడ్డగా మార్చుకున్నాడని తెలిపారు. -
గెలుపు బీజేపీదే.. కానీ!?
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు... ఈ దఫా బెట్టింగ్ మార్కెట్‌ను కూడా టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. బీజేపీ గెలుస్తుందన్న నమ్మకాన్ని సత్తార్ మార్కెట్ వ్యక్తం చేస్తున్నా.. మెజారిటీపై ధీమాను ప్రకటించడం చేయడం లేదు. ముఖ్యంగా గుజరాత్ ఎన్నికల మొదటి దశకు రెండు రోజులు మాత్రమే గడువుండడంతో పందెం రాయుళ్లు మరింత ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటి వరకూ ఉన్న అంచనాల మేరకు ఈ ఎన్నికల ఫలితాలపై దాదాపు రూ. 500 నుంచి 600 కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగింది. బెట్టింగ్ మార్కెట్ అంచనాలు, వివిధ సర్వేల మేరకు.. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం అంత ఆషామాషీ కాదని తెలుస్తోంది. ఒకవేళ భారతీయ జనతాపార్టీ గెలిచినా.. కాంగ్రెస్ మాత్రం ఎన్నడూ లేనంత గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికలు మోదీ-అమిత్ షా ద్వయానికి అతి పెద్ద పరీక్షలా నిలిచాయని మరికొందరు చెబుతున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఈ ఎన్నికల్లో బీజేపీకి 101 నుంచి 103 సీట్లు వస్తాయని బెట్టింగ్ మార్కెట్ అంచనా. అలాగే కాంగ్రెస్ పార్టీకి 71 నుంచి 73 సీట్లు రావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బుకీ రేట్ బీజేపీ 110 సీట్లు గెలుస్తుందన్న అంశంపై ఒకటిన్నర రూపాయి, 125 సీట్లకు పైగా గెలుస్తుందన్న బెట్టింగ్‌కు రూ. 3.50, అలాగే 150కి పైగా గెలుస్తుందన్న బెట్టింగ్‌కు రూ.7 బుకీ రేట్గా ఉంది. అలాగే కాంగ్రెస్ 99-100 సీట్లకు బుకీ రేట్ రూ.3, 75 సీట్లకు రూపాయి 10 పైసలు ఉంది. అలాగే ఎన్నికల తరువాత విజయ్ రూపానీ ముఖ్యమంత్రి అవుతాడన్న అంశంపై 44 పైసలు, నితిన్ పటేల్ సీఎం అనే దానిపై 55 పైసలును బుకీలు రేట్గా పెట్టారు. బుకీల రేటును బట్టి బీజేపీ తప్పకుండా గెలుస్తుందన్న నమ్మకం అందరిలోనూ ఏర్పడింది. బీజేపీ విజయం సాధిస్తే మరోమారు విజయ్ రూపానీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. -
అజ్ఞాతంలో కీలక బు‘కీ’లు..!
♦ బుకీలకు అండగా నిలుస్తున్న అధికార పార్టీ నేతలు ♦ బాధితుల ఫిర్యాదుతో గతంలో ఐదుగురి అరెస్ట్ ♦ మరో బుకీని బుధవారం అరెస్ట్ చూపిన వైనం ♦ అరెస్టయినవారిలో అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువులు, అనుచరులు ♦ ఎస్పీలు దృష్టి సారించడంతో నెలరోజులుగా అజ్ఞాతంలోనే బుకీలు సాక్షి, గుంటూరు : జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మహమ్మారికి ఎన్నో కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. బెట్టింగ్‌లలో సొమ్ము పోగొట్టుకుని అప్పుల పాలై తెనాలికి చెందిన కుటుంబం మొత్తం మాచర్లకు వెళ్లి పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. సర్వం కోల్పోయి తల్లిదండ్రులకు ముఖం చూపలేక ఇల్లు వదిలి వెళ్లిన ఘటనలూ ఉన్నాయి. ఇంత జరుగుతున్నా క్రికెట్ బు‘కీ’లను మాత్రం పట్టలేకపోతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు దీనిపై సీరియస్‌గా ఉన్న సమయంలో మాత్రం బెట్టింగ్‌లు కాసే వారిని అదుపులోకి తీసుకుని తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి వదిలేయడం మినహా డొంకను కదల్చలేకపోతున్నారు. కుటుంబాలను బలి తీసుకుంటున్న క్రికెట్ మహమ్మారికి సీరియస్‌గా వ్యవహరించాల్సిన పాలకులే కీలక బుకీలకు అండగా నిలుస్తూ పోలీసులు వారి జోలికి రాకుండా రక్షిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీగా పనిచేసిన పీహెచ్డీ రామకృష్ణ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా కీలక బుకీలను అదుపులోకి తీసుకుని చర్యలకు ఉపక్రమించిన క్రమంలోనే ఆయనపై బదిలీ వేటు వేశారంటే జిల్లాలో బుకీలకు ప్రభుత్వ పెద్దల నుంచి ఏ స్థాయిలో ఆశీస్సులు ఉన్నాయో అర్థమవుతుంది. ఎస్పీలు క్రికెట్ బెట్టింగ్‌లపై సీరియస్‌గా దృష్టి సారించిన సమయంలో అధికార పార్టీ నేతల అండతో అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోవడం, వారితో పోలీసు అధికారులకు చెప్పించుకుని యథావిధిగా బెట్టింగ్‌లకు పాల్పడడం గమనార్హం. బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి... జిల్లాలో గత నెలలో క్రికెట్ బెట్టింగ్‌లలో తీవ్రంగా నష్టపోయి బుకీల దౌర్జన్యానికి పొలాలు, స్థలాలు కోల్పోయిన అనేక మంది బాధితులు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయారావుకు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కీలక బుకీ బాలాజీతో పాటు, మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కీలక బుకీలు అధికార పార్టీకి చెందిన రాజధాని ఎమ్మెల్యేకు దగ్గరి బంధువులు, అనుచరులు కావడంతో వారిపై సరైన చర్యలు లేకుండా వదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆ కేసులో