
ఇంటి స్థలం కోసం ప్రాణాలు పణం
ఇంటిస్థలాన్ని దక్కించుకునేందుకు ఏకంగా తమ ప్రాణాలనే పణంగా పెట్టిందో కుటుంబం. దాయాదులు, మధ్యవర్తి కలసి స్థలాన్ని
♦ మనస్తాపంతో తండ్రి, నలుగురు కొడుకుల ఆత్మహత్యాయత్నం
♦ చికిత్సపొందుతూ ఇద్దరు కొడుకుల మృతి
♦ మరో ఇద్దరి పరిస్థితి విషమం
♦ టీఆర్‌ఎస్ నాయకుడి ఇంటి వద్ద ఘటన
♦ మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం
జడ్చర్ల: ఇంటిస్థలాన్ని దక్కించుకునేందుకు ఏకంగా తమ ప్రాణాలనే పణంగా పెట్టిందో కుటుంబం. దాయాదులు, మధ్యవర్తి కలసి స్థలాన్ని తమకు కాకుండా చేశారని కలతచెంది ఓ తండ్రి, నలుగురు కొడుకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. వారిలో ఇద్దరు కొడుకులు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లిలో చోటుచేసుకుంది. కురుమయాదవ సంఘం అధ్యక్షుడు గడ్డమీది వెంకటయ్య పదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన దొరసాని సులోచనమ్మ వద్ద 400 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు.
అప్పట్లో ఇరువురు బాండ్‌పేపర్‌పై ఒప్పందం రాసుకున్నారు. అయితే ఆ స్థలం వారి పేర రిజిస్ట్రేషన్ కాలేదు. ఇటీవల ఆ స్థలంలో కురుమ యాదవ సంఘానికి సంబంధించిన భవనాన్ని నిర్మించాలని.. తమకు సులోచనమ్మ ఆ స్థలాన్ని ఇచ్చిందని దాయాదులు, కులస్తులు నిర్మాణపనులు మొదలుపెట్టడంతో వివాదం రాజుకుంది. తాను కొనుగోలు చేసిన స్థలంలో సంఘ భవనాన్ని ఎలా కడతారని ప్రశ్నించిన వెంకటయ్యను అధికార పార్టీకి చెందిన సర్పంచ్ శ్రీనివాసులు, మండల టీఆర్‌ఎస్ నాయకుడు ఇర్ఫాన్ తదితరులు బెదిరించారు.
దీనిపై జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో వెంకటయ్య తన నలుగురు కుమారులు శ్రీశైలం, మహేశ్, చంద్రశేఖర్, కుమార్‌లను వెంటబెట్టుకొని ఆదివారం ఉదయం జడ్చర్లలోని ఇర్ఫాన్ ఇంటికి వచ్చాడు. తన స్థల సమస్యను పరిష్కరించాలని కోరాడు. ఆ స్థలం సంఘానికే చెందుతుందని, ఆశలు విడిచి పెట్టుకోవాలని ఇర్ఫాన్ చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వారు తమ వెంటే తెచ్చుకున్న పురుగుల మందును తాగారు. దీంతో బాధితులను వెంటనే బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో అందరినీ మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీశైలం(30), మహేశ్(28) మృతిచెంచారు. చంద్రశేఖర్, కుమార్‌ల పరిస్థితి విషమంగా ఉంది. తమ దాయాదులు, కొందరు కులస్తులు తన కొడుకుల ప్రాణాలను బలిగొన్నారని వెంకటయ్య భార్య మణెమ్మ విలపించింది. పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోకపోవడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని కన్నీరుమున్నీరైంది.
రెక్కలకష్టమే జీవనాధారం
వెంకటయ్య కుటుంబానికి రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. తనకున్న ఐదెకరాల్లో పత్తి, వరి ఇతర పంటలు సాగుచేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మృతిచెందిన పెద్దకొడుకు శ్రీశైలంకు భార్య సుమిత్రమ్మ, ముగ్గురు కొడుకులు ఉన్నారు. శ్రీశైలం ఆటో నడిపేవాడు. మరణించిన రెండో కుమారుడు మహేశ్‌కు భార్య యాదమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మహేశ్ గ్రామంలోనే డోజర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మరో ఇద్దరు సోదరులు హైదరాబాద్‌లో ఉంటున్నారు.
వివాదానికి కారణమైన స్థలం విలువ రూ.లక్షలోపే ఉంటుందని, ఇందుకోసం ప్రాణాలను పణంగా పెట్టడమంటే వారు ఎంతగా మనస్తాపానికి గురయ్యారోనని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమ వెనుక ఓ రాష్ట్ర మంత్రి ఉన్నారంటూ అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుల బంధువులు ఆరోపించారు.