హైదరాబాద్: ఆన్‌లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఆదివారం అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ సి. అంజయ్య, డిటెక్టీవ్ ఇన్‌స్పెక్టర్ ప్రవీన్‌కుమార్‌లు తెలిపిన వివరాల ప్రకారం బేగంబజార్ ప్రాంతానికి చెందిన అశ్వీన్‌బంగ్(28)గత 7ఏళ్లుగా సాదిశ్ కమ్యూనికేషన్స్ పేరుతో మొబైల్ షాపును నిర్వహిస్తున్నాడు. ఈ షాపు నిర్వహణతో కుటుంబ అవసరాలు తీరకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. దీంతో ఎలాగైనా ఈజీగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. దీని కోసం క్రికెట్ బెట్టింగ్‌ను ఎంచుకొన్నాడు. తెలిసిన వ్యక్తుల ద్వార, తెలియని వ్యక్తుల ద్వారా సెల్‌ఫోన్, ఆన్‌లైన్ ద్వార బెట్టింగులకు పాల్పడుతున్నాడు.
ఆదివారం ఇంగ్లాడ్‌లో జరుగుతున్న టీ-20 సిరీస్ 2015 మ్యాచ్ పై క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు బేగంబజార్ మహేశ్ బ్యాంక్ సమీపంలో ఉన్న అశ్విన్‌బంగ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అశ్విన్‌బంగ్ ఆన్‌లైన్ ద్వార క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు బయటపడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని రూ.3.05లక్షల నగదుతో పాటు రెండు లాప్‌ట్యాప్‌లను, ఒక క్యాష్ కౌంటింగ్ మిషన్‌ను, 3 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. ఈ టాస్క్‌ఫోర్స్ దాడులను టాస్క్‌ఫోర్స్ వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ బి. లింబారెడ్డి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్. రాజా వెంకరెడ్డి, ఎస్సైలు ఎ. ప్రభాకర్‌రెడ్డి, డి. జతేందర్‌రెడ్డి, ఎం. వెంకటేశ్వర్‌గౌడ్, పి.మల్లిఖార్జున్‌లు నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అఫ్జల్‌గంజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.