మరో బుకీ గంజికుంట సాంబశివరావును బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచిన పోలీసులు క్రికెట్ బుకీలను వదిలేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలీసు అధికారులపైనే ఒత్తిళ్లు... గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలు క్రికెట్ బుకీలపై దృష్టి సారించారనే విషయం తెలుసుకున్న అనేక మంది కీలక బుకీలు నెలరోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో కీలక బుకీలుగా ఉన్న ఐదుగురు అధికార పార్టీ నేతల స్థావరాల్లో తలదాచుకున్నట్లు సమాచారం. అధికార పార్టీ ముఖ్య నేతలకు భారీ మొత్తంలో ఆఫర్లు ఎర వేసి పోలీసులు తమ జోలికి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. వీరంతా పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే, ముఖ్యనేత తనయ, తనయుడు, రాజధాని ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, ఓ మంత్రి వద్దకు వెళ్లి పోలీసు ఉన్నతాధికారులు తమను అదుపులోకి తీసుకోకుండా ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బుకీలు, బెట్టింగ్‌లు నిర్వహించే వారంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పనిచేస్తుండటంతో పోలీసులు సైతం వీరికి జోలికి వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
విశాఖలో బెట్టింగ్ గుట్టు రట్టు
విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో ఓ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టైంది. ఆదివారం జరిగిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్ పై బెట్టింగ్ చేస్తుండగా పోలీసులు బెట్టింగ్ సెంటర్ పై దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరుబుకీలను అరెస్టు చేశారు, 10 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, టీవీ లతో పాటు.. రూ.1.08 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. -
‘ఆ బుకీ కోసం విచారణ సాగిస్తున్నాం’
కొలంబో: ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టెస్టును ఫిక్స్ చేయాల్సిందిగా తమ ఆటగాళ్లను సంప్రదించిన బుకీ కోసం విచారణ చేస్తున్నట్లు శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్టోబర్‌లో జరిగిన గాలె టెస్టులో వికెట్ కీపర్ కుశాల్ పెరీరా, బౌలర్ హెరాత్‌లకు 70 వేల డాలర్లను ఇచ్చేందుకు ఓ బుక్ మేకర్ ఆశ చూపి, విండీస్ విజయం సాధించేలా చూడాలని కోరినట్టు క్రీడా మంత్రి దయసిరి జయశేఖర పేర్కొన్నారు. కచ్చితంగా శ్రీలంక గెలిచే ఆ మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే ఆలౌట్ కావాలని వారు కోరుకున్నారని, ఇదే జరిగి విండీస్ నెగ్గితే వారికి భారీ స్థాయిలో డబ్బు చేకూరేదని మంత్రి చెప్పారు. అయితే ఈ విషయాన్ని వారిద్దరు అవినీతి వ్యతిరేక అధికారులకు చేరవేశారని అన్నారు. ఆ మ్యాచ్‌లో లంక ఇన్నింగ్స్ ఆరు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిందితుడు అరెస్ట్
హైదరాబాద్: ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఆదివారం అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. అఫ్జల్‌గంజ్ ఇన్స్పెక్టర్ సి. అంజయ్య, డిటెక్టీవ్ ఇన్స్పెక్టర్ ప్రవీన్కుమార్లు తెలిపిన వివరాల ప్రకారం బేగంబజార్ ప్రాంతానికి చెందిన అశ్వీన్‌బంగ్(28)గత 7ఏళ్లుగా సాదిశ్ కమ్యూనికేషన్స్ పేరుతో మొబైల్ షాపును నిర్వహిస్తున్నాడు. ఈ షాపు నిర్వహణతో కుటుంబ అవసరాలు తీరకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. దీంతో ఎలాగైనా ఈజీగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. దీని కోసం క్రికెట్ బెట్టింగ్‌ను ఎంచుకొన్నాడు. తెలిసిన వ్యక్తుల ద్వార, తెలియని వ్యక్తుల ద్వారా సెల్‌ఫోన్, ఆన్లైన్ ద్వార బెట్టింగులకు పాల్పడుతున్నాడు. ఆదివారం ఇంగ్లాడ్‌లో జరుగుతున్న టీ-20 సిరీస్ 2015 మ్యాచ్ పై క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు బేగంబజార్ మహేశ్ బ్యాంక్ సమీపంలో ఉన్న అశ్విన్‌బంగ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అశ్విన్‌బంగ్ ఆన్లైన్ ద్వార క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు బయటపడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని రూ.3.05లక్షల నగదుతో పాటు రెండు లాప్‌ట్యాప్‌లను, ఒక క్యాష్ కౌంటింగ్ మిషన్‌ను, 3 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. ఈ టాస్క్‌ఫోర్స్ దాడులను టాస్క్‌ఫోర్స్ వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ బి. లింబారెడ్డి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్. రాజా వెంకరెడ్డి, ఎస్సైలు ఎ. ప్రభాకర్‌రెడ్డి, డి. జతేందర్‌రెడ్డి, ఎం. వెంకటేశ్వర్‌గౌడ్, పి.మల్లిఖార్జున్‌లు నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అఫ్జల్‌గంజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.