ముంబై: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఆన్‌లైన్‌లో జూదమాడి 5 కోట్లు సంపాదించాడు. తక్కువ సమయంలో కూర్చున్న చోట కూర్చుని ఉండగానే కోట్లు కొల్లగొట్టడంతో ఇదేదో బాగుందనిపించి అదేపనిగా గ్యాంబ్లింగ్ ఆడాడు. ఇంకేముంది చూస్తుండగానే 58 కోట్లు పోగొట్టుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగ్‌పూర్‌కు సమీపంలోని గొండా సిటీకి చెందిన అనంత్ అలియాస్ శొంటు నవరతన్ జైన్ బాధితుడైన వ్యాపారస్తుడికి గ్యాంబ్లింగ్ లో ఆనతి కాలంలోనే కోట్లు గడించవచ్చని ఆశ చూపించాడు. మొదట్లో వెనకడుగు వేసిన వ్యాపారి తరవాత ఎందుకో నవరతన్ జైన్ ప్రలోభానికి లొంగిపోయాడు. వెంటనే జైన్ కు హవాలా ద్వారా రూ.8 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. జైన్ వ్యాపారికి వాట్సాప్లో ఒక లింకు పెట్టగా దాని ద్వారా తన అకౌంట్లో రూ. 8 లక్షలు డిపాజిట్ అయినట్టు చూపించింది.
దీంతో వ్యాపారికి ఆశతో పాటు నమ్మకం కూడా కలిగింది. ఆలస్యం చేయకుండా వెంటనే గ్యాంబ్లింగ్ ఆడటం ప్రారంభించాడు. మొదట్లో హస్తవాసి కలిసొచ్చి 5 కోట్లు లాభం సంపాదించాడు. అక్కడ వరకు అంతా బాగానే సాగింది. సరిగ్గా అప్పుడే మొదలైంది అసలు జూదం. ఒక్కొక్కటిగా సంపాదించిన ప్రతి రూపాయి వెనక్కి పోవడం మొదలైంది. పోయిన రూపాయిని తిరిగి రాబట్టుకోవాలన్న అతడి తాపత్రయం ఏకంగా 58 కోట్లు నష్టపోయేలా చేసింది.
ఎంత ఆడినా జూదం కలిసిరాకపోవడంతో విసుగు చెందిన వ్యాపారి నవరతన్ జైన్ ను కలిసి తన డబ్బు తనకు తిరిగివ్వాలని కోరాడు. అతడు నిరాకరించడంతో చేసేదేమీ లేక తమకు కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపారు. వెంటనే గొండా సిటీలోని నిందితుడి ఇంటికి వెళ్ళేసరికే జైన్ పారిపోయాడని.. ఇల్లంతా సోదా చేయగా 14 కోట్లు నగదు నాలుగు కేజీల బంగారు బిస్కెట్లు దొరికినట్లు తెలిపారు పోలీసులు. వారంతా దుబాయ్ పారిపోయి ఉండవచ్చని చెబుతున్నారు పోలీసులు.
గ్యాంబ్లింగ్ కారణంగా ఎందరో జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. అయినా కూడా ఏదో ఒక మూల అదృష్టదేవత కనికరించక పోతుందా అన్న చిన్న నమ్మకంతో అనేకులు ఈ మహమ్మారి బారిన పతున్నారు. అదృష్టం సంగతి అటుంచితే ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయిన సందర్భాలే ఎక్కువ.
ఇది కూడా చదవండి: మణిపూర్ అరాచకపర్వంలో మరో ఘోరం..
Comments
Please login to add a commentAdd a comment